శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు
అక్కడ ఆకర్ష, మోహ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. అతనికి
చాలా ఆశ్చర్యం వేసింది. అంతలోనే కొంచెం భయం కూడా వేసింది.
ఎవరో కదిలిన మాట వాస్తవం. ఆకర్ష కాదు, మోహ కాదు. మరెవరు అయ్యుంటారు? కొంపదీసి
ఏదైనా ఆత్మా లేక దెయ్యమా? ఈ ఆలోచన రాగానే అతని భయం రెట్టింపు
అయ్యింది. అతడి జపం ఇంకా పూర్తి అవ్వలేదు. మిగిలిన జపం పూర్తి చేయడానికై అతడు భయపడుతూనే పూజగదికి వెళ్ళాడు. ఈసారి కళ్ళు తెరచే జపం గబగబా పూర్తి చేసి పడక గది వైపు వడివడిగా వెళ్ళిపోయాడు.
ఈ సంఘటను ఆకర్షతో చెబుతామనుకొని విరమించుకున్నాడు. గురువుగారిని మళ్ళీ దర్శనం చేసుకుందామని అనుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన
సెలవు రోజున గురువుగారిని కలిసి తనకు కలిగిన అనుభవాన్ని వివరించాడు. గురువుగారు అంతా విని అతనికి ఈ విధంగా తెలుపసాగారు….
గురువుగారుః సాధన
ప్రారంభదశలో ఇటువంటి అనుభవాలు చాలా సహజం. ఆసమయంలో
నువ్వు కళ్ళను తెరువకుండా ఉండాల్సింది. చాలామంది సాధకులు భయంవల్లగాని
ఏదో తెలియని ఆత్రుత వలన గాని తమ కళ్ళను తెరిస్తారు. ఆ వచ్చింది
ఆత్మో, దెయ్యమో అని ఎందుకనిపించింది? దేవుడని
ఎందుకనిపించలేదు? దైవమును గురించి చింత తక్కువ ఉన్నవారికై ఇది
ఒక చక్కటి ఉదాహరణ. అందరికీ దేవుడును చూడాలని ఉంటుంది.
కాని అతను తన దగ్గరకు వస్తే గుర్తించలేరు. ఒక్కటి
గుర్తుపెట్టుకో. యద్భావం తద్భవతి. నువ్వు
ఏవిధంగా ఊహిస్తావో ఆ విధంగానే పరమాత్మ దర్శనం కలుగుతుంది. భావమన్నది సంస్కారాన్ని బట్టి ఉంటుంది.
అందువలనే సంస్కారాలని సంస్కరించుకోవాలి. అది బహిర్యాగంతోనే
సాధ్యం అవుతుంది. సరే జరిగిందేదో జరిగిపోయింది. మరిక దాని గురించి చింత వద్దు. నీకు మళ్ళీ అటువంటి అనుభవం
కాదు. ఒక్కటి మాత్రం నిజం. నీకు అమ్మవారి
ఆశీస్సులైతే ఉన్నాయి.
నీకు పంచదశీ మహా
మంత్రమును ఉపదేశించే సమయం వచ్చింది. ఇక్కడ
నుండి నీకు శ్రీవిద్య గురించి మరింత అవగాహన కలుగుతుంది. పంచదశి
ఉపదేశం తర్వాత నువ్వు శ్రీచక్ర నవారణ పూజా విధానం కూడా నేర్చుకోవాలి. శ్రీచక్రనవావరణ పూజ శ్రీవిద్యకు ఆత్మ వంటిది. శ్రీచక్రమే
అమ్మవారి నివాసస్థానం. చరాచర విశ్వ రహస్యాలన్నీ శ్రీచక్రములో
నిగూఢమయ్యి ఉన్నాయి. ఇక్కడ నుండి నీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది.
ఈరోజుల్లో శ్రీవిద్యను సశాస్త్రీయ పద్దతుల్లో నేర్చుకోవడం చాలా కష్టం.
ఇప్పుడంతా కొత్త శాస్త్రాలు కొత్త పద్దతులు. సనాతన
పద్దతులు చాలా మటుకు మరుగున పడిపోయాయి. కానీ మనం ఎంతో అదృష్టవంతులం.
