SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Monday, August 7, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-14

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

14

చంచల్ ఆశ్రమం చేరే సరికి గురువు గారు యాగశాలలో ఉన్నారు. గురువుగారు, పూర్ణ ఇద్దరూ ఏదో హోమం చేస్తూ కనిపించారు. అతనికి ఆ హోమమేంటో తెలియదు. వేదస్వర మంత్ర ఘోష చెవులను చేరి అలౌకికానందాన్ని మనస్సులో నింపింది. చంచల్ ఈ సమయంలో గురువుగారికి నమస్కారాదులు చేయాలా లేదా అని సంశయంలో పడిపోయాడు. అంతలో ఒకరు వచ్చి గురువుగారు భైరవ ప్రయోగంలో ఉన్నారు. సమయం పడుతుంది మీరు కూర్చోండి. పూజ తరువాత గురువు గారిని కలవవచ్చు అని చెప్పాడు. చంచల్ సరే అని హోమకుండానికి దగ్గరలో కూర్చున్నాడు. గురువుగారితో పాటుగా హోమకుండం దగ్గర నలుగురున్నారు. అందులో ఒకతను ఏదో అసహజంగా ఉన్నాడు. ఆకాశంవైపు (శూన్యంలోకి) చూస్తూ, మానసికంగా స్థిమితంగా లేకుండున్నాడు. అతని వేషధారణ కూడా సరిగా లేదు. తలదువ్వుకోలేదు. తల అటూ ఇటూత్రిప్పుతున్నాడు. చంచల్ అతనికి మనోవైకల్యముందికాబోలు అనుకున్నాడు. అక్కడ ఏం జరుగుతుందో మాత్రం అతనికి అర్థం కాలేదు. దీని గూర్చి గురువుగారిని తరువాత అడగాలనుకున్నాడు. ఈ విషయం నోట్ బుక్ లో వ్రాసుకున్నాడు.
 సమయం ఉదయం11.00 కావస్తోంది. ఇంతలో గురువుగారి మాటలు గుర్తుకొచ్చాయి. గురువుగారు అపరాహ్నం దాటిన తరువాత ఏ దీక్షా ఇవ్వబడదని నికచ్చిగ చెప్పివున్నారు. అంతకుముందుగానే హోమం ముగియవచ్చు అని ఆశించాడు. కానీ ఉదయం 11.45 కావస్తోంది. చంచల్ కి తన దీక్షగురించి దిగులు పట్టుకుంది. కాసేపటికి పూర్ణాహుతి మొదలైంది. అందరూ లేచి నిలచున్నారు. గురువుగారు మరియు పూర్ణ, పూర్ణాహుతి మంత్రాలు బిగ్గరగా చదువుతున్నారు. ఇంత క్రితం పిచ్చిగా ప్రవర్తించినతను తప్ప మిగతా అందరూ నిశ్శబ్దంగా వున్నారు. అతను మాత్రం అకారణంగా పిచ్చిగా బిగ్గరగా నవ్వుతున్నాడు. గురువుగారు హోమ కార్యక్రమంపై దృష్టి నిలిపి, ఆ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్న అతని నుదుటిపై చేయివుంచి, హోమ విభూతిని పెట్టారు. హోమ విభూతి నుదుటిని తాకగానే అతను తన పక్కనే వున్న మరొక అతని ఒడిలో పడిపోయాడు. కొద్ది క్షణాల తర్వాత గురువుగారు ఏదో మంత్రం చదువుతూ అతనిపై తీర్ధమును చల్లారు. వెంటనే అతను కళ్లు తెరిచి వింతగా తన చూట్టూ వున్న వారిని చూస్తూ, తన పక్కనే ఉన్న అతడి తండ్రిని అడిగాడు.
పిచ్చిగా ప్రవర్తించిన వ్యక్తి(గోపాల్) అడిగాడు – నాన్న గారు ఎమైంది? ఇక్కడేం జరుగుతోంది? మనం ఇక్కడెందుకున్నాం?
పిచ్చిగా ప్రవర్తించిన వ్యక్తి తండ్రి – గోపాల్, నన్ను గుర్తుపట్టావా? ఓహ్....ఆశ్చర్యం. చాలా రోజుల తరువాత నువ్వు నన్ను గుర్తుపడుతున్నావు. గురువుగారు మనల్ని
రక్షించారు అని గురువుగారి పాదాలపై పడిపోయాడు. గురువుగారు అతన్ని లేవదీసి “అంతా శుభమే జరుగుతుంది దిగులు పడకండి, ఇంకో సారి ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి” అన్నారు.
వాళ్ళు గురువుగారి ఆశీర్వాదం తీసుకుని, సంతోషంతో వెళ్ళిపోయారు.

చంచల్ కు అక్కడ ఏమి జరిగిందో అర్థంకాలేదు. అతను అక్కడ జరిగిన సంఘటనను నమ్మలేకపోయాడు. అతను ఈ విషయాలను నమ్మడానికి అతనికున్న లౌకిక వివేకం ఒప్పుకోనీయలేదు. అసలతను ఇది కళ్ళారా చూడకుండావుంటే నమ్మేవాడే కాదు. అయినా ఇంకా అతనికి సందేహమే. ఇవ్వన్నీ గురువుగారినడగాలనుకుని అక్కడనుండి గురువుగారివైపు కదిలాడు.

