SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Sunday, February 4, 2018

శ్రీవిద్యా ప్రస్థానం-27

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

27



గురువుగారుః సశాస్త్రీయపద్ధతిలో మంత్రసాధన చేస్తే సిద్ధులు కలుగుతాయి. కుండలిని కూడా చైతన్యవంతం అవుతుంది. మూలాధారచక్రంలో మంత్రసాధన చేస్తే భూత, భవిష్యత్, వర్తమానాలకు సంబంధించిన జ్ఞానం వస్తుంది. ఈ విధంగానే వివిధచక్రాలలో మంత్రోపాసన కొన్ని రకాల సిద్ధులను ఇస్తాయి.

తర్వాత గురువుగారు మూలాధారంలో మంత్రోపాసన ఎలా చెయ్యాలో అతనికి వివరించారు.

పూర్ణ తన కృతజ్ఞతలు గురువుగారికి తెలిపి ఈ విధంగా అడిగాడు....
పూర్ణః సిద్ధులు కలగడం కుండలిని చైతన్యవంతమైనదనడానికి నిదర్శనమా?
గురువుగారుః అలా అనుకోవడానికి వీలులేదు. కొన్ని సందర్భాలలో కుండలిని జాగృతమైనా సిద్ధులు కలగకపోవచ్చు. చాలా సందర్భాలలో కుండలిని జాగృతమైనప్పుడు సిద్ధుల కలుగుతాయి. ఎందుకంటే అవి సాధకుని మాయలో పడవేయాలి కదా. ఏ సాధకుడైతే వాటి మాయలో పడకుండా జాగ్రత్తగా ఉంటాడో ఆ సాధకుడే యోగిలా మారుతాడు.
పూర్ణః గురువుగారు, ఈ మధ్య ఇంటెర్ నెట్లో నేనొక సాధకుని అనుభవాన్ని చదివాను. అతడు అమెరికాలోని అలస్కా ప్రాంతంవాడు. అతనికి మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఒక గురువుగారు మహాషోడశీ మంత్రాన్ని టెలిఫోన్ ద్వారా ఉపదేశం ఇచ్చారట. తద్వారా అతడు మూడునెలలుగా ఆ మంత్రోపాసన చేయసాగాడట. అలా మూడు నెలలు గడిచిన తర్వాత ఒక రోజు అతనికి అతని నుదుటియందు (ఆజ్ఞాచక్రం) ఒక పెద్ద వెలుగు కనిపించిందట. ఆ దర్శనం అయిన తర్వాత అతనికి కొత్త ఉత్సాహం పుంజుకొచ్చినట్టయిందట. ఆ వెలుగే శ్రీమాత అని తనకి దైవదర్శనం అయ్యిందని అతను అనుకున్నాడట. ఎందుకంటే శ్రీమాత జ్యోతి స్వరూపం అని అతనికి వారి గురువుగారు చెప్పారట. ఆ దర్శనం అయిన దగ్గర నుండి అతను ఒకచోట ఉండలేకపోవడం, ఎవరో తనను అనుసరిస్తున్నట్టుగా ఉండటం, ఆ వెలుగు ఎప్పుడూ అతని వెంటే ఉన్నట్టుగా అనిపించడం ఇలా ఎన్నో రకాల అనుభూతులు, అనుభవాలు కలుగసాగాయట. చివరగా తనకు తన ఆత్మస్వరూప దర్శనం అయ్యిందని, అహంబ్రహ్మాస్మి స్థితికి చేరుకున్నానని అతను ప్రకటించుకున్నాడు.
ఆత్మస్వరూపనిరూపణం అంత సులువా గురువుగారూ?
