SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, November 22, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-24

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

24



గురువుగారుః శ్రీవిద్యలో మొట్టమొదట ఉన్నది కౌళమే. ఈ ఆచారానికి చతుషష్టి తంత్రగ్రంధాలు ఆధారం. వీటిలో కొన్ని తంత్రాలు శివుడు పార్వతికి చెప్పగా, కొన్ని పార్వతి శివునికి చెప్పినట్టుగా తెలుస్తున్నాది. ఈ ఆచార సాధనాపరులను లింగ భేదమును బట్టి భైరవి, భైరవునిగా చెప్పబడుతారు. అయితే కొందరు సాధకులు ఈ ఆచారాన్ని సరిగ్గా అర్ధంచేసుకోలేక ఆ పూజా పద్ధతులకు ఆకర్షితులై భ్రష్టుపట్టిపోయారు. తల్లిదండ్రుల ప్రేమ అపారం కనుక పరమశివుడు తన బిడ్డలను కరుణించదలచి దక్షిణారూపమునుదాల్చి శుభాగమపంచకములను ఐదు శాస్త్రాలను ప్రకటించాడు. ఈ శాస్త్రాలందు చెప్పబడిన పూజావిధానాలు కౌళమునకు దూరంగా ఉంటాయి. ఇవి వేదప్రమాణికంగా చెప్పబడ్డాయి. వీటిని ప్రామాణికంగా తీసుకొని సాధనచేసే సాధకులను దక్షిణాచారులని అంటారు. అప్పటినుండి శ్రీవిద్యను కౌళ మరియు దక్షిణ అను రెండు ఆచారములుగా పాటిస్తున్నారు. ఈ రెండు ఆచారముల మధ్య ముఖ్యమైన వ్యత్యాసం సాధకులు ఉపయోగించే పూజావస్తువులు మరియు కొన్ని పద్ధతులలోనే. చాలా మటుకు మంత్రములు ఒక్కటే.

