SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Tuesday, August 29, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-16

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

16



తర్వాత రెండు నెలలు అంతా మామూలుగా సాగింది. చంచల్ సాధన యధావిధిగా సాగిపోయింది. బాహ్యంగా కానీ, అంతరంగా కానీ ఏమార్పు లేదు. కేవలం మంత్రం, ధ్యానశ్లోకం కంఠస్తమైంది. ఇప్పుడు ఎటువంటి గందరగోళం లేకుండా తనకిచ్చిన మూడు మంత్రాలు చదవగలుగుతున్నాడు. అనుష్ఠాన పద్ధతి సవ్యంగా సులభంగా సాగుతోంది.


ఒకరోజు అతను బాలాత్రిపురసుందరి మంత్రం జపం చేస్తున్నాడు. అతను చాలా శ్రద్ధగా ఏకాగ్రతను మంత్రంపై పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు. అతనను కుంటున్నాడు, “నేను నా దృష్టాంతా కేవలం మంత్రంపైనే పెట్టాలి. బాహ్యవిషయాలేవి నా మనస్సును మర్చకుండా కేవలం మంత్ర ధ్యాసతో జపం చేయాలి”.

ఈ విధంగా తనలో తాను అనుకుంటూ (ఓ విధంగా సేల్ఫ్ హిప్నటైజ్) మంత్ర జపం మొదలుపెట్టాడు. అంతలో ఎవరో తన భుజంపై తట్టి పిలుస్తున్నట్టు అనిపించి, జపానికి  భంగంకలిగి కళ్ళు తెరిచి చూచాడు. మోహ తన భజం తట్టి పిలుస్తోంది.
చంచల్ కు చాలా కోపం కలిగింది. ఏమీ ఆలోచించకుండా పాపచెంపపై గట్టిగా కొట్టాడు. దాంతో పాపనేలపై పడిపోయింది. ఆ పాప తన తండ్రిని అంతకోపంగా ఇప్పటి వరకు చూడలేదు. పాప ఏడ్వడం మొదలెట్టింది. ఆమె చెంప ఎర్రగా కందిపోయింది. అంతలో ఆకర్ష పరుగున పూజ గదిలోకొచ్చింది. పరిస్థితి అర్థం అయ్యింది. ఆమె చంచల్ మీద అరిచింది “ఏంటి ఈ పిచ్చిపని? చిన్నపిల్లని అలాగేనా కొట్టడం?” అని మోహను తీసుకుని అక్కనుండి వెళ్ళిపోయింది.

చంచల్ మనస్సు కొద్దిసమయం శూన్యంగా అయిపోయింది.  జపానికి ఉపక్రమిస్తే శ్రద్ధ కుదరలేదు కానీ జపం ముగించాడు. ఇంత వరకు తన కూతురు మోహను ఎప్పుడూ కోప్పడలేదు. కానీ ఈ రోజు చెంపపైకొట్టాడు. చంచల్ కు చాలా బాధ అనిపించింది. ఆఫీస్ కు బయలుదేరాడు. మోహకోసం చూస్తే ఎక్కడా కనిపించలేదు. తనకు‘బాయ్’ చెప్పడానికి బయటికి రాలేదు. తను బండి స్టార్ట్ చేసాడు.

