SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Friday, November 17, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-23


శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

23


మస్కారం గురువుగారు, చాలా రోజులుగా మిమ్మల్ని కలవలేకపోయినందుకు క్షమించండి అని గురువుగారికి పాదాభివందనం చేసాడు చంచల్.
గురువుగారుః ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటూ సాధన చేసుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని ధర్మపధంలో ఆచరించడం కూడా సాధనలో భాగమే. నీ సాధన బాగా సాగుతున్నాదని అనుకుంటున్నాను.
చంచల్ః సాధన బాగా సాగుతున్నాది గురువుగారు. ఈ మధ్య నాకు సంఘంలో పెద్దగా మసలాడానికి మనసు రావడంలేదు. రాత్రిపార్టీలు, సినిమాలు మొదలైనవి చాలా టైం వేస్టుగా అనిపిస్తున్నాయి. 
గురువుగారు చిన్నగా నవ్వి బాలాహృదయమంత్రం పనిచేయడం ప్రారంభమైనదన్నమాట అని అన్నరు.
చంచల్ ఏ భావాన్ని ప్రకటించలేదు. తర్వాత గురువుగారు అతనిని అడిగారు…
గురువుగారుః పంచదశీ మంత్రోపాసన ఎలా జరుగుతున్నాది?
చంచల్ః పరవాలేదు గురువుగారు. ఈ విషయమై నాక్కొన్ని సందేహాలున్నాయి.
గురువుగారుః అవేమిటో చెప్పునాయనా. తీర్చడానికి ప్రయత్నిస్తాను.
చంచల్ః పంచదశీ మంత్రానికి సంబంధించి ఎన్ని ఋషి సంప్రదాయాలున్నాయి? వాటి మధ్యగల తేడాలేమిటి?
గురువుగారుః ప్రముఖంగా మూడు ఋషి సంప్రదాయాలను మనం గమనించవచ్చు. అవి, దక్షిణామూర్తి, ఆనందభైరవ మరియు మన్మధ సంప్రదాయాలు. దక్షిణాచారాపరులు దక్షిణామూర్తిని, కౌళాచారులు ఆనందభైరవుని ఋషిగా పరిగణిస్తారు. మన్మధుడు గురువుగాకల సంప్రదాయము గురించి నాకు పెద్దగా తెలియదు. కొన్ని, దక్షిణాచార సంప్రదాయాలలో దక్షిణామూర్తికి బదులుగా ఆనందభైరవుని ఋషిగా పరిగణించడం మనం గమనించవచ్చు.
పైమూడు సంప్రదాయాలేకాక, మరియొక ముఖ్యమైన సంప్రదాయమున్నది. అదే సమయాచారము. ఈ ఆచారమందు ప్రత్యేకంగా ఏ ఋషి ఉండరు. శ్రీవిద్యలో ఈ సంప్రదాయము చాలా ఉన్నతమైనది. అటువంటి స్థితికి చేరుకున్నవారు చాలా ధన్యులు. ఈ సంప్రదాయం గురించి ముందు ముందు నీకు మరింతగా తెలుస్తుంది.
దక్షిణ, కౌళ సంప్రదాయాలలో పూజా విధానం దాదాపుగా ఒకేలా ఉంటుంది. పూజలో ఉపయోగించే వస్తువులు, కొన్నిరకాల పద్ధతులే కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. ఈ రెండు ఆచారాలలోను శ్రీచక్రమునుగాని, సుమేరునుగాని పూజిస్తారు. కౌళాచారంలో ప్రత్యక్షశ్రీచక్రమును పూజచేసే సంప్రదాయం కూడా కలదు. వారిని ఉత్తర కౌళులు అని అంటారు. దక్షిణాచారపరులు వివిధ లోహాలతో చేసిన శ్రీచక్రమును లేదా సుమేరును అర్చిస్తారు.
చంచల్ః ప్రత్యక్షశ్రీచక్రము అంటే ఏమిటి గురువుగారు.
గురువుగారుః అది ఒక రహస్యము అని అదేమిటో అతనికి చిన్నగొంతుతో వివరించారు.
ఆ రహస్యాన్ని వినడంతో చంచల్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. అలాంటి పూజాపద్ధతులు కూడా ఉంటాయని అతడు ఎప్పుడూ ఊహించను కూడా లేదు.
చంచల్ః గురువుగారూ, నిజంగానే అటువంటి జుగుప్సాకరమైన పూజా పద్ధతులు కూడా ఉంటాయా?
గురువుగారుః అలా ఆలోచించడం తప్పు నాయన. అన్ని సంప్రదాయాలని మనం గౌరవించాలి. జుగుప్సాకరమైనదంటూ ఏదీ లేదు. నిజానికి అన్ని సంప్రదాయాలు ఒక్కటే. నీ నిజమైన సాధనా మార్గంలో ఈ విషయాన్ని నువ్వు తప్పక తెలుసుకుంటావు.
చంచల్ః స్త్రీలు నిజంగా అటువంటి పూజలు చేస్తారా? ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉందా?
గురువుగారుః ఇప్పటికీ ఈ సంప్రదాయం చాలా ప్రముఖంగా పాటించబడుతోంది. బీహార్, బెంగాల్, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా పాటిస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ఈ సంప్రదాయం కనిపిస్తోంది.
చంచల్ః అసలు ఈ విద్య దక్షిణాచారం మరియు కౌళాచారం అని ఎందుకు విభజించబడింది? వీటి మధ్య మూలవ్యత్యాసం ఏమిటి? ఇవేకాక నేను వామాచారం అని కూడా విన్నాను. అదేమిటి?
గురువుగారు అతనికి విశదీకరించసాగారు….

 


No comments:

Post a Comment