అత్యంత పూజనీయులు - శ్రీభువనానందనాథులు
సమస్త జగత్తు సృష్టి, స్థితి, లయ అనే మూడు
క్రియాశక్తులతో నడిపించబడుతున్నది. ఈ
క్రియాశక్తులు మూడింటికి వరుసగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు అధిపతులు. నిజానికి ఈ క్రియాశక్తులను సులభముగా అర్ధం చేసుకోవడానికి
వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్రులుగా చెప్పారు. జగత్తును సృష్టించేది బ్రహ్మ, పాలించేది విష్ణు, లయము చేసేది రుద్రుడు.
లయమయిన సృష్టిని తిరోధానపరచి తిరిగి అనుగ్రహించేది పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మమునే
శాక్తేయులు “శ్రీమాత”గా కొలుస్తారు. అందుకే శ్రీమాతకు “పంచకృత్యపరాయణ” అని ఒక
నామము. శ్రీమాత పంచకృత్యపరాయణ తత్త్వమును తెలుసుకొని ఉపాసించేవారు మోక్షానికి
దగ్గరగా చేరుకొంటారు. అమ్మలో లీనమవడమేమోక్షము.
అయితే ఈ విషయమంతా
బ్రహ్మవిద్యను అభ్యసించేవారికి కొంచెం అర్ధం అవుతుంది. మరి బ్రహ్మవిద్యను
అభ్యసించలేని వారికి మోక్షమార్గమేమిటి? “శ్రీమాత” కరుణ అపారమైనది, అనంతమైనది. అమ్మను చేరుకోవడానికి అందరికి ఎన్నో రకాల మార్గాలని ఆమె
సూచించింది. వీటిలో అత్యంత సులభమైనది, ఆచరణమైనది తల్లిదండ్రులు మరియు గురువుల సేవ. తల్లిదండ్రులు బ్రహ్మ రూపాలు.
వారివలనే శరీరమనే సృష్టి జరిగింది.
వారేలేకపోతే శరీరమనే జన్మ ఉండదు కదా!. జన్మించిన ఈ శరీరమును పోషించుకోవడానికి
అవసరమైన విజ్నానమును యిచ్చేది గురువు. ఈ పోషణయే పాలన. అనగా గురువు సాక్షాత్తు
విష్ణు స్వరూపుడవుతున్నాడు. అనగా జన్మ నిచ్చిన తల్లిదండ్రులు, విద్యనేర్పిన గురువు మనకు
ప్రత్యక్ష దైవాలు. వారి సేవయే బ్రహ్మ, మాధవ సేవ. ఆ సేవాతత్ఫలమే మోక్షము. మోక్షమనగా శరీరాంతర్గత జీవుడు పరమాత్మలో
లీనమవడమే. అలా లీనమవడమే లయ. అనగా సూక్ష్మంగా ఆలోచిస్తే జీవుడే రుద్రుడు. “అహం
బ్రహ్మాస్మి” అను వేద వాక్యమర్ధమిదియే. ఇక్కడ బ్రహ్మమనగా “పరబ్రహ్మమని” అర్ధము. ఒక
జీవుడు “అహం బ్రహ్మాస్మి” అను భావనను నిస్స్వార్ధసేవనందు మాత్రమే
తెలుసుకొనగలుగుతాడు. అటువంటి జీవుడే పుణ్యపురుషుడవుతాడు. లేని వాడు సాధారణ పురుషునిగా
మిగిలి పోతాడు.
కనుక ప్రతి జీవి జీవితములోని తల్లిదండ్రులు, గురువు అత్యంత పూజనీయులు. అందుకే వేదము కూడా “మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ” అని పూజింపవలసినవారిలో ముందుగా వీరిని ఉపదేశించింది.
No comments:
Post a Comment