చంచల్ చాలా బాధపడ్డాడు. “నేనెంత పిచ్చిగా ప్రవర్తించాను, నేనెందుకు మోహను కొట్టాను? మోహ చిన్న పాప. ఆ పాపకు ఈ విషయాలేవి తెలియవు. ఆమె ఎప్పుడూ నాతో ఆడుకోవాలనుకుంటుంది. ఆమెకు టి.వి చూడటం, ఆడుకోవడం, హోటల్ కు వెళ్ళడం అంటే చాలా ఇష్టం. ఈ మధ్య నేను బయటకు తీసుకెళ్ళడంలేదు. ఇవ్వన్నీ ఎవరలవాటు చేశారు? నేను కాదూ? వీటన్నీటికీ నాది కాదూ బాధ్యత? మొదట నన్ను నేను శిక్షించుకోవాలి. ఇందులో మోహ తప్పేమి లేదు.
పిల్లలు మనం చూపిన దారిలో పెరుగుతారు. మనం చూపే మార్గంలో వారి జీవనగతి మరలుతుంది. ఈ మధ్య ఆకర్ష కూడా ఇంతముందులాగ లేదు. మా సాన్నిహిత్యం తగ్గిందేమో అనిపిస్తోంది. అదే కాక బయట కూడా సంఘంలో నా సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. ఏం జరుగుతోంది? ఎందుకు నా సంబంధాలు సన్నగిల్లుతున్నాయి? ఇదే నా సాధన యొక్క ఫలితమా? ఇది బంధవిమోచనమా? కాదేమో నేను సరైనమార్గంలో పయనిస్తున్నానా? నా ఆలోచనలు సరైనవేనా? ఒక్కటి మాత్రం నిజం నేను మాత్రం ముందు మాదిరిగా లేను. అది మాత్రం నిజం. ఏదో తెలియని అలజడి నా మనస్సులో. ఏమిటది? ఎలా తెలుసుకోవాలి? ఎలా ముందుకు సాగాలి? నా సాధన కొనసాగించాలా? మానాలా? నేను సాధన పై మనస్సు లగ్నం చేయలేకపోతున్నాను కూడా. అసలేం సాధించలేకున్నాను. ఏం చేయాలి? ఎవరు నాకు సహాయపడతారు? ” ముందు ఈ ఆలోచనలన్నీ కట్టిపెట్టాలి అని అనుకొని తన కారులో రికార్డ్ ప్లేయర్ ఆన్ చేసాడు. భగవత్ గీత మొదలైంది. శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పుతున్నాడు “అర్జునా! ఈ బంధాలు, భాందవ్యాలు సంతోష సమయంలోనే, ఆపత్ కాలంలో నేను తప్ప ఎవరూ దగ్గరకురారు.”

వెంటనే చంచల్ కు ఏదో స్పురించింది. అవును గురువే సరియైన దారి చూపగలరు. గురువుగారిని కలవాలి అనుకున్నాడు. నా ఈ ఇబ్బందులకు వారి సహాయం, సలహా తీసుకోవాలి అనుకున్నాడు. ఎంత యాద్రుచ్చికం. శ్రీకృష్ణులు చెప్పిన గీత నాకు దారిచూపుతుంది. నా గురువులవారు నా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో నా పూర్తి బాధ్యత వారిదే అని అన్నారు. వారే ఈ ఆటంకాలను తొలగించగలరు. కాబట్టి పెద్దగా చింతించకూడదు. అన్ని విఘ్నాలూ వారి అనుగ్రహంతో నివారించబడతాయి. రేపే గురువుగారిని కలవాలి. చంచల్ ఆకర్ష, మోహతో పాటుగా గురువు గారి దగ్గరకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు.

తరువాత ఏం జరిగింది? .........


ఇంకావుంది.....
 





 

