SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, June 21, 2017

శ్రీవిద్యా ప్రస్థానం - 10

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

10


గు రు సిద్ధులు  : శ్రీవిద్యా సాధన గూర్చి తెలుసుకోడానికి ఇంకా సమయం వుంది. ప్రస్తుతం సంధ్యావందనం బాగా సాధన చేయి.

చంచల్ ఒక్కసారి గా కొంత నిరుత్సాహపడి కాసేపట్లో తేరుకుని ఈ విధంగా అడిగాడు
చంచల్ : గురువు గారు నేను ప్రతిరోజూ ఇక్కడకు రావాలా?
గురు సిద్ధులు : అవసరం లేదు. నీకు వీలునప్పుడు రావచ్చు. ఈ రోజుల్లో ప్రజల జీవన పరిస్థితులు నాకు తెలుసు. మొదట నీవు నీ ఉద్యోగానికి ప్రాధాన్యత ఇవ్వు. భగవంతున్ని(అమ్మవారిని) ప్రతిచోట చూడాలి. అందుకే వృత్తి రూపేణ సంస్థితా... అంటారు. అంతే ప్రాధాన్య సాధనకూ ఇవ్వాలి. ప్రతి మనిషికీ 24గంటలే. కావలసినవన్నీ సాధించటానికి ఈ సమయం సరిపోతుంది. ప్రతి క్షణాన్ని చాలా విలువైనదిగా భావించి చాలా తెలివిగా పరిణతి చెందిన వ్యక్తిత్వంతో ఉపయోగించుకోవాలి. సమయం సద్వినియోగించుకునే పద్ధతిని అలవాటుచేసుకోవాలి.
చంచల్ గురువుగారికి కృతజ్ఞతలు తెలిపి వారి ఆశీస్సులు తీసుకుని ఉత్సాహం నిండిన మనస్సుతో బయలుదేరాడు. దారిలో రేపటినుండి ఖచ్చితంగా సంధ్యావందనం చేయాలి. ఇంకా తన రోజూవారి కార్యక్రమాలను గూర్చి ప్రణాళిక ఆలోచించుకుంటూ ముందుకు నడిచాడు. ఆ రోజున రాత్రి 8గంటలకే చంచల్ ఇల్లుచేరుకున్నాడు. చంచల్ అంత త్వరగా ఇంటికి రావడం తన భార్య అకర్ష, కూతురు మోహా కు ఒకింత ఆశ్చర్యం, ఆనందం కలిగించింది. చంచల్ కూతురు మోహా ఆనందంతో  తన చన్నారి చేతులతో చంచల్ కాళ్ళని చుట్టేసుకుని ఇలా అడిగింది....
మోహా: నాన్న ఈ రోజు ఇంత త్వరగా వాచ్చారేంటి?
చంచల్ : నీకోసమే ... తల్లీ
మోహా: అయితే ఈ రోజూ మీరు నాకు కథ చెప్పాలి. లేకుంటే నేను నిద్రపోను. నీవేప్పుడూ నాకు కథ చెప్పలేదు.
చంచల్ : తప్పకుండా బంగారం. నీకు కథ చెప్తాను.
చంచల్ కి తన కూతురు కళ్ళలో ఆనందం కనిపించింది. చంచల్ ఫ్రెష్  అయిన తరువాత మోహాను ఒడిలో కూర్చోపెట్టుకుని కథ చెప్పాడు. పాప కథవింటూ వింటూ అలాగే నిద్రలోకి జారుకుంది. నిద్రపోతున్న తన కూతురి మోహంలోకి చూసిన చంచల్ కి చెప్పలేని ఆనందం , సంతృప్తి కలిగాయి. మోహాను పక్కపై పడుకోపెడుతుంటే అకర్ష అడిగింది....
