SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Monday, August 21, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-15

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

15



గురు సిద్ధుల వారి గురుపరంపర అనుసారం, చంచల్ కి గురుత్రయ మంత్రాలు, గణపతి మరియు బాలా త్రిపురసుందరి మంత్రాలు ఉపదేశించారు. ఆ మంత్రాల ఋషి,ఛందస్సు,దేవత, పూర్వాంగన్యాసాలు, ధ్యానశ్లోకాలు, పంచపూజ, మూలమంత్రాలు, మంత్ర దేవతా గాయత్రి, ఉత్తరాంగ న్యాసాలు ఇచ్చారు. ఉపదేశ సమయంలో చంచల్ బాహ్యప్రపంచాన్ని మరిచిపోయాడు. ఆ సమయంలో అతడొక అవ్యక్తమైన దివ్యానుభూతికి లోనైనాడు. ఇది కేవలం భగవత్ ధ్యానం వల్ల కలిగిన దివ్యానుభవం. అతని దృష్టి కేవలం గురువు గారు భోదిస్తున్న పద్ధతులపైనే ఉండిపోయింది. ఇది తనకు తన స్వతహాగా వచ్చింది కాదు. గురువు గారి శక్తివంతమైన ఉపదేశం వల్ల కలిగినది. మంత్రోపదేశం గంట పాటు సాగింది.
తర్వాత గురువు గారు అన్నారు.....
గురుసిద్ధులు: నాయన, మంత్రాలు వాటి సాధనా పద్ధతులు చెప్పినట్టుగా జాగ్రత్తగా సాధన చేయి. మంత్రం పలికే పద్ధతి చాలా ముఖ్యం అదే మంత్రానికి ప్రాణం.
మంత్రప్రాణం గూర్చి తెలుసుకోకుండా సాధన చేయడం వృధా. మంత్రప్రాణాన్ని గూర్చి ఇంకా వివరంగా నీ సాధనా ప్రగతిని చూసిన తర్వాత చెబుతాను.
చంచల్: గురువుగారు, రోజుకు ఎన్ని వందల సార్లు మంత్రజపం చేయాలి?
గురుసిద్ధులు: ప్రతిరోజు తక్కువలో తక్కువ పదకొండు సార్లు, అంతకు మించి ఎన్నిసార్లైనా చేయవచ్చు. నా సలహా మాత్రం మంత్రం సంఖ్యపై మనస్సు పెట్టకు.
లెక్కలేనంత సాధన కావాలి. అందులోనూ ప్రతిరోజూ మాత్రం తప్పక చేయాలి.
ఒక్కటి గుర్తుపెట్టుకో.  సంఖ్యతో మాత్రం సంబంధంలేదు.  గ్రహ సంబంధ జపాలు, కొన్ని సంప్రదాయలలో మాత్రం నియమిత సంఖ్య విధిగా పురశ్చరణ విధి విధించబడింది. అది సంప్రదాయన్ననుసరించి ఉంటుంది. మన సంప్రదాయంలో పురశ్చరణ విధి లేదు. పురశ్చరణ విధి ఉత్తమమైనదే అయినా సమయం, ఖర్చు దృష్ట్యా మన గురుసంప్రదాయంలో పురశ్చరణ విధి నిర్ధేశించబడి ఉండకపోవచ్చు. ఒక్కటి మాత్రం నిజం పురశ్చరణ మంత్ర సిద్ధికి ఆవశ్యం మాత్రం కాదు. ఇది కొందరు ఒప్పుకుంటారు, కొందరు ఒప్పుకోరు.
చంచల్: మంత్ర సాధన ఎప్పుడు చేయాలి? ఉదయం పూటా లేదా సాయంత్రం పూటా?