Monday, August 21, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-15

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

15



గురు సిద్ధుల వారి గురుపరంపర అనుసారం, చంచల్ కి గురుత్రయ మంత్రాలు, గణపతి మరియు బాలా త్రిపురసుందరి మంత్రాలు ఉపదేశించారు. ఆ మంత్రాల ఋషి,ఛందస్సు,దేవత, పూర్వాంగన్యాసాలు, ధ్యానశ్లోకాలు, పంచపూజ, మూలమంత్రాలు, మంత్ర దేవతా గాయత్రి, ఉత్తరాంగ న్యాసాలు ఇచ్చారు. ఉపదేశ సమయంలో చంచల్ బాహ్యప్రపంచాన్ని మరిచిపోయాడు. ఆ సమయంలో అతడొక అవ్యక్తమైన దివ్యానుభూతికి లోనైనాడు. ఇది కేవలం భగవత్ ధ్యానం వల్ల కలిగిన దివ్యానుభవం. అతని దృష్టి కేవలం గురువు గారు భోదిస్తున్న పద్ధతులపైనే ఉండిపోయింది. ఇది తనకు తన స్వతహాగా వచ్చింది కాదు. గురువు గారి శక్తివంతమైన ఉపదేశం వల్ల కలిగినది. మంత్రోపదేశం గంట పాటు సాగింది.
తర్వాత గురువు గారు అన్నారు.....
గురుసిద్ధులు: నాయన, మంత్రాలు వాటి సాధనా పద్ధతులు చెప్పినట్టుగా జాగ్రత్తగా సాధన చేయి. మంత్రం పలికే పద్ధతి చాలా ముఖ్యం అదే మంత్రానికి ప్రాణం.
మంత్రప్రాణం గూర్చి తెలుసుకోకుండా సాధన చేయడం వృధా. మంత్రప్రాణాన్ని గూర్చి ఇంకా వివరంగా నీ సాధనా ప్రగతిని చూసిన తర్వాత చెబుతాను.
చంచల్: గురువుగారు, రోజుకు ఎన్ని వందల సార్లు మంత్రజపం చేయాలి?
గురుసిద్ధులు: ప్రతిరోజు తక్కువలో తక్కువ పదకొండు సార్లు, అంతకు మించి ఎన్నిసార్లైనా చేయవచ్చు. నా సలహా మాత్రం మంత్రం సంఖ్యపై మనస్సు పెట్టకు.
లెక్కలేనంత సాధన కావాలి. అందులోనూ ప్రతిరోజూ మాత్రం తప్పక చేయాలి.
ఒక్కటి గుర్తుపెట్టుకో.  సంఖ్యతో మాత్రం సంబంధంలేదు.  గ్రహ సంబంధ జపాలు, కొన్ని సంప్రదాయలలో మాత్రం నియమిత సంఖ్య విధిగా పురశ్చరణ విధి విధించబడింది. అది సంప్రదాయన్ననుసరించి ఉంటుంది. మన సంప్రదాయంలో పురశ్చరణ విధి లేదు. పురశ్చరణ విధి ఉత్తమమైనదే అయినా సమయం, ఖర్చు దృష్ట్యా మన గురుసంప్రదాయంలో పురశ్చరణ విధి నిర్ధేశించబడి ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం పురశ్చరణ మంత్ర సిద్ధికి ఆవశ్యం మాత్రం కాదు. ఇది కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు.
చంచల్: మంత్ర సాధన ఎప్పుడు చేయాలి? ఉదయం పూటా లేదా సాయంత్రం పూటా?