ఆకర్ష : ఎమిటీ విషయం? ఈ రోజు ఇంత త్వరగా ఇల్లు చేరటం ఆశ్చర్యంగా ఉంది.
చంచల్ : నీకోసమే...
ఆకర్ష : ఆహహ... కథలు చెప్పకండి. నేను మోహాను కాదు.
చంచల్ :  కథ కాదు... నిజం
అలా మాట్లాడుకుంటూ భోజనం చేసి, టి.వి జోలికి పోకుండా అలా... ఇద్దరూ కబుర్లు చెబుకుంటూ 10.30 కి నిద్రలోకి జారుకున్నారు. చంచల్ పోద్దున్నే 4.30 కి నిద్రలేవడం గూర్చి మరిచి పోకుండా అలారం పెట్టుకున్నాడు.
ఉదయమే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని, 5.30గంటలకు గురువు గారిచ్చిన విధిపూర్వకంగా సంధ్యావందనాన్ని ప్రారంభించాడు. క్రియా భాగం కొత్తకావడంతో కొంత జాగ్రత్తతో ముగించి గాయత్రి మంత్ర జపం ప్రారంభించాడు.
చంచల్ మంత్ర జపానికి కళ్ళు మూసుకొని మంత్ర జపం ప్రారంభించాడు.  తన నోరు మంత్ర జపంచేస్తోంది. మనస్సు మాత్రం తన ఆఫీసు విషయాలపైకి కాసేపు, మోహా, ఆకర్షని గూర్చి తరువాత తనకి నచ్చిన హీరో,హీరోయిన్ వైపు... అలా అలా చాలా విషయాలపై పరిభ్రమిచండం మొదలు పెట్టింది. అదే సమయంలో జపసంఖ్యను కూడా... చివరికి 108 సంఖ్య ముగియడంతో కళ్ళుతెరిచాడు.
చంచల్ కి చాలా సంతోషం కలిగింది. ఒక గొప్పకార్యాన్ని సాధించినట్టుగా కొంచెం సేపు గొప్పగా  తన గురించి ఊహించుకున్నాడు. ఈ విధంగా రెండునెలలు గడిచాయి. సంధ్యావందన క్రియ భాగం గురువుగారిచ్చిన ప్రతులను చూడకుండానే చేయడం వచ్చేసింది. కాని తను మాత్రం వివిధమైన భౌతిక విషయవాసనలతో నిండిన మనస్సుతో సంధ్యావందనం చేస్తున్నాడు. ఇంతకు ముందు కంటే తక్కువ సమయంలో సంధ్య పూర్తిచేసే విధంగా అలవాటైంది. కానీ మనస్సు మాత్రం ఎప్పటి మాదిరిగానే వివిధ విషయాలపైకి తిరిగేది. కానీ ఈ విషయం తనెప్పుడూ పట్టించుకునే వాడు కాదు. ఇంకా కొన్ని రోజుల తరువాత అతని నోరు, మనస్సు వాటి పని అవి చేసుకొని పోయేవి. కాని అతడు ఆ తేడాను మాత్రం గమనించలేకపోయాడు.
అమ్మ తన పిల్లన్నేప్పుడు గమనిస్తూనే ఉంటుంది. వారి ఎదుగుదలకు సరైన మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడూ వాటిని జాగ్రత్తగా గమనించి మనను మనమే సంస్కరించుకోవాలి.
ఒక రోజు చంచల్ జపం చేస్తుంటే జప స్ఫురణ కోల్పోయి, తను ఆకర్షతో గడిపిన క్షణాలు, ఆకర్ష అందచందాలు మనస్సులో నిండిపోయి జపాన్ని మరిచిపోయాడు. కాసేపటికి వెంటనే తేరుకుని, ఎమిటి ఇలా? ఈ సమయంలో ఈ ఆలోచనలు ఏమిటి? ఇలా జరుగుతోందేమిటి? అని తన్ను తాను తిట్టుకుంటూ ఎంత పాపంచేసాను, ఇది సరియైనది కాదు కదా అని పశ్చాత్తాప్పడుతూ ఆ ఆలోచనలు నిండిన మనస్సుతోనే జపం ఆపేసి మిగతా క్రియ పూర్తిచేశాడు.
