SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Monday, October 30, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-21

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

21



మర్నాడు చంచల్ కొత్త ఉత్సాహంతో, కొత్త చైతన్యంతో తన సాధనను ప్రారంభించాడు. గురువుగారు వివరించిన ధ్యానశ్లోకముల అర్ధాలను భావించుకుంటూ ఆయా దేవతల రూపాన్ని తన మనస్సులో రూపొందించుకోసాగాడు. గురువుగారు బోధించిన సరియైన మంత్ర సాధనను అమలుపరచుకుంటూ మంత్ర జపం చేయసాగాడు. ఇంతకు ముందుతో పోల్చితే అతని ఆలోచనలు పూర్తిగా కాకపోయినా కొంచెం తగ్గాయి. ఆలోచనలను పూర్తిగా ఎలా అరికట్టాలో అతనికి అంతుచిక్కడంలేదు. ఈ విధంగా రెండు మాసాలు గడిచాయి. ఒక బహుళ చతుర్దశి రోజున అతడు చాలా శ్రద్ధగా బాలాత్రిపురసుందరి మంత్రజపం చేస్తున్నాడు. ఆరోజు అతని మనస్సు ఒకింత నిశ్చలంగా ఉంది. కొంచెంసేపటి తర్వాత అతనికి సన్నగా గాజులశబ్దం, కాళ్ళపట్టీల శబ్దం వినిపించాయి. ఆకర్ష గాని, మోహ గాని ఆ వైపుగా వచ్చి ఉంటారని అతడనుకున్నాడు. వాళ్ళెందుకు ఇటుపక్క రావాలి? నేను జపం చేసుకుంటున్నానని తెలుసు కదా!. అనవసరంగా నా ధ్యానాన్ని భంగపరచడం కాకపోతే. నా జపం ఎంత చక్కగా సాగుతోంది. నాలో ఏదో కొత్త శక్తి పుట్టుతున్నట్టుగా ఉంటోంది. ఇలాంటి అనవసరమైన ఆటంకాలు లేకపోతే నాకు మంత్రసిద్ధి త్వరగా కలుగుతుంది కదా. దేవతా దర్శనం కూడా తప్పక కలుగుతుంది. గురువుగారు నాకు ఈ జపరహస్యాలు ముందుగానే చెప్పవలసింది. నాకెందుకు ముందుగా చెప్పలేదు. గురువులు తన శిష్యులను ఈ విధంగా ఎందుకు పరీక్షిస్తారు? అసలు ఇలాంటి పరీక్షలు అవసరమా? పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. గురువుగారు నన్ను ఇప్పటికైనా కరుణించారు. ఇటువంటి మరిన్ని రహస్యాలను గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అసలు ఇంకా ఏమైనా రహస్యాలు ఉంటాయా? ఒక దేవతా ఉపాసనకు ధ్యానశ్లోకము, మంత్రములేకదా ముఖ్యం. ఇంతకన్నా ఇంకే రహస్యాలుంటాయి? ఏమోఇంకా ఏమైనా ఉంటే అవి గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. మంత్రోపాసనలో దిగ్గజడుని కావాలి. అలా కావాలంటే నేను గురువుగారిని ప్రసన్నం చేసుకోవాలి పూర్ణలాగ. గురువుగారికి పూర్ణంటే చాలా ఇష్టంలాగ ఉంది. పూర్ణ గొప్పతనం ఏమిటి? అతడు ఎప్పుడూ గురువుగారి వెంటే ఉంటాడు. గురువుగారు అతనికి కూడా ఈ సాధనా రహస్యాలు చెప్పి ఉంటారా? చెప్పేఉంటారు ఎందుకంటే అతడు గురువుగారిని ఎప్పుడూ వదలడు కదా. సరె, అతని సంగతి నాకెందుకు? నేను గురువుగారి ప్రియశిష్యుని కావాలి. పూర్ణని మించి గొప్ప సాధకుని కావాలి. అప్పుడు అందరూ నాదగ్గరకు కూడా వారి సమస్యలను తీర్చుకోవడానికై వస్తారు. నేను కూడా ఒక గురువుని అవుతాను.

