SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, January 18, 2017

శ్రీవిద్య - భగవాన్ దుర్వాస మహాముని





| గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైః శ్రీ గురవే నమః ||

పతివ్రతల్లో అగ్రగణ్యురాలు అత్రి మహర్షి పత్ని అనసూయ మాత. అత్రి అంటే త్రిగుణాలను జయించిన వాడు అని (సత్వరజస్తమో గుణములు), అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. అత్రి సప్తర్షులలో ఒకడు, బ్రహ్మ పుత్రుడు. కర్దమ ప్రజాపతి, దేవహూతిలకు పుట్టిన పుత్రిక అనసూయ.
అత్రి మహర్షి బ్రహ్మ కుమారుడు. సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు.అత్రి మహర్షికి  త్రిమూర్తుల యొక్క  వరప్రసాదంగా   రుద్రాంశతో  దుర్వాస మహర్షి కలిగారు.


కంచి కామాక్షీ అమ్మవారి మూల స్వరూపం ఎదురుగా భూప్రస్థాన శ్రీచక్రమును ప్రతిష్ఠ చేసినది శ్రీ దుర్వాసో మహర్షియే. వారు అమ్మవారిని కీర్తిస్తూ,

త్రిపుర మహిమ్న స్తోత్రము (ఈ స్తోత్రం మొత్తం మంత్ర శాస్త్రమే),

లలితా స్తవరత్నము (దీనినే ఆర్యా ద్విశతి అంటారు),

పరాశంభు మహిమ్న స్తోత్రము అనే మూడు అద్భుతమైన స్తోత్రములు చేశారు.
  


Thursday, January 12, 2017

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ



అత్యంత పూజనీయులు - శ్రీభువనానందనాథులు


సమస్త జగత్తు సృష్టి, స్థితి, లయ అనే మూడు క్రియాశక్తులతో  నడిపించబడుతున్నది. ఈ క్రియాశక్తులు మూడింటికి వరుసగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు అధిపతులు. నిజానికి ఈ క్రియాశక్తులను సులభముగా అర్ధం చేసుకోవడానికి వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా చెప్పారు. జగత్తును సృష్టించేది బ్రహ్మ, పాలించేది విష్ణు, లయము చేసేది రుద్రుడు. లయమయిన సృష్టిని తిరోధానపరచి తిరిగి అనుగ్రహించేది పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మమునే శాక్తేయులు “శ్రీమాత”గా కొలుస్తారు. అందుకే శ్రీమాతకు “పంచకృత్యపరాయణ” అని ఒక నామము. శ్రీమాత పంచకృత్యపరాయణ తత్త్వమును తెలుసుకొని ఉపాసించేవారు మోక్షానికి దగ్గరగా చేరుకొంటారు. అమ్మలో లీనమవడమేమోక్షము. 

అయితే ఈ విషయమంతా బ్రహ్మవిద్యను అభ్యసించేవారికి కొంచెం అర్ధం అవుతుంది. మరి బ్రహ్మవిద్యను అభ్యసించలేని వారికి మోక్షమార్గమేమిటి? “శ్రీమాత” కరుణ అపారమైనది, అనంతమైనది. అమ్మను చేరుకోవడానికి అందరికి ఎన్నో రకాల మార్గాలని ఆమె సూచించింది. వీటిలో అత్యంత సులభమైనది, ఆచరణమైనది తల్లిదండ్రులు మరియు గురువుల సేవ. తల్లిదండ్రులు బ్రహ్మ రూపాలు. వారివలనే శరీరమనే  సృష్టి జరిగింది. వారేలేకపోతే శరీరమనే జన్మ ఉండదు కదా!. జన్మించిన ఈ శరీరమును పోషించుకోవడానికి అవసరమైన విజ్నానమును యిచ్చేది గురువు. ఈ పోషణయే పాలన. అనగా గురువు సాక్షాత్తు విష్ణు స్వరూపుడవుతున్నాడు. అనగా జన్మ నిచ్చిన తల్లిదండ్రులు, విద్యనేర్పిన గురువు మనకు ప్రత్యక్ష దైవాలు. వారి సేవయే బ్రహ్మ, మాధవ సేవ. ఆ సేవాతత్ఫలమే మోక్షము. మోక్షమనగా శరీరాంతర్గత జీవుడు పరమాత్మలో లీనమవడమే. అలా లీనమవడమే లయ. అనగా సూక్ష్మంగా ఆలోచిస్తే జీవుడే రుద్రుడు. “అహం బ్రహ్మాస్మి” అను వేద వాక్యమర్ధమిదియే. ఇక్కడ బ్రహ్మమనగా “పరబ్రహ్మమని” అర్ధము. ఒక జీవుడు “అహం బ్రహ్మాస్మి” అను భావనను నిస్స్వార్ధసేవనందు మాత్రమే తెలుసుకొనగలుగుతాడు. అటువంటి జీవుడే పుణ్యపురుషుడవుతాడు. లేని వాడు సాధారణ పురుషునిగా మిగిలి పోతాడు. 


 
కనుక ప్రతి జీవి జీవితములోని తల్లిదండ్రులు, గురువు అత్యంత పూజనీయులు. అందుకే వేదము కూడా “మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ” అని పూజింపవలసినవారిలో ముందుగా వీరిని ఉపదేశించింది.