గురుసిద్ధులు: శక్తిమంత్రాలకు చంద్రోదయం అయిన తర్వాత సమయమం ప్రశస్తమైనది. కానీ ప్రస్తుత కాలానుగుణంగా, బ్రాహ్మీమూహూర్త సాధన మంచిది. ఇంకా వీలైతే రాత్రి సమయంలో కూడా సాధన చేయవచ్చు.
చంచల్: గురువుగారు, నేను గాయత్రీ, లలితాసహస్రనామ స్తోత్రం చేస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలు. వీటిని ఏ క్రమంలో చేయాలి?
గురుసిద్ధులు: సంధ్యావందనం, దేవతారాధన, మంత్ర జపం మరియు స్తోత్ర పారాయణ ఇది సరైన క్రమం. ఇవి అన్నీ కలిపి సాధన అంటారు. దేవతారాధన పద్ధతిని ముందు ముందు చెబుతాను. కాబట్టి మిగతా క్రమాన్ని అనుసరించవచ్చు.
సమయం సాయంత్రం ఏడు గంటలు కావస్తుండగా చంచల్ గురువుగారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరడానికి సన్నద్ధమైనాడు. గురువు గారు భోజనం చేసి వెళ్ళమని అన్నారు. భోజనం చేద్దామని అనుకుని ఇంతలో తన భార్యా, పిల్ల గురించి ఆలోచనవచ్చి అదే విషయం గురువు గారికి చెప్పాడు. గురువుగారు చిరునవ్వుతో సరే అన్నారు. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు భార్యాబిడ్డలతో రమ్మన్నారు.
చంచల్ ఇంటికి వెళ్ళే దారిలో - ఇకనుండి ఎక్కువ సమయం సాధనకు వినియోగించాలి. అందుకు సమయాన్ని సరిగా వినియోగించుకోవాలి. లేకుంటే ఆధ్యాత్మికంగా ఎదగడం కష్టం అని అనుకున్నాడు. గురువు గారిని, వారి శిష్యులను, ఆశ్రమ వాతావరణం చూసిన తరువాత సరియైన జీవన విధానమంటే ఇదే అనుకున్నాడు. ఇప్పటి వరకు నేను జీవించిన పద్ధతి సరైనది కాదు. ఇప్పటి వరకు నా జీవన విధానం విద్యుత్ కాంతైతే గురువు గారి జీవన విధానం సహజమైన జ్యోతి లా ఉంది. సహజమైన జ్యోతి ఎప్పటికీ ప్రకాశించి జ్ఞానాన్ని పంచుతుంది. అని ఆలోచనలతో ఇళ్లు చేరాడు చంచల్.
ఆకర్ష తలుపు తెరిచింది, చాలా అందంగా తయారైన ఆకర్ష తనవయ్యారాన్ని ఒలకబోస్తున్నట్టుగా నిలబడి కనిపించే సరికి చంచల్ తట్టుకోలేక తన వైపుకు
లాక్కున్నాడు. అంతలో ఆమే...
ఆకర్ష: ఆగండాగండి..... వెళ్ళి స్నానం కానివ్వండి. మోహ పడుకుంది.
ఆత్రుతనాపుకోలేని మనస్సుతో బలవంతంగా, స్నానానికి వెళ్ళాడు చంచల్. స్నానం చేస్తున్నప్పుడు గురువుగారిని గూర్చి ఆశ్రమం గూర్చి జ్ఞాపకాలు మెదిలాయి. ఆక్కడి విషయాలు ఆకర్షకు చెప్పాలి అనుకున్నాడు. ఇంతలో ఆకర్ష అందంగా తయారైన విషయ స్ఫురించి ఎప్పటి మాదిరి ఆలోచనల్లోకి మనస్సు కూరుకుపోయింది.
ఎప్పటి మాదిరిగా ఆ రాత్రి గడిచి పోయింది. మొత్తానికి ఎలాగోలా బ్రాహ్మీమూహూర్తంలో లేవగలిగాడు.
