SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, September 27, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-18

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

18




చూడు నాయనా! నువ్వు సన్యాసివి కాదు. గృహస్థాశ్రమంలో జీవితాన్ని సాగిస్తున్నవాడివి. గృహస్థాశ్రమంలో ఉన్నవారు ఆ ఆశ్రమ ధర్మాలను పాటించాలి. ఈ రోజుల్లో అవి అన్నీ కుదరక పోయినా కనీస ధర్మాలైనా పాటించి తీరాలి. ఆధ్యాత్మికసాధన నీ గృహస్థాశ్రమ ధర్మాలకి అడ్డుకాకూడదు. అలాగని, సంసారజీవితంలో మునిగిపోయి ఆధ్యాత్మికసాధనను విస్మరించకూడదు. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీకోసమై ఎదురుచూసేనీప్రేమకై పరితపించే నీవాళ్ళు ఉన్నారన్న సంగతి ఎప్పుడూ మరిచిపోకు. కనుక, ముందు వాళ్ళగురించి నీ సమయాన్ని వెచ్చించు. ఆ తరువాత నీ ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టు. అప్పుడు నీకెటువంటి అడ్డంకులు ఉండవు. ముందు వారి గురించి పట్టించుకుంటూ పోతే మరి నాకు సమయాభావం కలుగుతుంది కదా అని నువ్వు అనవచ్చు. కాని అది పూర్తిగా తప్పు భావన. కాల నిర్వహన సామర్ద్యం లేనివారు చెప్పే మాట అది. నిజానికి సమయాభావం అన్నది సాధనను వాయిదా వేసుకోవడానికి చూపించుకొనే ఒక కుంటిసాకు మాత్రమే. నువ్వు పరిణితి చెందిన వ్యక్తివి. నీకు మంచి చెడుల వ్యతాసం బాగా తెలుసు. నీ నిత్యజీవితంలో ఏది అవసరమైనదో ఏది అవసరమైనది కాదో తెలుసుకోగల జ్నానం ఉన్నవాడివి. కనుక కాలనిర్వహణ (Time management) అన్నది నీ చేతులలోనే ఉంది. నీ వ్యక్తిగత జీవితాన్ని నడిపించుకోవడంలో నీకు నీవే ఉపాధ్యాయుడివి. కాలాన్ని నీకనుగుణముగా నువ్వే మార్చుకోవాలి, అంతేగాని, నువ్వే కాలం చేతిలో కీలుబొమ్మగా మారకూడదు. ఇంకా నీకు బాగా అర్ధమయ్యేలా చెప్పాలంటే, నీ చేతిలో కాలం ఉంటే నువ్వే కాల భైరవుడివి. నువ్వు కాలం చేతిలో ఉంటే నువ్వు ఒక సామాన్య మానవుడివి. ఈ విషయంలో నేను ఇంకా చెప్పవలసిన అవసరం లేదు. నీ మనసు నుండినేనొక సాధకుడినిచాలా గొప్పవాడిని అన్న భావనను పూర్తిగా చెరిపివేసేయి. సాధనవలన గొప్పవారవరు. ధర్మాన్ని పాటిస్తేనే గొప్పతనం వస్తుంది. అటువంటి ధర్మాత్ములే సాధనలో గొప్పగొప్ప శిఖరాలు అధిరోహిస్తారు. అధర్మపథాన్న పయనిస్తూ  ఏదో గొప్ప సాధన చేస్తున్నాననుకోవటం భ్రమ మాత్రమే. దీని వలన మంచి జరుగకపోగా చెడు కలుగుతుంది.