ఈవిధంగా అతని ఆలోచనలు ఒకపక్క, మంత్రజపం ఒకపక్క పరిగెట్టసాగాయి. కాని, హఠాత్తుగా అతని బుద్ధి ఒక్కసారిగా పనిచేసింది. “అరేనేనేమి చేస్తున్నాను? ఎందుకిలా ఆలోచిస్తున్నాను? నేనీ విధంగా ఆలోచించడం సరియైనదేనా? పూర్ణ మీద నేనెందుకు అసూయ చెందాలి? అతడు ఎంతో గొప్ప ఉపాసకుడు. గురువుగారితో అతడు ఎన్నో గొప్ప విషయాలు చర్చిస్తూ ఉంటాడు. నాకా విషయాలు అసలు అర్ధమేకావు. అలాంటి నేను వారి గురించి ఈ విధంగా ఆలోచించడం ఎంత తప్పు అని తనకు తాను అనుకున్నాడు.
ఇలాంటి పిచ్చి ఆలోచనలను కట్టిపడేయాలి అని చాలా గట్టిగా నిర్ణయించుకొని తిరిగి మంత్రజపం మీద ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించసాగాడు. ఆ ప్రయత్నంలో అతడు అమ్మవారిని ఈ విధంగా ప్రార్ధించసాగాడుఅమ్మా! నన్ను దయతో రక్షించి, నడిపించు. నా ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో నన్ను ఉత్తీర్ణుడిని చెయ్యి. నాకు నువ్వు తప్ప మరెవరు ఉన్నారు? నాకు నీ పాదాలే శరణ్యం. నీ సాయుజ్యం తప్ప మరేమీ అక్కర్లేదు. భార్య, పిల్లలు, బంధువులు అనే లౌకిక పరమైన బంధాలనుండి నన్ను విముక్తిడిని చేసి శాస్వతమైన బ్రహ్మపదమునకు నన్ను చేర్చు”.
ఆసమయంలో అతడికి దగ్గరగా ఎవరో కదులుతున్నట్టుగా మళ్ళీ అనిపించింది. అతడికి కొంచెం కోపం వచ్చి వెంటనే కళ్ళు తెరచి ఆ శబ్దం వచ్చిన దిశగా చూసాడు. ఆశ్చర్యంగా అక్కడ అతడికి ఎవరూ కనిపించలేదు. కొన్ని క్షణాలపాటు అతడు నిర్ఘాంతపోయాడు. ఆకర్షను, మోహను గట్టిగా పిలిచాడు. వారినుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. ఏంటి ఎవ్వరూ పలకరు అని తనలోనే కొంచెం చికాకు పడ్డాడు. కానీ అంతలోనే అతనికి గుర్తుకొచ్చింది వారిద్దరూ నిద్రపోతున్నారని. తన అనుమానాన్ని తీర్చుకోవడానికై అతడు వారి పడకగది వైపు గబగబా వెళ్ళాడు.


ఇంకావుంది.......
 



 

Friday, October 20, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-20

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

20


ఈ విధంగా ఈ మంత్రాన్ని ఉపాసించాలి అని గురువుగారు చంచల్ కు విశదీకరించారు.

చంచల్ః ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది గురువుగారు. ఒక మంత్రం యొక్క నిజమైన సాధనా ప్రక్రియ తెలుసుకుంటేనే ఇంత ఆనందంగా ఉంటే, ఇక ఉపాసిస్తున్నప్పుడు ఇంకెంత ఆనందంగా ఉంటుందో కదా!. ఇది విన్నప్పటి నుండి నాలో ఏదో కొత్త శక్తి ప్రవహిస్తున్నట్టుగా ఉంది. అంతర్లీనంగా ఏదో శక్తి నన్ను ఇప్పుడే, ఇక్కడే మంత్ర జపానికి ప్రోద్బలిస్తోంది. గురువు గారు, నేను ఇప్పుడు కొంచెంసేపు జపం చేయవచ్చా?
గురువుగారు చిన్నగా నవ్వి, సరే అని తల ఊపారు.