గురువుగారుః ఎందుకు కాదు నీకటువంటి గురువుండి అంత తీవ్రమైన సాధన చేస్తే...
పూర్ణకి గురువుగారి మాటల్లో వ్యంగ్యం కనిపించింది.
పూర్ణః నేనేమైన తప్పుగా మాట్లాడితే క్షమించండి. నా ఉద్దేశ్యం శాస్త్రాన్ని తెలుసుకోవాలనే.
గురువుగారుః ఏమి చెప్పమంటావు పూర్ణ. ప్రస్తుత రోజులు అలా ఉన్నాయి మరి. ఆధునిక గురువులు – ఆధునిక శాస్త్రాలు, ఆధునిక శిష్యులు – తక్షణ ఫలితాలు. ఆజ్ఞాచక్రంలో వెలుగు ఆత్మానుభవము కాదు. ఎవరైనా ఒక మూడు గంటలపాటు కదలకుండా కళ్ళు మూసుకొని కూర్చుంటే వెలుగులాంటిది కనిపిస్తుంది. అంతమాత్రాన్న ఆత్మానుభవమైనట్టుకాదు. స్వరూపనిరూపణమును ఆత్మానుభవముగా చెప్పవచ్చు. ఈ స్వరూపనిరూపణము మూలాధార స్థిత అమ్మవారు సహస్రార స్థిత అయ్యవారిని చేరుకున్నప్పుడు అవుతుంది. పునాదులు లేకుండా ఎవరైనా భవంతిని నిర్మించగలరా? అలాగే కుండలిని మూలాధారాది చక్రాలను వదలి తిన్నగా ఆజ్ఞాచక్రాన్ని చేరడం సాధ్యమవుతుందా? లోకులు ఈ చిన్న తర్కాన్ని ఎందుకు అర్ధంచేసుకోలేరో తెలీదు. నేను నీకిచ్చే సలహా ఒక్కటే. ఇలాంటి పిచ్చి వ్యాసాలు చదవడంమాని ఆ సమయాన్ని నీ సాధనకు వినియోగించుకో. అది నీకెంతో ఉపయోగపడుతుంది.
***
ప్రేమ సంక్షిప్త సమాచారం (SMS)చూడగానే చంచల్కు చాలా ఆనందం వేసింది. అదే సమయంలో ఆకర్ష వంట ఇంట్లో ఉన్నట్టు గుర్తించి, “హాయ్, నేను ఇంట్లో ఉన్నాను. రేపు నీతో మాట్లాడుతాను ...”  అని ప్రేమకు జవాబిచ్చి, తన చరవాణిలో ఆమె పేరును ప్రేమ్ కుమార్ గా మార్చి ఆ మెసేజ్ ను తొలగించాడు.
ఆ రోజు రాత్రి ఆకర్ష అతనిని అడిగింది....
ఆకర్షః ఏమిటి విషయం. అయ్యగారు ఇవాళ తెగ రెచ్చిపోయారు.
చంచల్ః నీవల్లే డియర్. నిన్ను ఆ భంగిమలో చూసేసరికి నేను తట్టుకోలేకపోయాను. నీ అందం నన్నెప్పుడూ పిచ్చివాడిని చేస్తుంది అంటూ ఆమెను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆమె ఎంతో ఆనందంగా అతని కౌగిలిలోచేరి అతని విశాలమైన వక్షస్థలం మీద వాలింది. ఆ సమయంలో అతడు ఆమె స్థానంలో ప్రేమను ఊహించుకున్నాడు.
మర్నాడు అతడు ఆఫీసుకు వెడుతూ కౌళం గురించి మళ్ళీ ఆలోచించడం మొదలుపెట్టాడు. “నేనెందుకు ఆ విధంగానే ఆలోచించాలి? నా ఆలోచనా విధానం తప్పేమో. ఆ పూజా విధానాల వెనుక ఏదో తెలియని నాకర్ధంకాని రహస్యాలు ఉండి ఉండవచ్చు. పూర్తి విషయం తెలియకుండా నేనలా ఆలోచించడం తప్పుకదా. ఆ లోతైన రహస్యాలు తెలుసుకోవడం ఎలా? గురువుగారిని అడిగితే? అలా అడిగితే గురువుగారు నా గురించి ఏమైనా తప్పుగా అనుకుంటారేమో. నేను కౌళానికి ఆకర్షితుడని అవుతున్నానని అనుకుంటారేమో. అది నాకు నచ్చదు. మరి ఎలా?
