శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు
మంత్రములు ఏకాక్షరములు లేక అంతకంటే ఎక్కువ
అక్షరములు కలిగి ఉంటాయి. మంత్రములలోని ఈ అక్షరములనే బీజాక్షరములని అంటారు. అ నుండి
క్షం వరకు కలిగిన అక్షరముల కలయిక వలన కొన్ని బీజాక్షరములు రూపొందుతాయి. అక్షరములకు
శక్తిని కలుగజేసే లక్షణం ఉంటుంది. ఆ శక్తి ఉత్పాదన ఆయా అక్షరములను ఉచ్చరించడాన్ని
బట్టి ఉంటుంది. అందుకే ఒక సాధకునకు బీజాక్షరములయొక్క స్వర (ఉచ్ఛారణ) పద్ధతి తప్పక
తెలిసి ఉండాలి. ఆ పద్ధతులు తెలుసుకోకుండా మంత్ర సాధన చేయడం వలన ఉపయోగమేమీ ఉండదు.
జీవులన్నీ ఒకరితో ఒకరు ఏదో ఒక భాష ద్వారా మాట్లాడుకుంటూ ఉంటాయి. అయితే ఆ భాషలు
అన్నీ మంత్రాలు కావు. దేనికైతే శక్తి జనిత సామర్ధ్యం ఉంటుందో అదే మంత్రము. మంత్రము
యొక్క ఉచ్చారణ పద్ధతి, మన శరీరములోని వాటి జనన స్థానము, న్యాసము మొదలగు విషయములను తెలుసుకొని అప్పుడు మంత్ర సాధన చెయ్యాలి. ఈ
పద్ధతులన్ని ఆయా మంత్రాలతో సిద్ది పొంది, వాటి మర్మాలను
తెలుసుకొన్న సాధకుని ద్వారా గ్రహించాలి. అంతే కాని, ఏవో
పుస్తకాలు చదివి, ఇంటర్నెట్ ద్వారా
సమాచారం సేకరించి, ఆడియోలు, వీడియోలు
ద్వారా మంత్రసాధన చేయకూడదు. దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో చాలా మంది ఇతువంటి
మాధ్యమాలద్వారానే మోక్షాన్ని పొందుదామని అనుకొంటున్నారు. మన పూర్ణకు కూడా అటువంటి
అనుచరులు ఉన్నారు. వారు అతని విద్యార్ధులేగాని, శిష్యులు
కారు.
అవునన్నట్టుగా
పూర్ణ చిరునవ్వు నవ్వుతూ చిన్నగా తల ఊపాడు.
చంచల్ః నేను
చాలా అదృష్టవంతుడిని గురువుగారు. మీలాంటి సిద్ధ పురుషులు నా గురువుగా తారసపడడం
నిజంగా నేను చేసుకొన్న పూర్వజన్మ పుణ్యఫలమే.
అతడు
కొనసాగించాడు…. గురువుగారు, అన్ని
మంత్రాలు ఒక్కటే అని మీరు ఒకసారి చెప్పారు. అలాగయితే ఇన్ని కోట్ల మంత్రాలు ఎందుకు?
గురూజీః
అన్ని మంత్రాలు సాధారణ మనుషులమైన మనవంటివారికి. సిద్ధపురుషులైన శ్రీరమణ
మహర్షిలాంటి వారికి కాదు. వారు ఈ జన్మలో అనుభవించిన స్థితికి రావడానికి ఆయన ఎన్ని
జన్మల సాధనా ఫలమో కదా. మనము వారిలాగ కాదు. మనం ఇప్పుడిప్పుడే పుట్టిన పసిపాపలాంటి
వారము. సాధనా పసిబాలురం. నేను ఇంతకు మునుపే చెప్పినట్టు అన్ని రకాల మంత్రాలకు ఒకే
రకమైన శక్తిజనిత సామర్ధ్యం ఉండదు. కొన్ని బీజాలు కొంచెం శక్తిని, మరికొన్ని మరింత శక్తిని జనించుతాయి. ఒక సాధకుని ప్రారంభదశ అందు తీవ్ర
శక్తిని ధరించగలిగే సామర్ధ్యం ఉండదు. కనుకనే సాధనాప్రస్థానంలో స్థాయీ బేధాలు
ఉంటాయి. లౌకికంగా చెప్పాలంటే పై తరగతులు చదవాలంటే క్రింది తరగతులు తప్పక సాధించాలి
కదా.