గురుసిద్ధులు: శక్తిమంత్రాలకు చంద్రోదయం అయిన తర్వాత సమయమం ప్రశస్తమైనది. కానీ ప్రస్తుత కాలానుగుణంగా, బ్రాహ్మీమూహూర్త సాధన మంచిది. ఇంకా వీలైతే రాత్రి సమయంలో కూడా సాధన చేయవచ్చు.
చంచల్: గురువుగారు, నేను గాయత్రీ, లలితాసహస్రనామ స్తోత్రం చేస్తున్నాను ఇప్పుడు ఈ మంత్రాలు. వీటిని ఏ క్రమంలో చేయాలి?
గురుసిద్ధులు: సంధ్యావందనం, దేవతారాధన, మంత్ర జపం మరియు స్తోత్ర పారాయణ ఇది సరైన క్రమం. ఇవి అన్నీ కలిపి సాధన అంటారు. దేవతారాధన పద్ధతిని ముందు ముందు చెబుతాను. కాబట్టి మిగతా క్రమాన్ని అనుసరించవచ్చు.
సమయం సాయంత్రం ఏడు గంటలు కావస్తుండగా చంచల్ గురువుగారి ఆశీర్వాదం తీసుకుని బయలుదేరడానికి సన్నద్ధమైనాడు. గురువు గారు భోజనం చేసి వెళ్ళమని అన్నారు. భోజనం చేద్దామని అనుకుని ఇంతలో తన భార్యా, పిల్ల గురించి ఆలోచనవచ్చి అదే విషయం గురువు గారికి చెప్పాడు. గురువుగారు చిరునవ్వుతో సరే అన్నారు. ఈసారి మళ్ళీ వచ్చినప్పుడు భార్యాబిడ్డలతో రమ్మన్నారు.
చంచల్ ఇంటికి వెళ్ళే దారిలో - ఇకనుండి ఎక్కువ సమయం సాధనకు వినియోగించాలి. అందుకు సమయాన్ని సరిగా వినియోగించుకోవాలి. లేకుంటే ఆధ్యాత్మికంగా ఎదగడం కష్టం అని అనుకున్నాడు. గురువు గారిని, వారి శిష్యులను, ఆశ్రమ వాతావరణం చూసిన తరువాత సరియైన జీవన విధానమంటే ఇదే అనుకున్నాడు. ఇప్పటి వరకు నేను జీవించిన పద్ధతి సరైనది కాదు. ఇప్పటి వరకు నా జీవన విధానం విద్యుత్ కాంతైతే గురువు గారి జీవన విధానం సహజమైన జ్యోతి లా ఉంది. సహజమైన జ్యోతి ఎప్పటికీ ప్రకాశించి జ్ఞానాన్ని పంచుతుంది. అని ఆలోచనలతో ఇళ్లు చేరాడు చంచల్.
ఆకర్ష తలుపు తెరిచింది, చాలా అందంగా తయారైన ఆకర్ష తనవయ్యారాన్ని ఒలకబోస్తున్నట్టుగా నిలబడి కనిపించే సరికి చంచల్ తట్టుకోలేక తన వైపుకు
లాక్కున్నాడు. అంతలో ఆమే...
ఆకర్ష: ఆగండాగండి..... వెళ్ళి స్నానం కానివ్వండి. మోహ పడుకుంది.
ఆత్రుతనాపుకోలేని మనస్సుతో బలవంతంగా, స్నానానికి వెళ్ళాడు చంచల్. స్నానం చేస్తున్నప్పుడు గురువుగారిని గూర్చి ఆశ్రమం గూర్చి జ్ఞాపకాలు మెదిలాయి. ఆక్కడి విషయాలు ఆకర్షకు చెప్పాలి అనుకున్నాడు. ఇంతలో ఆకర్ష అందంగా తయారైన విషయ స్ఫురించి ఎప్పటి మాదిరి ఆలోచనల్లోకి మనస్సు కూరుకుపోయింది.
ఎప్పటి మాదిరిగా ఆ రాత్రి గడిచి పోయింది. మొత్తానికి ఎలాగోలా బ్రాహ్మీమూహూర్తంలో లేవగలిగాడు.
