SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Thursday, January 4, 2018

శ్రీవిద్యా ప్రస్థానం-26

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

26



క గంట తర్వాత ఆకర్ష అనుకుంది “ఏమైంది ఇవాళ ఇతనికి. ఇంతలా రెచ్చిపోయారు. కాని, నాకు చాలా బాగుంది. అంతసేపు ఏదో లోకంలో విహరించాను. ఇంతకు ముందు ఇలాంటి అద్భుతమైన అనుభవం కలుగలేదు.”
ఆమె చంచల్ని ఏమిటి విషయం అని అడుగుదామనుకుంది. అతని వైపు చూస్తే అతను అలసట తీర్చుకుంటూ కనిపించాడు. ఆ సమయంలో ఆమెకి అతను కొంచెం అసాధారణంగా కనిపించాడు. ఆమెకు అతని విశ్రాంతిని భగ్నం కలుగజేయాలని అనిపించలేదు. ఆమె మౌనంగా అక్కడనుండి వెళ్ళిపోయింది.
కొంచెంసేపటి తర్వాత చంచల్ స్నానం చేస్తూ ఇలా ఆలోచించసాగాడు. “ఏమైందివాళ్ళ నాకు? నేనెందుకిలా ప్రవర్తించాను? కౌళ పాఠాలు వినడం వలనా? గురువుగారు నాకు ప్రాథమిక అంశాలు మాత్రమే కదా? ప్రాథమిక అంశాలకే ఈ విధంగా ఉంటే లోతైన వషయం ఇంకెలా ఉంటుందో కదా? అసలు అలాంటి పూజావిధానాలు కూడా ఉంటాయా? చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా దీనిని నమ్మక తప్పడంలేదు. ఒకవేళ కౌళమే ఒప్పు అయితే అన్యస్త్రీసంపర్కం తప్పుకాదు కదా? ఏమో నేను ఆ సిద్ధాంతాలను తప్పుగా అర్ధం చేసుకుంటున్నానేమో”.
ఇలా ఆలోచనలతో అతను స్నానం ముగించి, మంత్రజపం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా అతడు రోజూకంటే ఆరోజు కొంచెం ఎక్కువ ఏకాగ్రతతో జపం చేయగలిగాడు. జపం అయిన తర్వాత “ఈరోజు జపం చాలా బాగా జరిగింది. ఇవ్వాళ్ళ నాఏకాగ్రత పెద్దగా చెదరలేదు. నేటి అనుభవాల దృష్ట్యా ఈరోజు జపం సరిగ్గా చేయలేనేమోనని అనిపించింది. కాని రోజూ కన్నా బాగా జరిగింది. అంటే ఈ లోకంలో తప్పు, ఒప్పు అన్నది లేదన్న మాట. కనుక నేను జీవితాన్ని మరింతగా ఎందుకు ఆనందంగా అనుభవించకూడదు? ఆ సమయంలో అతని మదిలో ప్రేమ మెదిలింది. ఎంత అందమైనది ఆమె. మా కాలేజ్ రోజులకన్నా ఆమె సొగసు, అందం మరింతగా పెరిగింది. ఆమె మొగుడు భలే అదృష్టవంతుడు. అంత అందమైన భార్యను పొందగలిగాడు. అతడికి మా సంగతి తెలీదు. పాపం అమయక పక్షి. చంచల్కు ఆ సమయంలో తన భార్య ఆకర్ష గుర్తుకు రాలేదు. ఇంతలో అతనికి అతని చరవాణిలో సంక్షిప్త సందేశం వచ్చింది. చూస్తే అది ప్రేమ నుండి “హాయ్” అని....
***