ఇంతలో ఓ పెద్దావిడ వారిని భోజనం చేయటానికి రావాలని ఆహ్వానించింది. ఆవిడ గురువు గారి ధర్మపత్ని. ఆమె పెద్దకుంకుమ బొట్టు నుదుటిపై పెట్టుకుని బంగారు ఛాయలో వుంది. ఆవిడ పేరు గౌరి. ఆమెతో గురువుగారు ఇలా అన్నారు.....
గురుజీ: చంచల్ ని గౌరికి పరిచయం చేసి, నీవు భోజనం కానివ్వు. ఈ రోజు ఇతడికి దీక్ష ఇవ్వాలి.
గురుమా (గుర్వంబా) ఓ సారి చంచల్ వైపు చూసి లోనికి వెళ్ళింది.
గురువు గారు చంచల్ వైపుచూసి అన్నారు, “ఇప్పటికే (అపరాహ్నం)12.00 గంటలు దాటింది. ఇప్పుడు దీక్ష ఇవ్వడం కుదరదు. మళ్ళీ సాయం సంధ్య వరకు ఆగాలి. అప్పటివరకు వేచివుంటావా? లేక మళ్ళీ వస్తావా?
చంచల్: వేచివుంటాను గురువుగారు
గురువు గారు చిరునవ్వు నవ్వి ఇంటిలోనికి వెళ్ళారు. చంచల్ కు ఇంకా ఏం చేయాలో తోచలేదు. కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చాలా అరుదుగా అతడు ఉపవాసం ఉంటాడు. ఈరోజు అనుకోకుండా ఉపవాసం చేస్తున్నాడు. ఆకర్షకు ఫోన్ చేసి జరిగిన విషయం వివరించాడు. ఆమె సరేఅంది.
కొంత సేపటి తర్వాత, పూర్ణ చిరునవ్వు నవ్వుతూ చంచల్ వద్దకు వచ్చాడు.
చంచల్ ముక్తసరిగ పలకిరించాడు. పూర్ణ చంచల్ ప్రక్కన కూర్చున్నాడు. వాళ్ళు ఒకరినొకరు పకరిచయంచేసుకున్నారు.
పూర్ణ: ఆకలిగా వుందా?
చంచల్: లేదు...లేదు...(గొనిగాడు)
పూర్ణ చిన్నగా నవ్వి అన్నాడు “నేనర్థం చేసుకోగలను నీ పరిస్థితిని ”. మీకో విషయం తెలుసా, ఈ రోజు ఆశ్రమంలో ఎవ్వరూ భోజనం చేయరు. గురుమా అన్నిట్లో గురుగారిని అనుసరిస్తుంది. గురువుగారు భోజనం చేయరు కాబట్టి ఆమె భోంచేయరు. గురువుగారు, గురుమా భోజనం చేయరు కాబట్టి మేం కూడా భోజనం చేయము. ఇదంతా మామూలే ఇక్కడ. కాబట్టి మాకేం ఇబ్బందిలేదు. ఇక్కడున్నంత సేపు మేము మా బాధలన్నీ మరిచిపోతాం.

చంచల్ ఇలా అనుకున్నాడు, “ ఇదంతా నా బుద్ధితక్కువతనం వల్ల, నా మనస్సును నియంత్రించుకోలేక పోవడం వలన జరిగింది. గురువుగారు దీక్షకు సంబంధించిన నియమాలు, సమయం స్పష్టంగా చెప్పారు. వారి మాట సరిగా పాటించివుంటే బాగుండు. నిన్న ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. ఇకనుండైనా సమయాన్ని కచ్చితంగా పాటించాలి. ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. నా మూర్ఖత్వం వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండా చూసుకోవాలి”.

చంచల్ ఆలోచనలకు భంగం కలిగిస్తూ పూర్ణ ఇలా అన్నాడు“అంత దీర్ఘంగా ఏమాలోచిస్తున్నారు? ఏం ఇబ్బందిలేదు. ఇక్కడ ఇలాంటివి మాకు మాములే. మీకు ఈ రోజు గురువు గారి హోమం విషయం తెలియదు కదా. తెలిసుంటే సరియైన సమయానికొచ్చుండేవారు కదా. ఇంకా ఎక్కువ ఆలోచించకండి ఇక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆనందించండి ”.

పూర్ణ మాటలకు చంచల్ కి కొంత ఉపశమనం కలిగింది. ఎంత మంచి మనస్సు అనుకొని, ఇలా అడిగాడు...

చంచల్: ఈరోజు జరిగిన హోమం ఏమిటి? అతనెవరు? ఎందుకొరకు ఈ హోమం చేశారు?

