SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, December 21, 2016

గురువు

సంస్కృతంలో గు అనగా చీకటి/అంధకారం మరియు రు అనగా వెలుతురు/ప్రకాశం అని అర్థం. అనగా గురువు అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి బ్రహ్మవిద్య అనే ప్రకాశాన్ని అందించేవాడు.

 

ప్రతి జీవి పరిపూర్ణత పొందాలి. మన వర్తమాన స్థితి, మన పూర్వ కర్మ, మన పూర్వాలోచన మనకు పరిపూర్ణత అందజేస్తుంది. అలాగే మన భవిష్యత్తు అనేది మన ప్రస్తుత కర్మలకు, భావములకు ఫలితం. ఈ కర్మలను, భావములను సక్రమమైన మార్గంలో నడిపించడానికి ఒక ఉద్దీపన శక్తి  కావలసి వుంటుంది. ఆ ఉద్దీపన శక్తి లభించినప్పుడు ఆత్మ శక్తి సామర్థ్యాలు ఉద్దీపన చెందుతాయి. పారమార్థిక జీవితము ప్రబోధాన్ని పొందుతుంది. అభివృద్ధికి చురుకు కలుగుతుంది. అంత్యమున మానవుడు పావనుడై పరిపూర్ణత పొందుతాడు.

ఆత్మ శక్తి సామర్థ్యాలను ఉద్దీపన చేసే శక్తిని పుస్తకాల నుంచి పొందలేం. ఒక ఆత్మ ప్రేరణ పొందాలంటే మరో ఆత్మద్వారానే సాధ్యమవుతుంది. దీనికి మరో మార్గం లేదు. యావజ్జీవం గ్రంథ పఠనం చేసేవారు, మహా పండితులు కూడా ఆత్మను ఉద్దీపన చేసే శక్తి సహాయం పొందలేకపోతే ఆత్మ వికాసం పొందలేం. గ్రంథాలను, పురాణాలను పఠనం చేయడం వల్ల మనం ఆత్మవికాసం పొందుతూ వుంటామని అనుకుంటూ వుంటాం. కానీ అది కొంతవరకే నిజం. గ్రంథ పఠనం వల్ల కలిగే ప్రతిఫలాన్ని పరిశీలించినట్టయితే, గ్రంథ పఠనం వల్ల మనకు కొంత ధైర్యం వస్తుందనే మాట మాత్రం వాస్తవం. అయితే అంతరాత్మకు మాత్రం ఒరిగే ప్రయోజనం మాత్రం అంతంత మాత్రమే. ఆధ్యాత్మిక విషయాల గురించి అద్భుతంగా మాట్లాడగలగే వ్యక్తుల కూడా అనుష్ఠానానికి, నిజమైన పారమార్థిక ఆచరణలకు వచ్చేసరికి వెనకబడిపోతూ వుంటాడు. దీనికి  కారణం ఆ వ్యక్తి ఆత్మకు మరో ఆత్మ నుంచి తగిన ప్రేరణ శక్తి లభించకపోవడమే.

మరి అలాంటి ప్రేరణ శక్తి మన ఆత్మలకు అందించే మరొక ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ ఎవరిదో కాదు.. గురువుది. ఇలాంటి ప్రేరణ శక్తిని ప్రసరింపజేసే వ్యక్తి గురువు. ఆ శక్తిని స్వీకరించేవారు శిష్యులు. గురువు ఈ ప్రేరణ శక్తిని ప్రసరింపజేసే శక్తిని కలిగి వుండాలి. అలాగే శిష్యుడికి కూడా ఆ శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా వుండాలి. ఎలా వుండాలీ అంటే, విత్తనం నాటితే మొలకెత్తించడానికి సిద్ధంగా వుండే సారవంతమైన భూమిలా వుండాలి. అప్పుడే గురువు అందించే శక్తి ఆ వ్యక్తిలో బీజంలా పడి, సాధన ద్వారా భవిష్యత్తులో మహా వృక్షమవుతుంది.

No comments:

Post a Comment