శ్రీవిద్య
మంత్రముల గని. శ్రీచక్రము అందరి దేవతలకు నిలయము. శ్రీవిద్య అనునది ఒక పూజ కాదు.
ఇది ఒక యజ్ఞము. సృష్టి, స్థితి, లయ, తిరోధాన మరియు అనుగ్రహము అనునవి పంచకృత్యలు. బ్రహ్మాండము నుండి
పిండాండమువరకు అన్నీ ఈ పంచకృత్యములలోనే ఇమడి ఉంటాయి. ఈ పంచకృత్యములలో ఒకొక్క
దానికి ఒకొక్క దేవత అధిపతి. ఆ దేవతల సూక్ష్మ రూపమే మంత్రము. కనుకనే ఎంతమంది దేవతలో
అన్ని మంత్రములు. నీకు ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నప్పుడు అసలు మంత్రములు అవసరమా
లేదా అన్నది తెలుసుకుంటావు. అప్పటి వరకు గురు సంప్రదాయముగా వచ్చిన మంత్రములను
సాధించక తప్పదు.
చంచల్ః
అలాగయితే మనము ఎవరైతే ముఖ్యదేవతో ఆదేవత యొక్క మంత్రాన్ని సాధన చేస్తే సరిపోతుంది
కదా!
గురూజీః ఒక్క
విషయం చెప్పు. నువ్వు సి.ఎం.నో, పి.ఎం.నో కలవాలంటే ముందుగా ఎన్ని
అనుమతులు తీసుకోవలసి ఉంటుంది? అదేవిధంగా, శ్రీచక్రములోని బిందు స్థానంలో శ్రీలలితా సమేతుడై వున్న ఆ పరమేశ్వరుని
చేరుకోవాలంటే ముందుగా ప్రధమావరణ దేవతలను, తర్వాత, ద్వితీయ ఆవరణ దేవతలను అలా అన్ని ఆవరణ దేవతలను పూజించాలి. అలాగే నీ
స్వరూపాన్ని దర్శించుకోవాలంటే నీలో ఉన్న మలినాలను,
పూర్వజన్మార్జిత పాపాలను ప్రక్షాలన చేసుకోవాలి. ఒక్కటి గుర్తుపెట్టుకో. నీ స్వరూప
నిరూపతమైన కుండలిని మూలాధారమునుండి బయలుదేరి సహస్రామునకు చేరుతుంది. అంతే కాని
సహస్రారాన్ని చేరడానికి దానికి దగ్గర దారులు లేవు. ఒక భవంతి పునాదులమీద మాత్రమే
నిలబడుతుంది. మిగతాది నువ్వు అర్ధం చేసుకోగలవు.
చంచల్ః అవును
గురువు గారు, నాకిప్పుడు అర్ధమయ్యింది.
గురూజీః నీకు
ఇంతకు ముందు గురు, మహాగణపతి,
బాలాత్రిపురసుందరి మంత్రములను ఉపదేశించడం జరిగింది. ఇన్నాళ్ళు నువ్వు వాటిని
ఉచ్ఛరించడం మాత్రమే చేసావు. ఆ మంత్రాల ఉపాసనా పద్ధతి తెలుసుకోవలసిన సమయం నీకు
ఆసన్నమయ్యింది. ఆ మంత్రాల ఉపాసనా పద్ధతి ఒక రహస్యం ప్రక్రియ. అది గురుముఖంగా
మాత్రమే తెలుసుకోగలవు. ఆ రహస్యములను ఇప్పుడు నీకు విశదపరుస్తాను. ఎవరైతే తమ సాధనను
నిజాయితీగా సాధిస్తారో వారికే ఈ రహస్యములను చెప్పడం జరుగుతుంది.
గురువుగారి
ధర్మపత్ని గౌరీ వచ్చి ఆకర్షను తనతో బాటుగా ఆశ్రమంలోకి తీసుకువెళ్ళింది. గురువుగారు
చంచల్ కు గురు, మహాగణపతి,
బాలాత్రిపురసుందరి మంత్రముల రహస్య సాధనా ప్రక్రియను చెప్పడం ప్రారంభించారు.
ఇంకావుంది.......
No comments:
Post a Comment