చంచల్ సాధన ప్రారంభించాడు. సంధ్యావందనం ముగించుకొని ఉత్సాహంగా శ్రీవిద్యా మంత్రాలను ప్రారంభించడానకి సమాయత్తమయ్యాడు. ఈ క్రమంలో గాయత్రీ
మంత్రంపై ఎక్కువ దృష్టి నిలపలేదు. అతనికి ఇవ్వబడిన మంత్రాలు ప్రారంభించాడు.
చంచల్ కు సాధన చాలా గొప్పగా అనిపించింది. మొదట గురుత్రయ మంత్రాలు ముగించుకుని మహాగణపతి మంత్ర సాధన ప్రారంభించాడు. 108 మార్లు చేద్దాం అనుకున్నాడు. సమయం చూసేసరికి అప్పటికే 6.30 అయ్యింది. కానీ చంచల్ 7.30కి ఆఫీస్ కు బయలుదేరాలి. మహాగణపతి మంత్రం ప్రారంభించాడు. అతని మనస్సు సమయంగూర్చి ఆలోచిస్తుంటే నోరు మంత్రాన్ని చదువుతోంది. కొంతసేపటి తరువాత అతని మనస్సు ఆఫీసు విషయాలపైకి, ఇంటి విషయాలపైకి, సినిమాలపైకి జారుతూ మునుగుతూంటే నోరు మాత్రం మంత్రం వెంట వేగంగా పరిగెడుతోంది. ఒకసారి ఆలోచనలు ఆపే ప్రయత్నంచేస్తే, నోరు వేగం తగ్గింది. వెంటనే
ఎప్పుడు 108 అయిపోతాయో అని అనిపించింది. ఎందుకు 108 చేస్తానని సంకల్పం చేశానా అని కూడా అనిపించింది. గురువుగారు 11 మార్లు చాలన్నారుకదా. ఇంకా బాలా మంత్రం కూడా చేయాలి. 11 సార్లు చేస్తే పోయేది అనుకుంటూ గణపతి మంత్రం108 మార్లు ముగించాడు. ఈ ఆలోచనల్లో గురువుగారు చెప్పిన జాగ్రత్త మాత్రం మరిచాడు. అదే మరి విధి అంటే.
తరువాత బాలా మంత్రం మొదలు పెట్టాడు. బాలా మంత్రం ఋష్యాదులు అయిన తరువాత బాలా హృదయ మంత్రం మొదలుపెట్టాడు. గురువు గారు చెప్పారు “హృదయ మంత్రం చాలా కొద్ది గురుసంప్రదాయాలలో మాత్రమే వుంది”. బాలా మూల మంత్రం చాలా సులభంగా వుంటే హృదయ మంత్రం చాలా కఠినంగా వుంటుంది. చంచల్ బాలాహృదయమంత్రం మొదలు పెట్టాడు. ఒకసారి చదవగానే హాలు(లివింగ్ రూం)నుండి బిగ్గరగా దూం మచారే... దూం మచారే పాఠ వినిపించే సరికి ఒక్కింత తడబడ్డాడు. కొన్ని క్షణాలపాటు ఆ పాట అతని మనస్సులో మెదిలింది. ఇంతలో అతని బుద్ధి చేసిన హెచ్చరికతో ఎమిటా పాట అని బిగ్గరా అరిచాడు. ఆకర్ష పరుపరున వచ్చి ఎమిటన్నట్లు చూసింది. చంచల్ అడిగాడు...
చంచల్ : ఎమిటా శబ్దం?
ఆకర్ష : మోహ టి.వీ చూస్తోంది.
చంచల్ : ఇది టి.వీ చూసే సమయమా? కట్టేయమను.
ఆకర్ష : టి.వీ ఆపితే తను బ్రేక్ ఫాస్ట్ తినదు. మీరే సర్దుకోండి.
చంచల్ : సరే, కనీసం సౌండ్ తగ్గించు. నా జపం చివరకొచ్చింది.
ఆకర్ష : సరే చూస్తా అని వెళ్ళింది
ఇంకావుంది....




 

No comments:

Post a Comment