చంచల్ పద్మాసనం వేసి మంత్ర ధ్యానానికి కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని ధ్యానశ్లోకంలో దేవతను వర్ణించిన విధముగా ఆ దేవతా రూపాన్ని భావించుకోవడానికి ప్రయత్నించసాగాడు. అలా ప్రయత్నం మొదలు పెట్టగానే ముందుగా అతనికి ప్రేమ రూపం కనిపించింది. ఒక్కసారిగా హతాశుడయ్యాడు. ఆ సమయంలో అతనికి ఆకర్ష కాకుండా ప్రేమ రూపం ఎందుకు కనిపించింది? చాలా బలవంతంగా ప్రేమ రూపాన్ని తన ఆలోచనలోంచి తీసివేసి మళ్ళీ దేవతా రూపాన్ని ధ్యానించడానికి ప్రయత్నించసాగాడు. అయినా సరే, అతనికి దేవతా రూపం కాకుండా వేరే ఏవేవో సంబంధంలేని ఆలోచనలు, రూపాలు అతని మస్తిష్కంలోని, కళ్ళముందు తిరుగాడసాగాయి. మంత్ర జపం చేసుకుంటూనే తన మనసుని స్థిరంగా ఉంచడానికి తీవ్రంగా ప్రయత్నించసాగాడు. గురువుగారు చెప్పిన ధ్యానపద్ధతులను అమలుపరచాడినికి చాలా కష్టపడసాగాడు. అలా కష్టపడడంలో అతని ఆలోచనలు కొన్ని క్షణాలు పాటు ఆగాయి. నేను ఆలోచనలను జయించాను అని అతడు అనుకున్నాడు. అలా అలోచించడం కూడా ఒక ఆలోచనే అన్న విషయం అతనికి తెలియలేదు. మరి వెనువెంటనే ఈసారి అతనికి మోహ గుర్తుకు వచ్చింది. అరెమోహ ఏది. ఇక్కడికి వచ్చాక నేను తన గురించి పట్టించుకోలేదే? ఎక్కడ ఉంది తను? ఏం చేస్తోంది తను? తనని గట్టిగా పిలుద్దామనుకున్నాడు. ఇంతలో తను ఆశ్రమంలో ఉన్న సంగతి గుర్తుకొచ్చి తను క్షేమంగానే ఉంటుందిలే అని సమాధాన పడి తనని పిలవాలన్న ఆలోచనని విరమించుకున్నాడు. మళ్ళీ మంత్రజపం మీద దృష్టి నిలపడానికి ప్రయత్నం చేయసాగాడు. ఎప్పుడైతే అతను అటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడో అప్పుడు అతనికి ఈసారి ఆకర్షతో అనుభవించిన శృంగారచేష్టలు గుర్తుకు రాసాగాయి. అంతేఆ సమయంలో అలాంటి ఆలోచన వచ్చినందుకు అతనికి అతనిమీదే కోపం, చిరాకు అసహ్యం కలిగాయి. కొంచెంసేపటి తర్వాత తేరుకొని, నాకెందుకు ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయి. గట్టిగా అరవాలని అనుకున్నాడు. కానీ తనను తాను సంభాళించుకొని ఇక జపం చేయడం తన వల్ల కాదనుకొని కళ్ళు తెరచి చూసాడు. అతనికి ఎదురుగా తననే గమనిస్తున్న గురువుగారు కనిపించారు.

గురువుగారు చిన్నగా నవ్వి, ఏమీ దిగులు చెందకు నాయనా. నీ కుటుంబసభ్యులు ఇక్కడ క్షేమంగానే ఉన్నారు. నీ బుర్రలోకి వస్తున్న ఎటువంటి ఆలోచనలను లక్ష్యపెట్టక ధ్యానదేవతను మాత్రమే ధ్యానించడానికి ప్రయత్నిస్తూ ఉండు అని చెప్పి తన కుడి అరచేతిని చంచల్ సహస్రార చక్రం మీద కొన్ని క్షణాలు ఉంచారు.

