SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Tuesday, April 3, 2018

శ్రీవిద్యా ప్రస్థానం-28

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

28


ఈ విధంగా ఒక సంవత్సరం గడచింది. అంతా మామూలగానే జరగసాగింది. చంచల్ సాధన, ప్రేమతో స్నేహం యధావిధిగానే సాగాయి. అతడు గురువుగారిని అప్పుడప్పుడు కలుసుకోవడం జరుగుతుండేది. కాని అతను కొత్త విషయాలేమీ నేర్చుకోలేకపోయాడు.
అమ్మ తన బిడ్డలను ఎన్నటికి వదలదని మనకు తెలుసు కదా!. ఆమె సరియైన సమయంలో సరియైన విధంగా మనకు అవకాశాలను ఇస్తూ ఉంటుంది. చంచల్కు కూడా తనకు తాను తెలుసుకోవడానికి/సరిదిద్దుకోవడానికి అలాంటి అవకాశం ఒకటి వచ్చింది.
మనమేమిటో మనకు మాత్రమే తెలుసు. ఎవరికి వారు తమకు తాము ఎప్పటికప్పుడు తమ చేతలను సరిచూసుకొంటూ జీవనాన్ని సాగించాలి. మనం చేసుకొనే తప్పొప్పులను తెలుసుకుంటూ వాటిని సరిచూసుకుంటూ మనకు మనమే సంస్కరించుకోవాలి. ప్రతీఒక్కరికీ ఈ అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవడమే ముఖ్యం. అలాంటి అవకాశమే చంచల్కు తన కూతురు మోహ ద్వారా ఒకసారి కలిగింది.
మోహః మనం ఏదైనా ఊరు వెడదాం నాన్న. చాలా రోజులైంది మనం బయటి ఊరికి వెళ్ళి.
చంచల్ః అవునుకదా! చాలా రోజులక్రితం మనం డార్జిలింగ్ వెళ్ళాం. సరే, ఈసారి ఎక్కడకు వెళ్దామో చెప్పు.
మోహః ఈసారి మనం సిమ్లా వెళ్దాం. నేను అక్కడ ఐస్ లో ఆడుకుంటాను.
చంచల్ః సిమ్లా చాలా మంచి ఎంపిక. కానీ మనం అక్కడకు వెళ్ళి రావాలంటే కనీసం పది రోజులైనా పడుతుంది. మనకు అన్ని సెలవులు లేవు కాబట్టి ఇంకెక్కడికైనా మనకు దగ్గరగా ఉన్న ప్లేస్ కు వెళ్దాం.
ఆకర్షః ఐతే మనం ఊటీ వెల్దాం. అది మనకు దగ్గరేకదా.
చంచల్ః ఇది కూడా మంచి ఐడియా. సరే అక్కడికే వెల్దాం. ఒకసారి బ్యాంక్లో డబ్బులు ఎన్ని ఉన్నాయో చూసుకొని టిక్కెట్స్ బుక్ చేసుకుందాం. మనకు కనీసం ముప్పైవేలైనా కావాలి కదా.
ఆకర్షః ముప్పైవేలా? చాలా ఎక్కువ కదా. పోనీ తక్కువలో అయ్యేదేదో మీరే చూద్దురు. ఎప్పుడూ విహార ప్రాంతాలేనా. ఈసారి ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్దాం.
చంచల్ః అవును నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఏదో చల్లని వాతావరణానికి అంత ఖర్చు పెట్టే బదులు మనం పుణ్యక్షేత్రానికి వెడితే మంచిదేమో. ఊటీ వెళ్ళితే మన డబ్బులు ఖర్చవ్వగా ఆ సరదా రెండు రోజుల తర్వాత మర్చిపోతాం. అదే పుణ్యక్షేత్రమయితే ఆ పుణ్యం ఫలం మన జీవితాంతం మన వెంటే ఉంటుంది.
ఆకర్షకు అతడు కొంచెం కొత్తగా కనిపించాడు. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఎక్కడకు వెళ్ళాలో మీరే చెప్పండి.