చంచల్ సాధన ప్రారంభించాడు. సంధ్యావందనం ముగించుకొని ఉత్సాహంగా శ్రీవిద్యా మంత్రాలను ప్రారంభించడానకి సమాయత్తమయ్యాడు. ఈ క్రమంలో గాయత్రీ
మంత్రంపై ఎక్కువ దృష్టి నిలపలేదు. అతనికి ఇవ్వబడిన మంత్రాలు ప్రారంభించాడు.
చంచల్ కు సాధన చాలా గొప్పగా అనిపించింది. మొదట గురుత్రయ మంత్రాలు ముగించుకుని మహాగణపతి మంత్ర సాధన ప్రారంభించాడు. 108 మార్లు చేద్దాం అనుకున్నాడు. సమయం చూసేసరికి అప్పటికే 6.30 అయ్యింది. కానీ చంచల్ 7.30కి ఆఫీస్ కు బయలుదేరాలి. మహాగణపతి మంత్రం ప్రారంభించాడు. అతని మనస్సు సమయంగూర్చి ఆలోచిస్తుంటే నోరు మంత్రాన్ని చదువుతోంది. కొంతసేపటి తరువాత అతని మనస్సు ఆఫీసు విషయాలపైకి, ఇంటి విషయాలపైకి, సినిమాలపైకి జారుతూ మునుగుతూంటే నోరు మాత్రం మంత్రం వెంట వేగంగా పరిగెడుతోంది. ఒకసారి ఆలోచనలు ఆపే ప్రయత్నంచేస్తే, నోరు వేగం తగ్గింది. వెంటనే
ఎప్పుడు 108 అయిపోతాయో అని అనిపించింది. ఎందుకు 108 చేస్తానని సంకల్పం చేశానా అని కూడా అనిపించింది. గురువుగారు 11 మార్లు చాలన్నారుకదా. ఇంకా బాలా మంత్రం కూడా చేయాలి. 11 సార్లు చేస్తే పోయేది అనుకుంటూ గణపతి మంత్రం108 మార్లు ముగించాడు. ఈ ఆలోచనల్లో గురువుగారు చెప్పిన జాగ్రత్త మాత్రం మరిచాడు. అదే మరి విధి అంటే.
తరువాత బాలా మంత్రం మొదలు పెట్టాడు. బాలా మంత్రం ఋష్యాదులు అయిన తరువాత బాలా హృదయ మంత్రం మొదలుపెట్టాడు. గురువు గారు చెప్పారు “హృదయ మంత్రం చాలా కొద్ది గురుసంప్రదాయాలలో మాత్రమే వుంది”. బాలా మూల మంత్రం చాలా సులభంగా వుంటే హృదయ మంత్రం చాలా కఠినంగా వుంటుంది. చంచల్ బాలాహృదయమంత్రం మొదలు పెట్టాడు. ఒకసారి చదవగానే హాలు(లివింగ్ రూం)నుండి బిగ్గరగా దూం మచారే... దూం మచారే పాఠ వినిపించే సరికి ఒక్కింత తడబడ్డాడు. కొన్ని క్షణాలపాటు ఆ పాట అతని మనస్సులో మెదిలింది. ఇంతలో అతని బుద్ధి చేసిన హెచ్చరికతో ఎమిటా పాట అని బిగ్గరా అరిచాడు. ఆకర్ష పరుపరున వచ్చి ఎమిటన్నట్లు చూసింది. చంచల్ అడిగాడు...
చంచల్ : ఎమిటా శబ్దం?
ఆకర్ష : మోహ టి.వీ చూస్తోంది.
చంచల్ : ఇది టి.వీ చూసే సమయమా? కట్టేయమను.
ఆకర్ష : టి.వీ ఆపితే తను బ్రేక్ ఫాస్ట్ తినదు. మీరే సర్దుకోండి.
చంచల్ : సరే, కనీసం సౌండ్ తగ్గించు. నా జపం చివరకొచ్చింది.
ఆకర్ష : సరే చూస్తా అని వెళ్ళింది
ఇంకావుంది....