చంచల్ - అవును గురువుగారు. నేను చేసే సాధన వలన నేనేదో గొప్పవాడినన్న అహంకారం నామనస్సులో ఉంది. తప్పక ఆ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. అని అతడు నిజాయితీగా ఒప్పుకున్నాడు.
గురూజీః నీ నిజాయితీ నాకు నచ్చింది. ఇక మంత్రసాధనలో  కలిగే ఆటంకాలగురించి ఆలోచిద్దాం. ఆటంకాలలో ప్రధాన ఆటంకం ఆలోచనలు. మంత్రసాధనలో కలిగే ఆలోచనలను అరికట్టడం దాదాపు అసాధ్యం. ఈ రోజుల్లో చాలామందిమేము ప్రతి రోజూ ధ్యానంలో గంటలతరబడి కూర్చుంటాంఅని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. ఇదొక కపటనాటకం. ధ్యానమంటే కళ్ళు మూసుకొని గంటలతరబడి ఒక మూల కూర్చోవడం కాదు. నీ కళ్ళు మూసుకొంటే నీ మనసు పనిచేయడం ప్రారంభిస్తుంది.  అప్పుడు మనసు నిన్ను రకరకాల విషయలోలిత లోకాలలోకి తీసుకేడుతుంది. నువ్వు ఆ లోకాలన్నీ తిరిగివచ్చేటప్పటికి నీవు సాధనకు కేటాయించిన సమయం కాస్తా అయిపోతుంది. అహంకారపూరితులు అదే గొప్ప సాధన లేదా ధ్యానము అనుకుంటారు. నిజానికి ధ్యానమంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం. అనగా నీ స్వరూపాన్ని తెలుసుకోవడం. కర చరణాయుతమైన ఈ స్థూలశరీరమా లేక అంతకు మించి ఏమైనా ఉన్నదా అని తెలుసుకోవడానికి చేసెడి ప్రయత్నమే సాధన. అంతకు మించి ఏదైతో ఉన్నదో అదే ఆత్మ. అదే నీవు.“ ఆ నీవు అన్నిచోట్ల ఉన్నావు. అది లేని చోటు లేనే లేదు. ఇదే నిజమైన సాధనయొక్క పరమార్ధం. ఇది అనుభూతికావడానికి ఏకాగ్రతతో కూడిన సాధన అవసరం. ఆ ఏకాగ్రత సాధించడానికి మనకొక ఊతం కావాలి. ఆ ఊతమే మంత్రము. మంత్ర సాధనకు కొన్ని పద్దతులు ఉన్నాయి. ఆ పద్దతులు తెలుసుకొని ఆ మార్గాలలో మంత్ర సాధన చేయాలి. అప్పుడే ఆ మంత్రాలు సిద్ధిస్తాయి. ఇవేమీ తెలుసుకోకుండా ఏవో మంత్రాలని కంఠస్థం చేసి వాటికి నోటికి అప్పగించి, మనం మనస్సు వెంట పరిగెడుతూ ఉంటే కలిగే లాభం ఏముంది. ఒఠి సమయ హరణం తప్ప.
మంత్రసాధనలో వచ్చే ఆలోచనలను ఎలా అరికట్టాలో నీకు ఇదివరకే చెప్పివున్నాను. ఆ చిట్కాకి కొనసాగింపుగా ఇంకొక విషయం చెబుతాను. ప్రతీ దేవతకు మంత్రం ఉన్నట్లే ధ్యానశ్లోకం కూడా ఉంటుంది. ధ్యానశ్లోకం ఆ మంత్ర దేవతా రూపాన్ని తెలుపుతుంది. ధ్యానశ్లోకంలో చెప్పబడిన ఆ దేవతా రూపాన్ని భావిస్తూ మంత్రాన్ని ఉపాసించాలి. అలా చేయగా చేయగా నీ యొక్క సాధనా పటిమను బట్టి ఆ దేవతా దర్శనం నీకు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదీ ధ్యానశ్లోకం యొక్క ప్రాముఖ్యత. దీనికి ప్రబల నిదర్శనం భక్త ధృవ. నారదుడు శ్రీవిష్ణుమూర్తి రూపాన్ని ఎలా వర్ణించాడో ఆ రూపాన్నే ధ్యానించాడు ధృవుడు. ఆ రూపంలోనే ధృవునికి సాక్షాత్కరించాడు శ్రీవిష్ణువు. కనుక ఈవిధంగా నీ ఆలోచనలను అరికట్టడానికి ప్రయత్నించు.
చంచల్ః తప్పక ప్రయత్నిస్తాను గురూజీ. ఇక ఆ తర్వాత ఆలోచనలు నన్ను ఇబ్బంది పెట్టవనుకుంటాను.
గురూజీః ఈ పద్ధతి తప్పకుండా పాటించాలి. కానీ ఆలోచనలు పూర్తిగా అరికట్టబడవు. అవి మళ్ళీ మళ్ళీ నీ మీదకు యుద్ధానికి వస్తూనే ఉంటాయి.

చంచల్ః గురువుగారు, చాలా గజిబిజిగా ఉంది. ఆలోచనలు ఆగకపోతే ఈ పద్ధతి పాటించి ఏం లాభం?

గురూజిః సాధన అన్నది ఒక దాని తర్వాత ఒకటి తెలుసుకుంటూ సాగాలి. కింది తరగతులు చదవకుండా పెద్ద తరగతులకి వెళ్ళలేము కదా. ఇది కూడా అంతే. పై పద్ధతి యొక్క ప్రాముఖ్యత నీకు చెప్పాను. కనుక ఇక ముందు నీ సాధనను ఈ విధంగా కొన్నాళ్ళు చెయ్యి. నీ ఇష్టదేవత దర్శనం నీకు తప్పకుండా కలుగుతుంది.

చంచల్ః తప్పకుండా చేస్తాను గురువుగారు. ఇంతకు ముందు మీరు మంత్ర సాధనకు కొన్ని పద్దతులున్నాయని చెప్పారు. అవి నేను తెలుసుకోవచ్చా, గురువుగారు?
గురూజీః తప్పకుండా, నాయనా!


గురువుగారు చెప్పడం ప్రారంభించారు….

No comments:

Post a Comment