జపం అయిన తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచించాడు. ఇన్ని రోజులూ తన జపం ఇంచుమించు ఇలాగే జరిగిందని అతడు గుర్తించాడు. ఇలా జరిగినందుకు చాలా బాధపడి, తను ఇప్పటి వరకు చేసిన సాధనంతా వ్యర్థం అని భావించాడు. వెంటనే మళ్ళీ ఎలా వ్యర్థమౌతుంది? నా జపం నేను విధిగానే నిర్వర్తించానే అని సమధాన పడ్డాడు. ఏమి తేల్చకోని అయోమయ స్థితిలో ఇంకా శ్రద్ధగా జపంచేయాలని నిశ్చయించుకున్నాడు.
మరుసటిరోజు నుండి ఎప్పటి మాదిరిగానే శ్రద్ధగా జపానికి కూర్చోని, జపం ప్రారంభించగానే  కాసేపటికి తన కూతురు మోహా మాటలు వినిపించాయి, వాళ్ళ అమ్మను ఏదో అడుగుతున్నట్లుగా....
మోహకు ఏమి కావాలి? అకర్ష మోహను పట్టించుకోకుండా ఎక్కడ ఉంది? అకర్ష అబ్బ ... నా భార్య ఎంత అందగత్తె. పేరుకు తగ్గట్టే ఆకర్షమైన రూపం. ఈ సారి తనతో ఎటైనా వెళ్ళాలి..... ఆఫీసుకి సెలవు పెట్టాలి. సెలవడిగితే బాస్ ఏమంటాడో? వాడసలే తిక్క మనిషి...... ఇలా కలకలిసిన ఆలోచనలతో చంచల్ జపం సాగుతోంది.
జపం ముగిసే సరికి మళ్ళీ తన అలోచలకి కళ్ళేం పడి  అరే ఎమిటిది? నా మనస్సు గతి తప్పి విహరిస్తొంది? ఎందుకిలా? జపం ఎలా కోనసాగించాలి ఇలాంటి పిచ్చి ఆలోచనలకతో? అని మధన పడుతూ ఉండగా తన గురువు గారు జ్నప్తికి వచ్చారు. అవును గురువు గారిని కలవాలి వారి ఆశీస్సులు, సలహా తీసుకోవాలి. చాలా రోజులైంది గురువు గారిని కలిసి, తప్పక రేపే వేళ్ళి వారి వద్ద నా ఈ అయోమయ పరిస్థితిగూర్చి తెలపాలి అనుకున్నాడు.
ఈ అయోమయ స్థితి సాధనలో పురోగతికి మలుపు. కానీ చాలామంది ఇలాంటి స్థితిలో నిరుత్సాహ పడి ఇంకముందుకు సాగలేమని నీరుగారిపోతారు. ఇలాంటి విషయాలు వారి గురువులతో చర్చించరు. సిగ్గుపడతారు. అనవసరంగా ఇతర స్నేహితులతో పంచుకుంటారు. కానీ ఇలాంటి సాధనకు సంబంధించిన అడ్డంకుల్ని అవరోధాల్ని గురువు గారితో చర్చించి వారి సలహానుగుణంగా సాధనచేస్తే ముందుకు సాగవచ్చు. గురువుల వద్ద ఎటువంటి దాపరికాలు లేకుండా సాధనలో కలిగే ప్రతి అనుభవాల్ని వారితో విచారిస్తే సాధన ప్రగతికి దారిచూపుతారు. లేకుంటే సాధన ముందుకు సాగటం కష్టం.