అదే సమయంలో పూర్ణ గురువుగారిని అడుగుతున్నాడు...
పూర్ణః గురువుగారు, చంచల్ ఇప్పుడిప్పుడే శ్రీవిద్యా సాధన ప్రారంభించాడు. ఈ ప్రారంభదశలోనే కౌళమును పరిచయం చేయడంవలన అతడు ఆ సిద్ధాంతాలను తప్పుగా అర్ధం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది కదా. నా అభిప్రాయం చెప్పినందుకు నన్ను క్షమించండి.
గురువుగారుః సాధారణ సాధకుల విషయంలో నువ్వు చెప్పింది అక్షర సత్యమే పూర్ణ. కానీ, చంచల్ సంగతి వేరు. అతడొక భ్రష్టుపట్టిన సాధకుడు. తన క్రిందటి జన్మలో అతడు శ్రీవిద్యోపాసన చేసాడు. కాని ఉధృతమైన కామ మరియు ఇతర లోభాలవలన అతడు భ్రష్టుపట్టాడు. క్రిందటి జన్మలో అతని ఉపాసన వలన అతడు మళ్ళీ ఈ జన్మలో ఉపాసన ప్రారంభించగలిగాడు. అతడి పూర్వజన్మల కర్మలను అతడు ఎంత త్వరగా క్షయపరచుకుంటే అంత మంచిది. అందుకై మనం అతడికి తోడ్పడాలి. అతని కర్మ క్షయమవనంతవరకు అతడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు. అతనికి అసలైన పరీక్షాకాలం ఇప్పుడు మొదలైంది. అతడు ఈ పరీక్షలో విజయుడైతే ఈ జన్మలో అతడు ఆధ్యాత్మికంగా చాలా దూరం ప్రయాణించగలడు. కానీ అతనికి ఆత్మానుభూతి, మోక్షం కలగాలంటే అతను మరియొక జన్మ ఎత్తితీరవలసిందే. ఒకవేళ అతడు ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోతే అతనికి మరో ఏడు జన్మలదాక మోక్షం ఉండదు. నా ఊహ నిజమైతే అతడు ఇప్పటికే అసహజ మరియు అధర్మ శృంగారానికై ఆలోచిస్తూ ఉంటాడు. జీవులకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నిజమైన శత్రువులు. వీటిబారిన పడకుండా తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకున్నవారు యోగులవుతారు. లేనివారు భోగులవుతారు. జీవులలో ఈ అరిషడ్వర్గాలు ఒకొక్కరికి ఒకొక్క స్థాయిలో ఉంటాయి. వీటిలో కామం చాలా ప్రమాదకరమైనది. చంచల్ లో ఈ కామశత్రువు మిగతా వాటికన్నా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది. చూద్దాం... అమ్మ అతని భవిష్యత్తును ఏవిధంగా నిర్ణయించిందో.
పూర్ణః గురువుగారు, మీరు జీవుల పూర్వ జన్మలు, రాబోవు జన్మలు తెలుసుకోగలరు. మరి నేనెందుకు తెలుకోలేకపోతున్నాను?
గురువుగారుః ఒకరి జన్మ రహస్యాలు తెలుసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఒకరి జాతకచక్రం ద్వారాగాని లేదా మంత్రసాధన ద్వారాగాని అది తెలుసుకోవచ్చు. మంత్రోపాసన ద్వారా అది తెలుసుకోగలిగితే దానిని సిద్ధి అని అంటారు. ఈ సిద్ధులు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధాలు. అవి సాధకుడిని మాయలో పడవేస్తాయి. తద్వారా వారు భ్రష్టుపట్టిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే శ్రీరామకృష్ణులవారు సిద్ధులు అశుద్ధాలని అనేవారు. కనుక నిజమైన సాధకులు సిద్ధులగురించి ప్రాకులాడకూడదు. ఏ సాధకుడికైనా ఈ సిద్ధులు కలిగినా అతడు వాటిని బాహాటంగా తన స్వలాభానికై ప్రదర్శించకూడదు. ఏవో కొన్ని నిజమైన అవసారల కొరకై సంఘప్రయోజనాలకై కొండకొచో అన్న విధంగా వాడుకోవచ్చు. ఈ రోజుల్లో అటువంటి నిస్స్వార్ధసాధకులు చాలా తక్కువగా ఉన్నారు.
అటువంటి నిస్స్వార్ధసాధకులలో మీరూ ఒకరు గురువుగారు అని అతను తన మనసులో అనుకొని...
పూర్ణః గురువుగారు, అటువంటి సిద్ధి ఏసాధకుడికైనా ఏవిధంగా కలుగుతుంది?