చంచల్ః మరి వామాచారం, సమయాచారం ఏమిటి గురువుగారు?
గురువుగారుః వామాచారం కౌళాచారంలో ఒక భాగం. శ్రీలలితారహస్య నామాలలో కూడా కౌళ, దక్షిణ మరియు సమయములగురించి ప్రస్తావన ఉంది కాని వామం గురించి లేదు. కౌళంలోని కొన్ని పద్ధతులు మరింత తీవ్రంగా ఆచరించడం వలన వామమార్గమని అన్నారు. ఉదాహరణకు శ్మశాన సాధనలు. వామం లేదా కౌళంలో పంచమకారాలను ఉపయోగిస్తారు. మద్య, మత్స్య, మాంస, ముద్ర మరియు మైథున ఈ ఐదింటిని పంచమకారాలని అంటారు. ఈ కారణం వలన కౌళాచారమును వేద బాహ్యమని అంటారు. కౌళాచారం రెండు రకాలు. అవి ఉత్తర కౌళము మరియు పూర్వ కౌళము. ఉత్తరకౌళులు ప్రత్యక్షయోనిని పూజిస్తారు. పూర్వకౌళులు శ్రీచక్రముయొక్క ఛాయా (ప్రతిమ) రూపమును అనగా భూప్రస్తారము, సుమేరు ఇలా ఒక ప్రతిమను తమ ఎదురుగా పెట్టుకొని పూజిస్తారు. నిజానికి ఇలా ప్రతిమను పూజించే ఏ సంప్రదాయులైనా పంచమకారాలను ఉపయోగించినా లేకపోయినా వారు పూర్వ కౌళులుగానే పరిగణించపడతారు. ఈ సత్యాన్ని చాలా మంది సమయ/దక్షిణాపరులని చెప్పుకొనే సాధకులు ఒప్పుకోలేరు. ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏ సంప్రదాయంలో సాధన చేసిన చివరకు సమయానికి చేరుకోవాలి. సమయాచారం అన్ని ఆచారాలకన్న ఉన్నతమైనది. అలా చేరుకోగలిగిన సాధకుని సాధన ఫలించిందని చెప్పవచ్చు.
చంచల్ః అటువంటప్పుడు విగ్రహారాధన వలన ఉపయోగం లేదంటారా?
గురువుగారుః అలా ఎంతమాత్రం కాదు. నిజానికి హిందూధర్మంలో విగ్రహారాధన ఎక్కడుంది? అజ్ఞానులు మాత్రమే విగ్రహారాధన అని అనుకుంటారు. మన దేవాలయాలలో మనం చూసే విగ్రహాలు అసలు విగ్రహాలే కావు. అవి అంతకన్నా ఎక్కువ. అవి ప్రాణం ఉన్నవి. ప్రాణమున్నది ఏదీ జడముకాదు. కొన్ని దేవతావిగ్రహాలు స్వయంభువులయితే కొన్నింటికి సత్సంప్రదాయంగా ప్రాణప్రతిష్ఠ చేసినవి. ప్రాణమున్నవాటిని ఉత్త విగ్రహములని ఎలా అనగలము? మనం ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అనుకూల తరంగాలను మనం గమనించవచ్చు. ఈ తరంగాల వలనే మన మనస్సుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. దివ్యశక్తికి ఇదే తిరుగులేని సాక్ష్యం. దివ్యశక్తికి రూపమంటూ ఏదీ లేదు కనుక మనం మనకు నచ్చిన రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రూపంలో దివ్యశక్తిని ఆహ్వానించి పూజ చేస్తున్నాం. మనం పూజ చేసేది ఆ దివ్యశక్తికి మాత్రమే గాని విగ్రహానికి కాదన్నది ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం. హిందూ మతానికి ఇతర మతాలకి ఇదే వ్యత్యాసం. 
చంచల్ః మీరు చెప్పినది చాలా తార్కికంగా ఉంది గురువుగారు. నేను హిందువునైనందుకు చాలా గర్వపడుతున్నాను.
ఈ మధ్యలో పూర్ణ కలుగజేసుకొని…..
పూర్ణః గురువుగారి మాటలను సూక్ష్మంగా అర్ధంచేసుకుంటే సకలజీవులు ఒక్కటే అన్న విషయం తెలుస్తుంది. బాహ్యదేవత, అంతర్ దేవత ఒక్కటే అన్న సంగతి అవగతమవుతుంది. అహంబ్రహ్మాస్మి అన్న స్థితిని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది.
చంచల్ః కొంచెం అలాగ అనిపిస్తూంది. కాని మరింత లోతుగా అర్ధం చేసుకోవడానికి నాకిప్పుడు అంత జ్ఞానం లేదు. నేను అటువంటి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి తప్పక తీవ్ర సాధన చేస్తాను అని చెప్పి గురువుగారిని ఈ విధంగా అడిగాడు.
గురువుగారు! ఈ ఆచారాల మధ్య ఇంకా ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? సమయాచారమంటే ఏమిటి? ఒక సాధకుడు సమయ స్థితికి ఏవిధంగా చేరగలడు?

 