 

Monday, August 7, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-14

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

14

చంచల్ ఆశ్రమం చేరే సరికి గురువు గారు యాగశాలలో ఉన్నారు. గురువుగారు, పూర్ణ ఇద్దరూ ఏదో హోమం చేస్తూ కనిపించారు. అతనికి ఆ హోమమేంటో తెలియదు. వేదస్వర మంత్ర ఘోష చెవులను చేరి అలౌకికానందాన్ని మనస్సులో నింపింది. చంచల్ ఈ సమయంలో గురువుగారికి నమస్కారాదులు చేయాలా లేదా అని సంశయంలో పడిపోయాడు. అంతలో ఒకరు వచ్చి గురువుగారు భైరవ ప్రయోగంలో ఉన్నారు. సమయం పడుతుంది మీరు కూర్చోండి. పూజ తరువాత గురువు గారిని కలవవచ్చు అని చెప్పాడు. చంచల్ సరే అని హోమకుండానికి దగ్గరలో కూర్చున్నాడు. గురువుగారితో పాటుగా హోమకుండం దగ్గర నలుగురున్నారు. అందులో ఒకతను ఏదో అసహజంగా ఉన్నాడు. ఆకాశంవైపు (శూన్యంలోకి) చూస్తూ, మానసికంగా స్థిమితంగా లేకుండున్నాడు. అతని వేషధారణ కూడా సరిగా లేదు. తలదువ్వుకోలేదు. తల అటూ ఇటూత్రిప్పుతున్నాడు. చంచల్ అతనికి మనోవైకల్యముందికాబోలు అనుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో మాత్రం అతనికి అర్థం కాలేదు. దీని గూర్చి గురువుగారిని తరువాత అడగాలనుకున్నాడు. ఈ విషయం నోట్ బుక్ లో వ్రాసుకున్నాడు.
 సమయం ఉదయం11.00 కావస్తోంది. ఇంతలో గురువుగారి మాటలు గుర్తుకొచ్చాయి. గురువుగారు అపరాహ్నం దాటిన తరువాత ఏ దీక్షా ఇవ్వబడదని నికచ్చిగ చెప్పివున్నారు. అంతకుముందుగానే హోమం ముగియవచ్చు అని ఆశించాడు. కానీ ఉదయం 11.45 కావస్తోంది. చంచల్ కి తన దీక్షగురించి దిగులు పట్టుకుంది. కాసేపటికి పూర్ణాహుతి మొదలైంది. అందరూ లేచి నిలచున్నారు. గురువుగారు మరియు పూర్ణ, పూర్ణాహుతి మంత్రాలు బిగ్గరగా చదువుతున్నారు. ఇంత క్రితం పిచ్చిగా ప్రవర్తించినతను తప్ప మిగతా అందరూ నిశ్శబ్దంగా వున్నారు. అతను మాత్రం అకారణంగా పిచ్చిగా బిగ్గరగా నవ్వుతున్నాడు. గురువుగారు హోమ కార్యక్రమంపై దృష్టి నిలిపి, ఆ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న అతని నుదుటిపై చేయివుంచి, హోమ విభూతిని పెట్టారు. హోమ విభూతి నుదుటిని తాకగానే అతను తన పక్కనే వున్న మరొక అతని ఒడిలో పడిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత గురువుగారు ఏదో మంత్రం చదువుతూ అతనిపై తీర్ధమును చల్లారు. వెంటనే అతను కళ్లు తెరిచి వింతగా తన చూట్టూ వున్న వారిని చూస్తూ, తన పక్కనే ఉన్న అతడి తండ్రిని అడిగాడు.
పిచ్చిగా ప్రవర్తించిన వ్యక్తి(గోపాల్) అడిగాడు – నాన్న గారు ఎమైంది? ఇక్కడేం జరుగుతోంది? మనం ఇక్కడెందుకున్నాం?
పిచ్చిగా ప్రవర్తించిన వ్యక్తి తండ్రి – గోపాల్, నన్ను గుర్తుపట్టావా? ఓహ్....ఆశ్చర్యం. చాలా రోజుల తరువాత నువ్వు నన్ను గుర్తుపడుతున్నావు. గురువుగారు మనల్ని
రక్షించారు అని గురువుగారి పాదాలపై పడిపోయాడు. గురువుగారు అతన్ని లేవదీసి “అంతా శుభమే జరుగుతుంది దిగులు పడకండి, ఇంకో సారి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి” అన్నారు.
వాళ్ళు గురువుగారి ఆశీర్వాదం తీసుకుని, సంతోషంతో వెళ్ళిపోయారు.