చంచల్ః నీకు చల్లని వాతావరణం, మోహకు ఆడుకోవడానికి చక్కని స్థలం, నాకు మనసు ప్రశాంతత ఇవ్వన్నీ కలగలసి దొరికే స్థలం శ్రీశైలం. శ్రీశైలం ద్వాదశజ్యోతిర్లింగాలలో ఒకటి ఇంకా అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. అమ్మవారు, అయ్యవారు భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి రూపాల్లో మనకు దర్శనమిస్తారు. మనకు కావలసినది దొరకుతుంది మన పెట్టే ఖర్చుకు న్యాయం జరుగుతుంది. ఏమంటారు?
అతడు చెప్పినదానికి ఆకర్ష, మోహ వెంటనే ఒప్పుకున్నారు. ఆకర్షకు కొన్ని రోజులు ఎటైనా వెళ్ళి రావాలని ఉంది. ఆమెకు రోజువారి ఇంటి పనులతో విసుగ్గా ఉంది. అమెకు కొంచెం విశ్రాంతి తీసుకోవాలని ఉంది. స్త్రీలకు అది అప్పుడప్పుడు అవసరం కూడా. ఆమెకు మనసులో ఊటీకు వెళ్ళలేకపోతున్నందున కొంచెం బాధగా ఉన్నా ఆమే సంతోషంతోనే చంచల్ చెప్పినదానికి ఊఁ కొట్టింది.
చంచల్ ప్రేమకు తమ ప్రయాణసంగతి తెలిపి తర్వాత మూడు రోజులదాక ఎటువంటి మెసేజ్ లు చేయవద్దని చెప్పాడు. తర్వాత అతడు గురువుగారి దగ్గరకు వెళ్ళి తమ శ్రీశైల ప్రయాణం గురించి చెప్పాడు. గురువుగారు చాలా సంతోషించి అతడు అక్కడ ఏమేమి చేయాలో చెప్పారు. చంచల్ గురువుగారి దగ్గర సెలవు తీసుకొని బయటకు వెల్తున్న సమయంలో గురువుగారు అతని వంక కొన్ని క్షణాలు దీక్షగా చూసి చిన్నగా నవ్వారు. ఈ విషయం చంచల్కు తెలియదు. కానీ గురువుగారికి అక్కడేమి జరుగుతుందో తెలుసు.
చంచల్ ఎప్పుడూ పుణ్యక్షేత్ర దర్శనాలగురించి ఆలోచించలేదు. అతడికి తన డబ్బుని, సమయాన్ని పబ్బుల్లోని, క్లబ్బుల్లోని వెచ్చించడమే తెలుసు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? అతనిలోని ఈ మార్పుకు కారణం ఏమిటి? ఇదే ఇక్కడ మనం గమనించవలసిన ముఖ్యవిషయం.
తనను శ్రీశైలానికి తీసుకువెడుతున్న అంతర్లీనశక్తిని అతడు గుర్తించే స్థాయిలో లేడు. అది శ్రీశైలమే అవనవసరం లేదు. అది మరేదైన దేవాలయంగాని, సిద్ధపురుషుల సాంగత్యంగాని అవ్వచ్చు. వంద కిలోమీటర్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది కదా.
ఆమర్నాడు వారు శ్రీశైలానికి చేరుకున్నారు. రూం వెదుకులాట, ప్రయాణ అలసట అన్నీ తీరిన తర్వాత వారు దర్శనానికి బయలుదేరారు. అప్పుడు సాయం సమయం ఆరు కావస్తోంది. సూర్యాస్తమయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మేఘాలు కొంచెం ఎరుపు రంగులో చాలా అందంగా కనబడుతున్నాయి. ఎక్కడనుండో ఘంటారావం వారికి లయబద్దంగా వినిపిస్తోంది. చంచల్ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంది ఆసమయంలో. ఆలయప్రధాన ద్వారం ద్వారా వారు దేవాలయంలోకి అడుగుపెట్టారు.


(ఇంకావుంది..........)

No comments:

Post a Comment