ఇంకావుంది....................


 

Thursday, June 15, 2017

శ్రీవిద్యా ప్రస్థానం - 9

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

9



చంచల్ అంతఃకరణను గూర్చి, చిత్తశుద్ధిని గూర్చి ఇంకా తెలుసుకోదలచి ఈ విధంగా అడిగాడు



చంచల్ : గురువు గారు, చిత్తం మనస్సు రెండు ఒకటేనా? 


గురువు గారు : కాదు రెండు వేరు వేరు. అంతః కరణములు మొత్తం నాలుగు. అవి మనస్సు, బుద్ధి, చిత్తం మరియు అహంకారం.  సాధనలో అంతఃకరణ శుద్ధి చాలా ముఖ్యవిషయము. 

సాధన గురు పరంపరాగతమైన గురువుల అనుజ్ఞానుసారం సాగవలసిన సాధన. వీడియోలు గట్రా చూసి సాధన ప్రారంభిస్తే ఆధ్యాత్మిక పురోగతి లేకపోగా వ్యతిరేఖ ఫలితాలు పొందవలసి వస్తుంది. నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి గురువులు చూపించిన బాటలో నడిచినపుడే చూడగలరు. 

చంచల్ : గురువు గారు, సంధ్యావందనం శ్రీవిద్య రెండూ ఒక్కటే అయినపుడు మరి శ్రీవిద్యోపాసనా పరులకు సంధ్యావందనం ఎందుకు?

గురు సిద్ధులు : చాలా మంచి ప్రశ్న. సంధ్యావందనం అర్హత అందరికి లేదు కానీ శ్రీవిద్యార్హత అందరికీ ఉంది. కుల, మత, లింగ భేదం లేకుండా అందరూ శ్రీవిద్యోపాసనకు అర్హులే. శ్రీవిద్యాసాధన సద్గురువుల ఉపదేశానుసారం ఎవరైన చేయవచ్చు. గురుఉపదేశం తప్పని సరి. అదే సంధ్యావందనం వైదిక ధర్మం. అర్హులైన వారు తప్పక చేయవలసిన నిత్య కర్మ. గాయత్రిని పరాశక్తి అని కూడా అంటారు. గాయత్రీ మంత్రం ప్రకట గాయత్రి కానీ అర్హులకు మాత్రమే ఉపాసించ వలసినది. పంచదశి అప్రకట గాయత్రి కానీ సద్గురువు ద్వారా పొందవలసినది. శ్రీమాతను సంధ్యా సమయాలలో గాయత్రిగా ఉపాసిస్తే రాత్రివేళ శక్తిగా ఉపాసించబడుతుంది. శ్రీవిద్యను చంద్రవిద్య అని కూడా అంటారు.
ఒక సైన్స్ విద్యార్థిగా నీకు సూర్యునికి, చంద్రునికి గల సంబంధం తెలుసు కదా? జీవుని బుద్ధి సూర్యోదయంతో వికసిస్తుంది. వికసించిన బుద్ధే అమృతతత్త్వాన్ని ఆస్వాదించగలదు. అమృతత్త్వం రాత్రులందు అనుభవమౌతుంది.
ఎవరైతే మా బుద్ధులను ప్రేరేపిస్తున్నారో వారికి నేను నమస్కరిస్తున్నాను  అని గాయత్రి మంత్రము యొక్క భావము.  శ్రీవిద్య, అంతిమ లక్ష్యమైన ఆత్మసాక్షాత్కారనిచ్చే విస్తారమైన ప్రక్రియ. శ్రీవిద్య తాంత్రికమైతే, సంధ్యావందనం వైదికం. తాంత్రిక పద్ధతులు తగు జాగ్రత్తతో, గురువుల పర్యవేక్షణలో సాధన చేయాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందుకే సంధ్యాసాధన సాధకుని తగిన విధంగా రక్షిస్తూ సాధనా మార్గంలో ముందుకు నడిపిస్తుంది.
ధర్మో రక్షతి రక్షితః అంటే ఇదే 
 
చంచల్ కి గురువు గారి మాటలతో కొత్త ఉత్సాహం కలిగింది. ఆహా ఎంత చక్కని అనుభవం అనుకుని గురువు గారి అవ్యాజ్యమైన ప్రేమకు పొంగిపోతూ తన అదృష్టానికి ఎంతో ఆనందపడ్డాడు.

ఇంతలో... మేని వర్చసుతో వెలిగిపోతున్న తేజస్సు కలిగిన ఒకతను గురువు గారి దగ్గరకు వచ్చి వారి పాదాలకు నమస్కరించాడు. గురువుగారతన్ని దీవించాడు.

గురు సిద్ధులు : ఎలావున్నావు పూర్ణ? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అంతా క్షేమమేనా? నీ సాధన ఎలా సాగుతుంది?

పూర్ణ : అంతా అమ్మ, అమ్మరూపమైన మీ దయ గురువు గారు అని బదులిచ్చాడు.