గురువుగారి ఆ చర్యతో చంచల్ మెదడు కొంత ప్రశాంతతని పొందింది. చంచల్ కళ్ళు మూసుకొని ధ్యానశ్లోకాన్ని పఠించసాగాడు. నెమ్మదిగా ఆ శ్లోక అర్ధాన్ని గుర్తుతెచ్చుకుంటూ ఆ దేవతా రూపాన్ని భావించసాగాడు. ఇప్పుడు అతడు నెమ్మదిగా మంత్ర జపం చేయసాగాడు. దేవతారూప భావన ఒక వైపు మంత్ర జపం ఒక వైపు. అనవసర ఆలోచనలు మరోవైపు. కానీ ఈసారి ఆశ్చర్యంగా ఆ ఆలోచనలు అతని ధ్యానానికి పెద్దగా అడ్డుపెట్టలేదు. అతడి చేతిలో రుద్రాక్షమాల గాని, తులసిమాల గాని లేదు. ధ్యానదేవతమీదే దృష్టి నిలిపి మంత్ర సంఖ్య లెక్కలేకుండానే జపం చేయసాగాడు. ఇప్పటి ధ్యానానికి ఇంతకు మునుపు చేసిన ధ్యానానికి తేడా ఏమిటి? శక్తియుక్తమైన గురువుగారి చేతి స్పర్శతప్ప. అందుకే మనకు ప్రత్యక్షగురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. అంతేకాని, ఏవో పుస్తకాలు పట్టుకొని, ఇంటెర్నెట్ గురువులతో ఆన్ లైన్ దీక్షలు తీసుకుంటే ఒరిగేదేమిటి?

కొంచెంసేపటి తర్వాత చంచల్కు గంటానాదం వినిపించింది. అతడు నెమ్మదిగా ఈలోకంలోకి వచ్చాడు. అతడికి గురువుగారి ఆశ్రమంలో ఉన్నానని గుర్తుకువచ్చింది. కళ్ళు తెరచిచూస్తే అక్కడ ఎవరూ కనబడలేదు. నెమ్మదిగా ఆశ్రమపూజా మందిరం దగ్గరకి నడుచుకొని వెళ్ళాడు. అక్కడ గురుమా గౌరీజీ ఆకర్షకు ఏదో చెబుతూ కనిపించారు.

గౌరీజీః ఆధ్యాత్మిక జీవితంలో శ్రీలలితాసహస్రనామాలు చాలా ముఖ్యమైనవి. వాటిని వాగ్దేవతలు అమ్మవారి మీద రచించారు. శ్రీవిద్యకు సంబంధించిన అన్ని మంత్రములు, రహస్యములు అందు నిక్షిప్తమై ఉన్నాయి. అంతెందుకు? శ్రీవిద్యాసారమే శ్రీలలితాసహస్రనామాలు. వీటిని రహస్యనామాలని కూడా అంటారు. శాస్త్రముల ప్రకారం స్త్రీలకు కొన్ని మంత్రాలు ఇవ్వడం జరగదు. కానీ శ్రీలలితాసహస్రనామాలను పూర్తి విస్వాసం, భక్తి, శ్రద్ధ కలిగి సాధన చేస్తే మంత్రఫలితం కన్న ఎక్కువ ఫలితాలను పొందవచ్చు. అమ్మవారికి ఈ నామాలంటే మహాప్రీతి. ఈ నామ సాధన రాత్రి పూట ఎక్కువ ఫలితాన్నిస్తుంది. ఒకొక్క నామానికి అర్ధాన్ని తెలుసుకుంటూ నామపారాయణ చేస్తే ఆ నామ అర్ధ రూపము రాత్రి కలయందు దర్శనమవుతుందనుటలో ఏమాత్రం సందేహం లేదు.

మీరు చెప్పినట్టుగా తప్పక చేస్తాను అమ్మ అని ఆకర్ష గురుమా పాదాలను తాకి ఆమె ఆశీర్వాదము తీసుకొంది.