చంచల్ కు అక్కడ ఏమి జరిగిందో అర్థంకాలేదు. అతను అక్కడ జరిగిన సంఘటనను నమ్మలేకపోయాడు. అతను ఈ విషయాలను నమ్మడానికి అతనికున్న లౌకిక వివేకం ఒప్పుకోనీయలేదు. అసలతను ఇది కళ్ళారా చూడకుండావుంటే నమ్మేవాడే కాదు. అయినా ఇంకా అతనికి సందేహమే. ఇవ్వన్నీ గురువుగారినడగాలనుకుని అక్కడనుండి గురువుగారివైపు కదిలాడు.

ఇంతలో ఓ పెద్దావిడ వారిని భోజనం చేయటానికి రావాలని ఆహ్వానించింది. ఆవిడ గురువు గారి ధర్మపత్ని. ఆమె పెద్దకుంకుమ బొట్టు నుదుటిపై పెట్టుకుని బంగారు ఛాయలో వుంది. ఆవిడ పేరు గౌరి. ఆమెతో గురువుగారు ఇలా అన్నారు.....
గురుజీ: చంచల్ ని గౌరికి పరిచయం చేసి, నీవు భోజనం కానివ్వు. ఈ రోజు ఇతడికి దీక్ష ఇవ్వాలి.
గురుమా (గుర్వంబా) ఓ సారి చంచల్ వైపు చూసి లోనికి వెళ్ళింది.
గురువు గారు చంచల్ వైపుచూసి అన్నారు, “ఇప్పటికే (అపరాహ్నం)12.00 గంటలు దాటింది. ఇప్పుడు దీక్ష ఇవ్వడం కుదరదు. మళ్ళీ సాయం సంధ్య వరకు ఆగాలి. అప్పటివరకు వేచివుంటావా? లేక మళ్ళీ వస్తావా?
చంచల్: వేచివుంటాను గురువుగారు
గురువు గారు చిరునవ్వు నవ్వి ఇంటిలోనికి వెళ్ళారు. చంచల్ కు ఇంకా ఏం చేయాలో తోచలేదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చాలా అరుదుగా అతడు ఉపవాసం ఉంటాడు. ఈరోజు అనుకోకుండా ఉపవాసం చేస్తున్నాడు. ఆకర్షకు ఫోన్ చేసి జరిగిన విషయం వివరించాడు. ఆమె సరేఅంది.
కొంత సేపటి తర్వాత, పూర్ణ చిరునవ్వు నవ్వుతూ చంచల్ వద్దకు వచ్చాడు.
చంచల్ ముక్తసరిగ పలకిరించాడు. పూర్ణ చంచల్ ప్రక్కన కూర్చున్నాడు. వాళ్ళు ఒకరినొకరు పకరిచయంచేసుకున్నారు.
పూర్ణ: ఆకలిగా వుందా?
చంచల్: లేదు...లేదు...(గొనిగాడు)
పూర్ణ చిన్నగా నవ్వి అన్నాడు “నేనర్థం చేసుకోగలను నీ పరిస్థితిని ”. మీకో విషయం తెలుసా, ఈ రోజు ఆశ్రమంలో ఎవ్వరూ భోజనం చేయరు. గురుమా అన్నిట్లో గురుగారిని అనుసరిస్తుంది. గురువుగారు భోజనం చేయరు కాబట్టి ఆమె భోంచేయరు. గురువుగారు, గురుమా భోజనం చేయరు కాబట్టి మేం కూడా భోజనం చేయము. ఇదంతా మామూలే ఇక్కడ. కాబట్టి మాకేం ఇబ్బందిలేదు. ఇక్కడున్నంత సేపు మేము మా బాధలన్నీ మరిచిపోతాం.

చంచల్ ఇలా అనుకున్నాడు, “ ఇదంతా నా బుద్ధితక్కువతనం వల్ల, నా మనస్సును నియంత్రించుకోలేక పోవడం వలన జరిగింది. గురువుగారు దీక్షకు సంబంధించిన నియమాలు, సమయం స్పష్టంగా చెప్పారు. వారి మాట సరిగా పాటించివుంటే బాగుండు. నిన్న ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఇకనుండైనా సమయాన్ని కచ్చితంగా పాటించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. నా మూర్ఖత్వం వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి”.

చంచల్ ఆలోచనలకు భంగం కలిగిస్తూ పూర్ణ ఇలా అన్నాడు“అంత దీర్ఘంగా ఏమాలోచిస్తున్నారు? ఏం ఇబ్బందిలేదు. ఇక్కడ ఇలాంటివి మాకు మాములే. మీకు ఈ రోజు గురువు గారి హోమం విషయం తెలియదు కదా. తెలిసుంటే సరియైన సమయానికొచ్చుండేవారు కదా. ఇంకా ఎక్కువ ఆలోచించకండి ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆనందించండి ”.

పూర్ణ మాటలకు చంచల్ కి కొంత ఉపశమనం కలిగింది. ఎంత మంచి మనస్సు అనుకొని, ఇలా అడిగాడు...

చంచల్: ఈరోజు జరిగిన హోమం ఏమిటి? అతనెవరు? ఎందుకొరకు ఈ హోమం చేశారు?