పూర్ణ తాను తీసుకొని వచ్చిన అరటిపళ్లు గురువు గారికి సమర్పించాడు. గురు సిద్ధులు వాటిని పూజగదిలో ఉంచమని చెప్పారు.
ఈ పరిణామానికి చంచల్ ఒకింత విస్మయం కలిగింది. గురువుగారు పూర్ణ ఇచ్చిన పళ్లు స్వీకరించి నేనిస్తే ఎందుకు తిరస్కరించారని అడగాలనుకున్నాడు కానీ అడగలేక పోయాడు.
 
చంచల్ : గురువు గారు శ్రీవిద్యదీక్షా పద్ధతులేమిటి? పాటించ నియమాలేమిటి?

అందుకు గురువు సిద్ధులు ఈ విధంగా చెప్పనారంభించారు

ఇంకావుంది...........
 

Monday, June 12, 2017

శ్రీవిద్యా ప్రస్థానం - 8

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

8



చంచల్ గురువుగారి ఇంటికి వెళ్ళే సరికి వారి శిష్యులలో ఒక బృందం వేదాలు వల్లేవేస్తుంటే ఆ వేదఘోషను గురువు గారు వింటున్నారు. చంచల్ నెమ్మదిగా గురువు గారిని సమీపించి వారి పాదాలను తాకాడు. గురువు గారిని చూడగానే  ఓ విధమైన తన్మయత్వంతో మైమరచిపోయాడు. గురువు గారు తన చేతిని చంచలుడి తలపైనుంచి దీవించారు. ఆ పై వారు చంచల్ ని ఉద్దేశించి...
గురువుగారు – ఇప్పుడు టైం ఎంత?
చంచల్ –7.30 అయ్యింది గురువుగారు
గురువు గారు – నేను ఈ రోజు నీకు సంధ్యావందనం నేర్పుతానని చెప్పాను
చంచల్ - అవునండి
గురువు గారు – కానీ ఇది సంధ్యావందన సమయం కాదు. వేదపాఠం కూడా ముగియ వచ్చింది
చంచల్ – క్షమించండి గురువుగారు. ఈ విషయమై టైం గురించి నాకు అంతగా అవగాహన లేదు
గురువు గారు – పోనిలే, ఇంకా సమయం వృదాచేయడమేందుకు? నేను నీకు సంధ్యావందనం పద్ధతిని గూర్చి చెబుతాను. ఇంతకీ మీది ఏ శాఖ? (గోత్ర ప్రవర పరంగా మీది ఏ శాఖ?)
చంచల్ – తెలియదు గురువుగారు
గురువుల వారు చంచల్ ఇంటి పేరు ఇతర వివరాలు తెలుసుకొని, నీవు యజుర్వేదీయ శాఖకు చెందినవాడివి కాబట్టి నీవు యజుర్వేద సంధ్యావందనం నేర్చుకోవాలి అని అన్నారు.
అదే విధంగా  యజుర్వేద సంధ్యావందనం పద్ధతిని సవివరంగా చంచల్ కి వివరించారు. దానికి సంబంధిచిన క్రియా ప్రతులనిచ్చారు.
చంచల్ తాను క్రితంరోజు మార్కెట్లో కొన్న అరటిపళ్లను గురువుగారికి సమర్పించబోయాడు. దానికి గురువుగారు
బాబు నేను నా విద్యార్ధులనుండి ఏవిధమైన ప్రతిఫలాన్ని అంగీకరించను. ఇవి నీతోనే ఉంచు అన్నారు అని సున్నితంగా తిరస్కరించారు.
చంచల్ ఆశ్చర్యపోయి దయతో స్వీకరించమని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నాడు. దానికి గురువుల వారు – లేదు నాన్న! ఇవి మీ పిల్లలకి ఇవ్వు. నేను నా విద్యార్ధులనుండి ఏమీ స్వీకరించను అని అన్నారు. ఈ సారి గురువు గారి మాటలో గాంభీర్యం స్ఫురించింది. గురువు గారి మాట శిరసావహించడం చాలా ముఖ్యం.
చంచల్ ఆ అరటిపళ్ళను నిరుత్సాహంగా వెనక్కి తీసుకుని, ఈ విధంగా అడిగాడు
చంచల్ – గురువు గారు, నాదో సందేహం అడగమంటారా?
గురువు గారు – అడుగు.
చంచల్ -  శ్రీవిద్యకు, సంధ్యావందనానికి సంబంధమేమిటి? సంధ్యావందన అర్హతలేని వారు శ్రీవిద్య సాధనకు అనర్హులా? దయతో నా సందేహన్ని మన్నించి వివరించండి.
గురువు గారు- నిజానికి సంధ్యావందనానికి, శ్రీవిద్యకు తేడాలేదు. సంధ్యావందనంలో మూడు కాలాలలో అంటే ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలాలో త్రిపుటిగా సవితా దేవత ఉపాసన చేస్తారు.  ఆజ్ఞా చక్రం మానవ శరీరంలో త్రిపుటి. నిజానికి ఆజ్ఞా చక్రం సంధ్య.ది ఇడా, పింగళా మరియు సుషుమ్నా నాడులు కలిసే కూడలి. ఈ ఆజ్ఞాచక్రం శ్రీవిద్య ఉపాసనలో చాలా ముఖ్యం. సవితా దేవత మరియు శ్రీవిద్య ఉపాస్య దేవత శ్రీమాతా ఇద్దరూ కూడా తేజో స్వరూపాలు.
ఇంకా శ్రీమాత బ్రహ్మాండమండల మధ్యస్థగా కొలవబడుతుంది. గాయత్రీ మంత్ర అర్థము మరియు శ్రీవిద్యా మంత్ర (పంచదశీమంత్రం) ఒకటే. ఇంకా పంచదశీ మంత్రం ఒకసారి చేస్తే మూడుమార్లు గాయత్రి మంత్రం చేసినట్లు అవుతుంది. ఈ విషయమై మరిన్ని వివరాలు తరువాత చెబుతాను.
సావిత్రి ఆరు ఋతువులలో ఉపాసించబడుతుంది అదే విధంగా శ్రీమాత మానవుని స్థూల శరీర షట్చక్రాలలో ఉపాసించ బడుతుంది.
గాయత్రి మంత్రంలో 24 బీజాలకు వ్యాహ్రుతి బీజాలను చేర్చితే మొత్తం 28 అక్షరాల మంత్రమౌతుంది. అదే విధంగా శ్రీవిద్యలో మహాషోడశి 28 అక్షరాల మంత్రం.