గురుమా ఆకర్షకు శ్రీలలితాసహస్రనామాలు బోధించారని చంచల్ కు అర్ధమయ్యి చాలా సంతోషించాడు
.
చంచల్ పూజాగదిలోకి వెళ్ళాడు. అక్కడ గురువుగారు మహానైవేద్యాన్ని నివేదిస్తూ కనబడ్డారు. కొంచెంసేపటి తర్వాత గురువుగారు అక్కడ ఉన్నవారికి తీర్ధమిచ్చి ఆశ్వీరదించారు.
చంచల్ చెమ్మగిల్లిన కళ్ళతో గురువుగారి కాళ్ళమీద భక్తి పూర్వకంగా పడి, మీదయ వలన మొదటిసారిగా మంత్రమంటే ఏమిటో, ధ్యానమంటే ఏమిటో తెలుసుకున్నాను అని అన్నాడు. ఆ సమయంలో అతనికి కలిగిన ఆనందంలో అతను పూర్తి స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడు. అతని మాట తడపడుతున్నాది. గురువుగారు అతని పరిస్థితిని అర్ధం చేసుకొని అతని భుజం మీద తడుతూ అతనిని ఆశీర్వదించారు.
మధ్యాహ్న భోజనం అయిన తర్వాత చంచల్ తన కుటుంబంతో తన ఇంటికి బయలుదేరాడు. దారిలో

ఆకర్షః ఆశ్రమం చాలా ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంది. ఈ మధ్యకాలంలో నేను ఇటువంటి ప్రశాంతతను పొందలేదు. నిజం చెప్పాలంటే మనం తరచూ వెళ్ళే బార్లు, పబ్బులలో ఇటువంటి ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదు. అలాంటి చోట్ల ఉండేది కరాళ ఆనందం మాత్రమే. అది శరీరానికి మాత్రమే. మనస్సుకు కలిగే ఆనంద రుచి ఏమిటో ఈ రోజే చవిచూసాను. గురమాజి ఎంతటి నిర్మలమైన మనిషి. ఆమె కళ్ళల్లో ఏదో చెప్పరాని ఆకర్షణ ఉంది. ఆమె మాట్లాడుతుంటే అమృతం కురుస్తున్నట్టుగా ఉంది. నిజంగా అమె గొప్ప వ్యక్తి.

మోహః అవును అమ్మ. ఇక్కడ చాలా బాగుంది. ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు నాకు. మేమందరం ఇక్కడ ఉన్న ఆవులతోను, వాటి పిల్లలతోను (ఆవు పెయ్య) ఎంతో బాగా ఆడుకున్నాం. అందరం కలసి ఆవులు ఎన్ని ఉన్నాయో, వాటికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో లెక్కపెట్టాం. ఇక్కడకు మళ్ళీ వద్దాం నాన్న.

మోహను చూసి చంచల్, ఆకర్ష చాలా ఆశ్చర్యపోయారు. ఎప్పుడైన వారు బయటకు వెళ్ళి వచ్చేటప్పుడు ఆమె చాలా అలసటగా ఉండేది. మొదటి సారి ఆమెను వారిప్పుడు ఇంత ఉత్సాహంగా చూస్తున్నారు. స్వేచ్చాయుతమైన విద్య వలన కలిగే లాభాలను వారు గ్రహించారు.


గురువుగారి సమక్షంలో తను ధ్యానం చేసినప్పుడు కలిగిన అనుభూతులను గుర్తుచేసుకోవడానికి చంచల్ ప్రయత్నించసాగాడు. కాని అతనికి ఏమీ గుర్తుకు రావడంలేదు. దాని గురించి మరచిపోయి, చాలా తీవ్రమైన సాధన చేయాలి అని అతను అనుకున్నాడు. కాని, ఆ సమయంలో అతనికి తెలియదు తను చాలా తీవ్రమైన ఆధ్యాత్మిక పరీక్షను ఎదుర్కొనపోతున్నాడని. కాలాన్ని మించిన గురువు లేదు. తన పిల్లలను ఎలా సరియైన దారిలో పెట్టాలో కాలానికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. కాలమే భైరవుడు. భైరవుడే శ్రీమాత. అమ్మకు తన పిల్లల గురించి తెలిసినంతగా మరెవరికీ తెలియదు కదా!



ఇంకావుంది.......
 