అతను ఈ విధంగా ఆలోచిస్తుండగా అతనికి అతని బుర్రలో తళుక్కున ఒక ఉపాయం తట్టింది. అవును అదే ఉత్తమం. గుగూల్లో వెదకి నేను అసలు విషయాన్ని తెలుసుకుంటాను అని అతను ఒక నిర్ణయానికి వచ్చాడు.
ఆఫీసుకు చేరిన వెంటనే అతడు అంతర్జాలంలో కౌళాచారమని గుగూల్లో వెదికాడు. అందులో అతడికి చాలా వెబ్ సైట్స్ కనిపించాయి. అసలు అన్ని వెబ్ సైట్స్ ఉంటాయని అతడు ఊహించలేకపోయాడు. కౌళం అంత రహస్యమైతే ఇంత బాహాటంగా ఈ సమాచారాన్ని ఎందుకుంచారు? అతడికి కొంచెం ఆశ్చర్యమేసింది. ఆ సైట్స్ లో అతడికి బొమ్మలు, రాతప్రతులు, వీడియోలు, ఆడియోలు ఇలా చాలా రూపాల్లో సమాచారం కనిపించింది. అతడిక ఎంతమాత్రం తన కుతూహలాన్ని ఆపొకోలేక కొన్ని రాతప్రతులను చదవడం ప్రారంభించాడు. నిజమైన కౌళ సమాచారం ఏమిటో అతడికి తెలియదు. ఆ సైట్స్ లో ఉన్నవన్నీ నిజాలేనని అతడు అనుకోసాగాడు. ఆక్రమంలో అతడు కొన్ని ఫోటోలు, వీడియోలు చూడసాగాడు. చాలా వాటిలో యోని పూజగురించి వివరించడం జరిగింది. అతడు కొన్ని నగ్నఫొటోలు కూడా చూడ్డం జరిగింది. వాటిని మరింత శోధించగా అతడికి కొన్ని పోర్న్ సైట్స్ దర్శనమిచ్చాయి. అతడు కొంత తత్తరపడి వెంటనే వాటిని మూసివేసాడు. కొంచెంసేపటి తర్వాత వీటిని చూస్తే తప్పేముంది. అది జీవితంలో ఒక భాగమేకదా అని తనకు తాను సమాధానపడి తిరిగి వాటిని చూడసాగాడు.
కొంచెంసేపటి తర్వాత అతడికి ప్రేమనుండి SMS వచ్చింది...
ప్రేమః హలో....
చంచల్ః హాయ్ ... ఎలా ఉన్నావు?
ప్రేమః ఎక్కడ ఉన్నావు?
చంచల్ః ఆఫీస్
ప్రేమః నేను ఫోన్ చెయ్యనా?
చంచల్ః తప్పకుండా. నీ గురించే ఎదురుచూస్తున్నాను.
అక్కడ నుండి వారి సంబంధం కొత్తపుంతలు తొక్కింది. కాని వారికెప్పుడూ వ్యక్తిగతంగా కలుసుకోవడానికి అవకాశం రాలేదు. చదువరులు వారి సంబంధం ఎలా సాగిఉంటుందో ఊహించుకోగలరు. వారి ప్రేమకధను ఇక్కడ చర్చించ అవసరం లేదు. ఒక్కటి మాత్రం నిజం. చంచల్ మాయలో పడ్డాడు. అతడు ఆ మాయనుండి బయటపడ్డాడా లేదా? గురువుగారు, శ్రీమాత అతనిని ఎలా రక్షించారు? అనేది ముందుముందు చూద్దాం.


(ఇంకావుంది..........)
 

No comments:

Post a Comment