గాయత్రి ఉపాసనలో స్థూల, సూక్ష్మ శరీరాలు శుద్ధవుతాయి. అదేవిధంగా శ్రీచక్రపూజ కూడా, కానీ విస్తారంగా ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు కొందరు    సూక్ష్మమైన అంతర్గత విషయాన్ని తెలుసుకోకుండానే, గురుపరంపర లేకుండానే, శక్తిపాతాను సారంగా మంత్రాన్ని పొందకుండానే అంతర్జాలంలో దొరికే వీడియోల సాయంతో శ్రీచక్ర సాధన  చేస్తూ తమను తాము గొప్ప ఉపాసకులుగా భావించుకుంటున్నారు. అంతే కాక ఇతరులకు నేర్పే ప్రయత్నం చేస్తున్నారు.
చంచల్ – అలా ఎందుకు గురువు గారు?
గురువు గారు – అదే మాయ. ఏదో ఓ చోట శ్రీచక్రపూజ చాలా మంచిది అని చదివి, ఈ పూజ వల్ల ఏవో గోప్ప ప్రాపంచిక భోగాలను గురించి విని, (పేరు, డబ్బు, స్త్రీ ఇత్యాదులనాశించి) వీటన్నికీ ఇది దగ్గరి దారి అని భావించి ప్రారంభిస్తారు. శ్రీవిద్య పరంగా ఉన్నట్టి వివిధ ఆచారాలు సాంప్రదాయాలను గూర్చి వారికసలు తెలియదు. వారికి సరిగా మార్గదర్శనం చేసే గురువు దొరకకుండానే శ్రీవిద్యోపాసన మొదలుపెడతారు. దొరకక అనడం కంటే కూడా సరియైన గురువును అన్వేషించకుండానే అనడం సబబు. ప్రతిదీ చిటికెలో జరగాలనే ఓ తాపత్రయం. వీరందరికీ కూడా వారి భౌతిక, లౌకిక విషయవాంలను గూర్చిన తాపత్రయమే తప్ప అంతిమ సత్యమైన ఆత్మానుభూతిని గూర్చిన తాపత్రయం ఉండదు. విచారకరమైనది ఏమిటంటే, వారు ఈ నిజాన్ని ఒప్పుకోలేరు. పైగా వారికి ఆత్మదర్శనమైనట్టుగా ప్రచారం చేసుకుంటారు కూడా. ఇదంతా ఓ గమ్యంలేని పిచ్చిప్రయాణం, తమను తామే ఈ మాయా కూపంలోకి తోసివేసుకోవడం.
సంధ్యావందనాన్ని ఆచరించని వారు కనీసం వారి తల్లిదండ్రులను, సూర్యభగవానుని ప్రార్థించాలి.
ఇంకా గురువులవారు చేపుతున్నారు...
చూడు నాయనా! సాధనలో తగిన సమయ పాలన తప్పనిసరి. బ్రాహ్మీమూహుర్తంలో నిద్రలేవడం ( సూర్యోదయానికి 48 నిముషముల ముందు) బ్రాహ్మీమూహూర్తంలో సాధన చేయడం చాలా ఉత్తమమం. ఈ సమయంలో సాధన చేసే సాధకుడు సాధనా ఫలితాన్ని తొందరగా పొందుతాడు. దైవస్వరూపంగా మారతాడు.
చంచల్ – గురువు గారు, కొందరంటారు సాధన ఏ సమయంలో నైనా చేయచ్చని, ఇది నిజమేనా?
గురువు గారు -  నిజమే, కానీ ఎవరికి? ఎవరికైతే చిత్తం శుద్ధి జరిగిందో వారికి. కానీ సాధన ప్రారంభంలో వేకువ గడియలలో(బ్రాహ్మీమూహూర్త) సాధన చాలా మంచిది, ముఖ్యంకూడా. కేవలం బద్ధకస్తులు మాత్రమే ఈ విధంగా కప్పి పుచ్చుకుంటారు. కానీ బద్ధకంతో చేసే సాధన ఫలిస్తుందా?