శ్రీవిద్యా ప్రస్థానం-19

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

19


మంత్రములు ఏకాక్షరములు లేక అంతకంటే ఎక్కువ అక్షరములు కలిగి ఉంటాయి. మంత్రములలోని ఈ అక్షరములనే బీజాక్షరములని అంటారు. అ నుండి క్షం వరకు కలిగిన అక్షరముల కలయిక వలన కొన్ని బీజాక్షరములు రూపొందుతాయి. అక్షరములకు శక్తిని కలుగజేసే లక్షణం ఉంటుంది. ఆ శక్తి ఉత్పాదన ఆయా అక్షరములను ఉచ్చరించడాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఒక సాధకునకు బీజాక్షరములయొక్క స్వర (ఉచ్ఛారణ) పద్ధతి తప్పక తెలిసి ఉండాలి. ఆ పద్ధతులు తెలుసుకోకుండా మంత్ర సాధన చేయడం వలన ఉపయోగమేమీ ఉండదు. జీవులన్నీ ఒకరితో ఒకరు ఏదో ఒక భాష ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాయి. అయితే ఆ భాషలు అన్నీ మంత్రాలు కావు. దేనికైతే శక్తి జనిత సామర్ధ్యం ఉంటుందో అదే మంత్రము. మంత్రము యొక్క ఉచ్చారణ పద్ధతి, మన శరీరములోని వాటి జనన స్థానము, న్యాసము మొదలగు విషయములను తెలుసుకొని అప్పుడు మంత్ర సాధన చెయ్యాలి. ఈ పద్ధతులన్ని ఆయా మంత్రాలతో సిద్ది పొంది, వాటి మర్మాలను తెలుసుకొన్న సాధకుని ద్వారా గ్రహించాలి. అంతే కాని, ఏవో పుస్తకాలు చదివి, ఇంటర్నెట్  ద్వారా సమాచారం సేకరించి, ఆడియోలు, వీడియోలు ద్వారా మంత్రసాధన చేయకూడదు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా మంది ఇతువంటి మాధ్యమాలద్వారానే మోక్షాన్ని పొందుదామని అనుకొంటున్నారు. మన పూర్ణకు కూడా అటువంటి అనుచరులు ఉన్నారు. వారు అతని విద్యార్ధులేగాని, శిష్యులు కారు.



అవునన్నట్టుగా పూర్ణ చిరునవ్వు నవ్వుతూ చిన్నగా తల ఊపాడు.



చంచల్ః నేను చాలా అదృష్టవంతుడిని గురువుగారు. మీలాంటి సిద్ధ పురుషులు నా గురువుగా తారసపడడం నిజంగా నేను చేసుకొన్న పూర్వజన్మ పుణ్యఫలమే.

అతడు కొనసాగించాడు…. గురువుగారు, అన్ని మంత్రాలు ఒక్కటే అని మీరు ఒకసారి చెప్పారు. అలాగయితే ఇన్ని కోట్ల మంత్రాలు ఎందుకు?

గురూజీః అన్ని మంత్రాలు సాధారణ మనుషులమైన మనవంటివారికి. సిద్ధపురుషులైన శ్రీరమణ మహర్షిలాంటి వారికి కాదు. వారు ఈ జన్మలో అనుభవించిన స్థితికి రావడానికి ఆయన ఎన్ని జన్మల సాధనా ఫలమో కదా. మనము వారిలాగ కాదు. మనం ఇప్పుడిప్పుడే పుట్టిన పసిపాపలాంటి వారము. సాధనా పసిబాలురం. నేను ఇంతకు మునుపే చెప్పినట్టు అన్ని రకాల మంత్రాలకు ఒకే రకమైన శక్తిజనిత సామర్ధ్యం ఉండదు. కొన్ని బీజాలు కొంచెం శక్తిని, మరికొన్ని మరింత శక్తిని జనించుతాయి. ఒక సాధకుని ప్రారంభదశ అందు తీవ్ర శక్తిని ధరించగలిగే సామర్ధ్యం ఉండదు. కనుకనే సాధనాప్రస్థానంలో స్థాయీ బేధాలు ఉంటాయి. లౌకికంగా చెప్పాలంటే పై తరగతులు చదవాలంటే క్రింది తరగతులు తప్పక సాధించాలి కదా. 