Friday, November 17, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-23


శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

23


మస్కారం గురువుగారు, చాలా రోజులుగా మిమ్మల్ని కలవలేకపోయినందుకు క్షమించండి అని గురువుగారికి పాదాభివందనం చేసాడు చంచల్.
గురువుగారుః ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటూ సాధన చేసుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని ధర్మపధంలో ఆచరించడం కూడా సాధనలో భాగమే. నీ సాధన బాగా సాగుతున్నాదని అనుకుంటున్నాను.
చంచల్ః సాధన బాగా సాగుతున్నాది గురువుగారు. ఈ మధ్య నాకు సంఘంలో పెద్దగా మసలాడానికి మనసు రావడంలేదు. రాత్రిపార్టీలు, సినిమాలు మొదలైనవి చాలా టైం వేస్టుగా అనిపిస్తున్నాయి. 
గురువుగారు చిన్నగా నవ్వి బాలాహృదయమంత్రం పనిచేయడం ప్రారంభమైనదన్నమాట అని అన్నరు.
చంచల్ ఏ భావాన్ని ప్రకటించలేదు. తర్వాత గురువుగారు అతనిని అడిగారు…
గురువుగారుః పంచదశీ మంత్రోపాసన ఎలా జరుగుతున్నాది?
చంచల్ః పరవాలేదు గురువుగారు. ఈ విషయమై నాక్కొన్ని సందేహాలున్నాయి.
గురువుగారుః అవేమిటో చెప్పునాయనా. తీర్చడానికి ప్రయత్నిస్తాను.
చంచల్ః పంచదశీ మంత్రానికి సంబంధించి ఎన్ని ఋషి సంప్రదాయాలున్నాయి? వాటి మధ్యగల తేడాలేమిటి?
గురువుగారుః ప్రముఖంగా మూడు ఋషి సంప్రదాయాలను మనం గమనించవచ్చు. అవి, దక్షిణామూర్తి, ఆనందభైరవ మరియు మన్మధ సంప్రదాయాలు. దక్షిణాచారాపరులు దక్షిణామూర్తిని, కౌళాచారులు ఆనందభైరవుని ఋషిగా పరిగణిస్తారు. మన్మధుడు గురువుగాకల సంప్రదాయము గురించి నాకు పెద్దగా తెలియదు. కొన్ని, దక్షిణాచార సంప్రదాయాలలో దక్షిణామూర్తికి బదులుగా ఆనందభైరవుని ఋషిగా పరిగణించడం మనం గమనించవచ్చు.
పైమూడు సంప్రదాయాలేకాక, మరియొక ముఖ్యమైన సంప్రదాయమున్నది. అదే సమయాచారము. ఈ ఆచారమందు ప్రత్యేకంగా ఏ ఋషి ఉండరు. శ్రీవిద్యలో ఈ సంప్రదాయము చాలా ఉన్నతమైనది. అటువంటి స్థితికి చేరుకున్నవారు చాలా ధన్యులు. ఈ సంప్రదాయం గురించి ముందు ముందు నీకు మరింతగా తెలుస్తుంది.
దక్షిణ, కౌళ సంప్రదాయాలలో పూజా విధానం దాదాపుగా ఒకేలా ఉంటుంది. పూజలో ఉపయోగించే వస్తువులు, కొన్నిరకాల పద్ధతులే కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. ఈ రెండు ఆచారాలలోను శ్రీచక్రమునుగాని, సుమేరునుగాని పూజిస్తారు. కౌళాచారంలో ప్రత్యక్షశ్రీచక్రమును పూజచేసే సంప్రదాయం కూడా కలదు. వారిని ఉత్తర కౌళులు అని అంటారు. దక్షిణాచారపరులు వివిధ లోహాలతో చేసిన శ్రీచక్రమును లేదా సుమేరును అర్చిస్తారు.
చంచల్ః ప్రత్యక్షశ్రీచక్రము అంటే ఏమిటి గురువుగారు.
గురువుగారుః అది ఒక రహస్యము అని అదేమిటో అతనికి చిన్నగొంతుతో వివరించారు.
ఆ రహస్యాన్ని వినడంతో చంచల్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. అలాంటి పూజాపద్ధతులు కూడా ఉంటాయని అతడు ఎప్పుడూ ఊహించను కూడా లేదు.
చంచల్ః గురువుగారూ, నిజంగానే అటువంటి జుగుప్సాకరమైన పూజా పద్ధతులు కూడా ఉంటాయా?
గురువుగారుః అలా ఆలోచించడం తప్పు నాయన. అన్ని సంప్రదాయాలని మనం గౌరవించాలి. జుగుప్సాకరమైనదంటూ ఏదీ లేదు. నిజానికి అన్ని సంప్రదాయాలు ఒక్కటే. నీ నిజమైన సాధనా మార్గంలో ఈ విషయాన్ని నువ్వు తప్పక తెలుసుకుంటావు.
చంచల్ః స్త్రీలు నిజంగా అటువంటి పూజలు చేస్తారా? ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉందా?
గురువుగారుః ఇప్పటికీ ఈ సంప్రదాయం చాలా ప్రముఖంగా పాటించబడుతోంది. బీహార్, బెంగాల్, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా పాటిస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ఈ సంప్రదాయం కనిపిస్తోంది.
చంచల్ః అసలు ఈ విద్య దక్షిణాచారం మరియు కౌళాచారం అని ఎందుకు విభజించబడింది? వీటి మధ్య మూలవ్యత్యాసం ఏమిటి? ఇవేకాక నేను వామాచారం అని కూడా విన్నాను. అదేమిటి?
గురువుగారు అతనికి విశదీకరించసాగారు….