ఎందుకంటే మన గురుపరంపర చాలా సనాతనమైనది. మనకు వచ్చిన
ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇప్పటి నుండి నువ్వు
సాధనకొరకై మరింత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ విద్య అనంతమైనది.
నాకున్న జ్ఞానము ఇసుకరేణువలో వెయ్యోవంతు మాత్రమే. నేను నీకు దారిమాత్రమే చూపుతాను. ఆ దారిలో ప్రయాణించవలసిన
బాధ్యత నీదే. ఈ సాధనా క్రమంలో నువ్వు యుద్దం చేయవలసి ఉంటుంది.
అదే ఆధ్యాత్మిక యుద్ధం. నిన్ను ప్రలోభపెట్టే వాంఛలు
ఒకవైపు ఆధ్యాత్మతరంగాలు ఒకవైపు. అదే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు గెలిస్తే ఈ సంఘం నిన్ను ఒక దేవునిలా కొలుస్తుంది.
లేకపోతే అదే సంఘం నిన్ను దోషిలా చూస్తుంది. కనుక,
ఆధ్యాత్మిక సాధనలో సంఘజీవితానికి కొంచెం దూరంగా ఉండటం మేలు. ఈ యుద్ధంలో ఓడినా నువ్వు నిరాశ చెందనవసరం లేదు. ఎందుకంటే
అమ్మ తన అపారమైన ప్రేమను మనమీద ప్రసరింపచేసి మరు జన్మలోనైనా మనకు మరొక్క అవకాశం ఇస్తుంది.
ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మ తన పిల్లలను
ఎప్పుడూ వదలిపెట్టదు. శక్తి ఉపాసన చాలా అపాయకరమైనదని చాలా మంది
అంటుంటారు. ఉపాసన సరిగ్గా చేయకపోతే ఏమైన కీడు జరుగుతుందని…అది జరుగుతుందని…ఇది జరుగుతుందని ఏవేవో లేనిపోని భయాలు
ప్రచారం చేస్తుంటారు. ఇవ్వన్ని అవగాహనలేని వారి మాటలు.
జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారన్నట్టు ప్రపంచంలో చెడ్డకొడుకు ఉండవచ్చు
కాని చెడ్డతల్లి ఉండదు. సాధనచేయనివారికన్న చేసేవారు మిన్న కదా.
సాధనలో దొర్లే తప్పులగురించి చింతించకుండా గురువు సలహాలు పాటిస్తూ సాధనను
చేయాలి. ఏచిన్న అనుమాన్నైన మనసులో ఉంచుకోకుండా గురువును అడిగి
తెలుసుకోవాలి. గురువుచెప్పే మాటల మీద నమ్మకం, శ్రద్ధ ఉంచుకోవాలి. శ్రీవిద్యాసాధనలో ఇది ఎంతో ముఖ్యం.
మన అంతిమ లక్ష్యం స్వరూపనిరూపణము. ఈ లక్ష్యసాధనలో
ఎటువంటి మాయలకు, విచిత్రాలకు (గాల్లో నుండి
నగలు సృష్టించడం మొదలగునవి) స్థానంలేదు. అటువంటి మాయలు విచిత్రాలు అశాశ్వతాలు. పరబ్రహ్మమొక్కటే
శాశ్వతమైనది. ఆ పరబ్రహ్మమే సత్యం, జ్ఞానం
మరియు అనంతం. ఆ శాశ్వతమైన పరబ్రహ్మపదమును చేరుకోవడానికే మనం సాధనచేయాలి.
కనుక ఎటువంటి భయాలు పెట్టుకోకుండా సాధనను కొనసాగించు. నీ బాధ, కోపం, సంతోషం అన్నీ ఆమెకే
విడిచిపెట్టు. ఆమె ఎప్పుడూ నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది.
తర్వాత గురువుగారు
చంచల్ కు పంచదశీ మహామంత్ర దీక్షాముహూర్తాన్ని నిర్ణయించారు.
No comments:
Post a Comment