శ్రీవిద్య మంత్రముల గని. శ్రీచక్రము అందరి దేవతలకు నిలయము. శ్రీవిద్య అనునది ఒక పూజ కాదు. ఇది ఒక యజ్ఞము. సృష్టి, స్థితి, లయ, తిరోధాన మరియు అనుగ్రహము అనునవి పంచకృత్యలు. బ్రహ్మాండము నుండి పిండాండమువరకు అన్నీ ఈ పంచకృత్యములలోనే ఇమడి ఉంటాయి. ఈ పంచకృత్యములలో ఒకొక్క దానికి ఒకొక్క దేవత అధిపతి. ఆ దేవతల సూక్ష్మ రూపమే మంత్రము. కనుకనే ఎంతమంది దేవతలో అన్ని మంత్రములు. నీకు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నప్పుడు అసలు మంత్రములు అవసరమా లేదా అన్నది తెలుసుకుంటావు. అప్పటి వరకు గురు సంప్రదాయముగా వచ్చిన మంత్రములను సాధించక తప్పదు. 



చంచల్ః అలాగయితే మనము ఎవరైతే ముఖ్యదేవతో ఆదేవత యొక్క మంత్రాన్ని సాధన చేస్తే సరిపోతుంది కదా!



గురూజీః ఒక్క విషయం చెప్పు. నువ్వు సి.ఎం.నో, పి.ఎం.నో కలవాలంటే ముందుగా ఎన్ని అనుమతులు తీసుకోవలసి ఉంటుంది? అదేవిధంగా, శ్రీచక్రములోని బిందు స్థానంలో శ్రీలలితా సమేతుడై వున్న ఆ పరమేశ్వరుని చేరుకోవాలంటే ముందుగా ప్రధమావరణ దేవతలను, తర్వాత, ద్వితీయ ఆవరణ దేవతలను అలా అన్ని ఆవరణ దేవతలను పూజించాలి. అలాగే నీ స్వరూపాన్ని దర్శించుకోవాలంటే నీలో ఉన్న మలినాలను, పూర్వజన్మార్జిత పాపాలను ప్రక్షాలన చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ స్వరూప నిరూపతమైన కుండలిని మూలాధారమునుండి బయలుదేరి సహస్రామునకు చేరుతుంది. అంతే కాని సహస్రారాన్ని చేరడానికి దానికి దగ్గర దారులు లేవు. ఒక భవంతి పునాదులమీద మాత్రమే నిలబడుతుంది. మిగతాది నువ్వు అర్ధం చేసుకోగలవు.

చంచల్ః అవును గురువు గారు, నాకిప్పుడు అర్ధమయ్యింది.



గురూజీః నీకు ఇంతకు ముందు గురు, మహాగణపతి, బాలాత్రిపురసుందరి మంత్రములను ఉపదేశించడం జరిగింది. ఇన్నాళ్ళు నువ్వు వాటిని ఉచ్ఛరించడం మాత్రమే చేసావు. ఆ మంత్రాల ఉపాసనా పద్ధతి తెలుసుకోవలసిన సమయం నీకు ఆసన్నమయ్యింది. ఆ మంత్రాల ఉపాసనా పద్ధతి ఒక రహస్యం ప్రక్రియ. అది గురుముఖంగా మాత్రమే తెలుసుకోగలవు. ఆ రహస్యములను ఇప్పుడు నీకు విశదపరుస్తాను. ఎవరైతే తమ సాధనను నిజాయితీగా సాధిస్తారో వారికే ఈ రహస్యములను చెప్పడం జరుగుతుంది.



గురువుగారి ధర్మపత్ని గౌరీ వచ్చి ఆకర్షను తనతో బాటుగా ఆశ్రమంలోకి తీసుకువెళ్ళింది. గురువుగారు చంచల్ కు గురు, మహాగణపతి, బాలాత్రిపురసుందరి మంత్రముల రహస్య సాధనా ప్రక్రియను చెప్పడం ప్రారంభించారు.



ఇంకావుంది.......