 


Wednesday, November 8, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-22

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

22



అక్కడ ఆకర్ష, మోహ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అంతలోనే కొంచెం భయం కూడా వేసింది. ఎవరో కదిలిన మాట వాస్తవం. ఆకర్ష కాదు, మోహ కాదు. మరెవరు అయ్యుంటారు? కొంపదీసి ఏదైనా ఆత్మా లేక దెయ్యమా? ఈ ఆలోచన రాగానే అతని భయం రెట్టింపు అయ్యింది. అతడి జపం ఇంకా పూర్తి అవ్వలేదు. మిగిలిన జపం పూర్తి చేయడానికై అతడు భయపడుతూనే పూజగదికి వెళ్ళాడు. ఈసారి కళ్ళు తెరచే జపం గబగబా పూర్తి చేసి పడక గది వైపు వడివడిగా వెళ్ళిపోయాడు. ఈ సంఘటను ఆకర్షతో చెబుతామనుకొని విరమించుకున్నాడు. గురువుగారిని మళ్ళీ దర్శనం చేసుకుందామని అనుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన సెలవు రోజున గురువుగారిని కలిసి తనకు కలిగిన అనుభవాన్ని వివరించాడు. గురువుగారు అంతా విని అతనికి ఈ విధంగా తెలుపసాగారు….
గురువుగారుః సాధన ప్రారంభదశలో ఇటువంటి అనుభవాలు చాలా సహజం. ఆసమయంలో నువ్వు కళ్ళను తెరువకుండా ఉండాల్సింది. చాలామంది సాధకులు భయంవల్లగాని ఏదో తెలియని ఆత్రుత వలన గాని తమ కళ్ళను తెరిస్తారు. ఆ వచ్చింది ఆత్మో, దెయ్యమో అని ఎందుకనిపించింది? దేవుడని ఎందుకనిపించలేదు? దైవమును గురించి చింత తక్కువ ఉన్నవారికై ఇది ఒక చక్కటి ఉదాహరణ. అందరికీ దేవుడును చూడాలని ఉంటుంది. కాని అతను తన దగ్గరకు వస్తే గుర్తించలేరు. ఒక్కటి గుర్తుపెట్టుకో. యద్భావం తద్భవతి. నువ్వు ఏవిధంగా ఊహిస్తావో ఆ విధంగానే పరమాత్మ దర్శనం కలుగుతుంది.  భావమన్నది సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అందువలనే సంస్కారాలని సంస్కరించుకోవాలి. అది బహిర్యాగంతోనే సాధ్యం అవుతుంది. సరే జరిగిందేదో జరిగిపోయింది. మరిక దాని గురించి చింత వద్దు. నీకు మళ్ళీ అటువంటి అనుభవం కాదు. ఒక్కటి మాత్రం నిజం. నీకు అమ్మవారి ఆశీస్సులైతే ఉన్నాయి.
నీకు పంచదశీ మహా మంత్రమును ఉపదేశించే సమయం వచ్చింది. ఇక్కడ నుండి నీకు శ్రీవిద్య గురించి మరింత అవగాహన కలుగుతుంది. పంచదశి ఉపదేశం తర్వాత నువ్వు శ్రీచక్ర నవారణ పూజా విధానం కూడా నేర్చుకోవాలి. శ్రీచక్రనవావరణ పూజ శ్రీవిద్యకు ఆత్మ వంటిది. శ్రీచక్రమే అమ్మవారి నివాసస్థానం. చరాచర విశ్వ రహస్యాలన్నీ శ్రీచక్రములో నిగూఢమయ్యి ఉన్నాయి. ఇక్కడ నుండి నీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఈరోజుల్లో శ్రీవిద్యను సశాస్త్రీయ పద్దతుల్లో నేర్చుకోవడం చాలా కష్టం. ఇప్పుడంతా కొత్త శాస్త్రాలు కొత్త పద్దతులు. సనాతన పద్దతులు చాలా