పూర్ణ: అది ఉన్మత్తభైరవ హోమ ప్రయోగం. అతని పేరు గోపాల్. అతనికి ఇంటర్నేట్ ద్వారా ఎవరో కుండలిని ప్రయోగ సంబంధ దీక్షనిచ్చారట. అసలు వీరు ఒకరికొకరు తెలియనే తెలియదు. గోపాల్ ఫోల్ లో సంప్రదిస్తే దీక్ష ఇచ్చాడట. అందుకుగాను ఇతను రెండు లక్షలు ఆన్ లైన్లో పంపాడంట. అతను ఇంటర్నేట్లో పంపే సూచనల ప్రకారం సాధన చేసాడు. కొన్నిరోజుల తర్వాత గోపాల్ పరిస్థితి నీవు పొద్దున చూసిన మాదిరిగా తయారైంది.
అతను పిచ్చివాడిగ అయ్యాడు. సరియైన మార్గదర్శనం చేయకపోవడం వల్లా, అతను అనుసరించిన అశాస్త్రీయ సాధనా పద్ధతుల వల్ల ఇలా అయింది. ఇంకా ఆ ఇంటర్నేట్ గురువన్నాడట గోపాల్ కు సిద్ధి కలిగిందని బొంకి ఇంకా అయిదు లక్షలివ్వలని డిమాండ్ చేసాడంట. గోపాల్ వాళ్ళ నాన్న గారికి అనుమానం వచ్చి నన్ను కలిసాడు. వాళ్ళు, మేము ఒకే వీధిలో ఉంటాం. మేం వచ్చి గురువుగారిని కలిసాం. తర్వాత జరిగిందంతా నువ్వు చూసావు కదా. అందుకే మన శాస్త్రాలు సరియైన గురువు దగ్గరే విద్యను నేర్చుకోమని చెబుతున్నాయి. గురువును దైవంగా కొలుస్తాయి, గురువే దైవమని భోదిస్తాయి. ప్రస్తుతం పరిస్థితులన్నీ తారుమారై ఇలా ఏడవాల్సి వస్తోంది. ప్రస్తుత సాంకేతికత మనుషులను ఉన్నతి వైపుకు నడిపించేందుకు కొంతవరకే ఉపయుక్తం అవుతోంది. అది – వ్యక్తిగత ఉన్నతే గాని (పర్సనల్ డెవలప్ మెంటే) వ్యక్తిత్వ వికాసం (పర్సనాలిటీడెవలప్ మెంట్) కాదు.
తరువాత పూర్ణ చంచల్ ను తీసుకెళ్ళి ఆశ్రమమంతా చూపించాడు. అక్కడ యాగశాల, పాకశాల, గోశాల అన్నీ ఉన్నాయి. ఒక చోట గురువుగారు ధ్యానంలో ఉన్నారు, పూర్ణ చెప్పాడు గురువు గారు సమాధి స్థితిలో ఉన్నారని...
పూర్ణ: ఇది ధ్యాన మందిరం, ఇక్కడే శ్రీమాత శ్రీచక్రరూపిణిగా కొలువై వుంది.
ఈ విషయాన్ని చెపుతున్నప్పుడు పూర్ణ మాటల్లో గురువు గారిపట్ల, ఆశ్రమంపై అతనికి ఉన్న భక్తిభావాన్ని చంచల్ గ్రహించాడు
ఆశ్రమమంతా చూసే సరికి సాయంత్రం 5.00 కావస్తోంది. గురువుగారు ధ్యాన మందిరంలోనుండి బయట వచ్చి చంచల్ ని స్నానం చేయమన్నారు. పూర్ణ టవల్, దీక్ష ధోవతినిచ్చాడు. ఇవికూడా తన వెంటతెచ్చుకోనందుకు చంచల్ సిగ్గుపడ్డాడు.

సాయంసంధ్యా కాలమైంది. చంచల్ జీవితం గొప్ప మలుపుతిరిగే శుభగడియలు వచ్చాయి. చంచల్ మరియు గురువుల వారు శక్తి పీఠం ముందున్నారు. గురువుగారు చంచల్ కు దీక్ష ఇవ్వడం ప్రారంభించారు. గురువుగారు తన కుడి హస్తం చంచల్ తలపై సహస్రారంలో ఉంచారు. చంచల్కు కొన్ని క్షణాల పాటు ఒక విధమైన సున్నితమైన షాక్ లాంటి వణుకు అతని వెన్నులో కలిగింది. శక్తిపాతం మొదలైంది. కొద్దిదూరంలో గురుమా సాయంకాల పూజ పూర్తి చేసి గంట మ్రోగించారు. ఇది చంచల్ శ్రీవిద్యా ప్రవేశ సమ్మతానికి చిహ్నంగా అమ్మవారు సూచించిందా?. సత్సంప్రదాయ విధి విధానంగా చంచల్ శ్రీవిద్యా దీక్షలో  ప్రవేశించాడు.

చంచల్ ఆధ్యాత్మిక ప్రహసనం మొదలైంది, ఏలా సాగిందో ముందు, ముందు చూద్దాం........



ఇంకావుంది.........