చంచల్ – అలా ఎందుకు గురువు గారు?
గురువు గారు -  ఎందుకంటే మనకు చిత్తశుధ్ధి లేకపోవడం. శుద్ధి జరగని చిత్తం ఏకాగ్రతను, ధారణను పొందలేదు. ప్పుడూ వివిధ విషయాలవైపు మనస్సును పరిగెత్తిస్తుంది. నీవు జపం చేయడం ప్రారంభించిన తరువాత ఈ విషయం నీకు అర్థమౌతుంది. బ్రాహ్మీమూహూర్తం దైవముహుర్తం. బాగా గాఢమైన నిద్రను (సుషుప్తి దశ) అనుభవించేవారికి కొంత సమయం వరకు శరీరం, మనస్సు కొత్త ఉత్సాహంతో ఉంటాయి. అందువల్ల త్వరగా నిద్ర పోవడం, త్వరగా నిద్రలేవడం చాలా మంచి అలవాట్లు. సాధకులకు అవసరం కూడా. అంతేగాని, రాత్రి పన్నెండు, ఒంటిగంట దాకా పార్టీలని, పబ్ లని తిరిగి తెల్లారి ఎప్పుడో తొమ్మిదికో, పదికో నిద్రలేస్తే ఏం ఫలితం ఉంటుంది? రోగాలు తప్ప.
చంచల్ కి రాత్రి తమ పార్టీ సంగతి గుర్తుకొచ్చింది.
గురు సిద్ధ చెప్పసాగారు -  ఒకసారి అంతః కరణ శుద్ధిపొందిన తరువాత సాధన ఎప్పుడైనా చేయవచ్చు. ఈ విషాయలన్నీ ముందు ముందు నీకర్థమవుతాయి.

ఇంకావుంది.........