మటుకు మరుగున పడిపోయాయి. కానీ మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే మన గురుపరంపర చాలా సనాతనమైనది. మనకు వచ్చిన ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇప్పటి నుండి నువ్వు సాధనకొరకై మరింత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ విద్య అనంతమైనది. నాకున్న జ్ఞానము ఇసుకరేణువలో వెయ్యోవంతు మాత్రమే. నేను నీకు దారిమాత్రమే చూపుతాను. ఆ దారిలో ప్రయాణించవలసిన బాధ్యత నీదే. ఈ సాధనా క్రమంలో నువ్వు యుద్దం చేయవలసి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక యుద్ధం. నిన్ను ప్రలోభపెట్టే వాంఛలు ఒకవైపు ఆధ్యాత్మతరంగాలు ఒకవైపు. అదే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు గెలిస్తే ఈ సంఘం నిన్ను ఒక దేవునిలా కొలుస్తుంది. లేకపోతే అదే సంఘం నిన్ను దోషిలా చూస్తుంది. కనుక, ఆధ్యాత్మిక సాధనలో సంఘజీవితానికి కొంచెం దూరంగా ఉండటం మేలు. ఈ యుద్ధంలో ఓడినా నువ్వు నిరాశ చెందనవసరం లేదు. ఎందుకంటే అమ్మ తన అపారమైన ప్రేమను మనమీద ప్రసరింపచేసి మరు జన్మలోనైనా మనకు మరొక్క అవకాశం ఇస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మ తన పిల్లలను ఎప్పుడూ వదలిపెట్టదు. శక్తి ఉపాసన చాలా అపాయకరమైనదని చాలా మంది అంటుంటారు. ఉపాసన సరిగ్గా చేయకపోతే ఏమైన కీడు జరుగుతుందనిఅది జరుగుతుందనిఇది జరుగుతుందని ఏవేవో లేనిపోని భయాలు ప్రచారం చేస్తుంటారు. ఇవ్వన్ని అవగాహనలేని వారి మాటలు. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారన్నట్టు ప్రపంచంలో చెడ్డకొడుకు ఉండవచ్చు కాని చెడ్డతల్లి ఉండదు. సాధనచేయనివారికన్న చేసేవారు మిన్న కదా. సాధనలో దొర్లే తప్పులగురించి చింతించకుండా గురువు సలహాలు పాటిస్తూ సాధనను చేయాలి. ఏచిన్న అనుమాన్నైన మనసులో ఉంచుకోకుండా గురువును అడిగి తెలుసుకోవాలి. గురువుచెప్పే మాటల మీద నమ్మకం, శ్రద్ధ ఉంచుకోవాలి. శ్రీవిద్యాసాధనలో ఇది ఎంతో ముఖ్యం. మన అంతిమ లక్ష్యం స్వరూపనిరూపణము. ఈ లక్ష్యసాధనలో ఎటువంటి మాయలకు, విచిత్రాలకు (గాల్లో నుండి నగలు సృష్టించడం మొదలగునవి) స్థానంలేదు. అటువంటి మాయలు విచిత్రాలు అశాశ్వతాలు. పరబ్రహ్మమొక్కటే శాశ్వతమైనది. ఆ పరబ్రహ్మమే సత్యం, జ్ఞానం మరియు అనంతం. ఆ శాశ్వతమైన పరబ్రహ్మపదమును చేరుకోవడానికే మనం సాధనచేయాలి. కనుక ఎటువంటి భయాలు పెట్టుకోకుండా సాధనను కొనసాగించు. నీ బాధ, కోపం, సంతోషం అన్నీ ఆమెకే విడిచిపెట్టు. ఆమె ఎప్పుడూ నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది.   
తర్వాత గురువుగారు చంచల్ కు పంచదశీ మహామంత్ర దీక్షాముహూర్తాన్ని నిర్ణయించారు.