పూర్ణ: అది ఉన్మత్తభైరవ హోమ ప్రయోగం. అతని పేరు గోపాల్. అతనికి ఇంటర్నేట్ ద్వారా ఎవరో కుండలిని ప్రయోగ సంబంధ దీక్షనిచ్చారట. అసలు వీరు ఒకరికొకరు తెలియనే తెలియదు. గోపాల్ ఫోల్ లో సంప్రదిస్తే దీక్ష ఇచ్చాడట. అందుకుగాను ఇతను రెండు లక్షలు ఆన్ లైన్లో పంపాడంట. అతను ఇంటర్నేట్లో పంపే సూచనల ప్రకారం సాధన చేసాడు. కొన్నిరోజుల తర్వాత గోపాల్ పరిస్థితి నీవు పొద్దున చూసిన మాదిరిగా తయారైంది.
అతను పిచ్చివాడిగ అయ్యాడు. సరియైన మార్గదర్శనం చేయకపోవడం వల్లా, అతను అనుసరించిన అశాస్త్రీయ సాధనా పద్ధతుల వల్ల ఇలా అయింది. ఇంకా ఆ ఇంటర్నేట్ గురువన్నాడట గోపాల్ కు సిద్ధి కలిగిందని బొంకి ఇంకా అయిదు లక్షలివ్వలని డిమాండ్ చేసాడంట. గోపాల్ వాళ్ళ నాన్న గారికి అనుమానం వచ్చి నన్ను కలిసాడు. వాళ్ళు, మేము ఒకే వీధిలో ఉంటాం. మేం వచ్చి గురువుగారిని కలిసాం. తర్వాత జరిగిందంతా నువ్వు చూసావు కదా. అందుకే మన శాస్త్రాలు సరియైన గురువు దగ్గరే విద్యను నేర్చుకోమని చెబుతున్నాయి. గురువును దైవంగా కొలుస్తాయి, గురువే దైవమని భోదిస్తాయి. ప్రస్తుతం పరిస్థితులన్నీ తారుమారై ఇలా ఏడవాల్సి వస్తోంది. ప్రస్తుత సాంకేతికత మనుషులను ఉన్నతి వైపుకు నడిపించేందుకు కొంతవరకే ఉపయుక్తం అవుతోంది. అది – వ్యక్తిగత ఉన్నతే గాని (పర్సనల్ డెవలప్ మెంటే) వ్యక్తిత్వ వికాసం (పర్సనాలిటీడెవలప్ మెంట్) కాదు.
తరువాత పూర్ణ చంచల్ ను తీసుకెళ్ళి ఆశ్రమమంతా చూపించాడు. అక్కడ యాగశాల, పాకశాల, గోశాల అన్నీ ఉన్నాయి. ఒక చోట గురువుగారు ధ్యానంలో ఉన్నారు, పూర్ణ చెప్పాడు గురువు గారు సమాధి స్థితిలో ఉన్నారని...
పూర్ణ: ఇది ధ్యాన మందిరం, ఇక్కడే శ్రీమాత శ్రీచక్రరూపిణిగా కొలువై వుంది.
ఈ విషయాన్ని చెపుతున్నప్పుడు పూర్ణ మాటల్లో గురువు గారిపట్ల, ఆశ్రమంపై అతనికి ఉన్న భక్తిభావాన్ని చంచల్ గ్రహించాడు
ఆశ్రమమంతా చూసే సరికి సాయంత్రం 5.00 కావస్తోంది. గురువుగారు ధ్యాన మందిరంలోనుండి బయట వచ్చి చంచల్ ని స్నానం చేయమన్నారు. పూర్ణ టవల్, దీక్ష ధోవతినిచ్చాడు. ఇవికూడా తన వెంటతెచ్చుకోనందుకు చంచల్ సిగ్గుపడ్డాడు.

సాయంసంధ్యా కాలమైంది. చంచల్ జీవితం గొప్ప మలుపుతిరిగే శుభగడియలు వచ్చాయి. చంచల్ మరియు గురువుల వారు శక్తి పీఠం ముందున్నారు. గురువుగారు చంచల్ కు దీక్ష ఇవ్వడం ప్రారంభించారు. గురువుగారు తన కుడి హస్తం చంచల్ తలపై సహస్రారంలో ఉంచారు. చంచల్కు కొన్ని క్షణాల పాటు ఒక విధమైన సున్నితమైన షాక్ లాంటి వణుకు అతని వెన్నులో కలిగింది. శక్తిపాతం మొదలైంది. కొద్దిదూరంలో గురుమా సాయంకాల పూజ పూర్తి చేసి గంట మ్రోగించారు. ఇది చంచల్ శ్రీవిద్యా ప్రవేశ సమ్మతానికి చిహ్నంగా అమ్మవారు సూచించిందా?. సత్సంప్రదాయ విధి విధానంగా చంచల్ శ్రీవిద్యా దీక్షలో  ప్రవేశించాడు.

చంచల్ ఆధ్యాత్మిక ప్రహసనం మొదలైంది, ఏలా సాగిందో ముందు, ముందు చూద్దాం........ఇంకావుంది.........

No comments:

Post a Comment