SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Wednesday, November 22, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-24

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

24



గురువుగారుః శ్రీవిద్యలో మొట్టమొదట ఉన్నది కౌళమే. ఈ ఆచారానికి చతుషష్టి తంత్రగ్రంధాలు ఆధారం. వీటిలో కొన్ని తంత్రాలు శివుడు పార్వతికి చెప్పగా, కొన్ని పార్వతి శివునికి చెప్పినట్టుగా తెలుస్తున్నాది. ఈ ఆచార సాధనాపరులను లింగ భేదమును బట్టి భైరవి, భైరవునిగా చెప్పబడుతారు. అయితే కొందరు సాధకులు ఈ ఆచారాన్ని సరిగ్గా అర్ధంచేసుకోలేక ఆ పూజా పద్ధతులకు ఆకర్షితులై భ్రష్టుపట్టిపోయారు. తల్లిదండ్రుల ప్రేమ అపారం కనుక పరమశివుడు తన బిడ్డలను కరుణించదలచి దక్షిణారూపమునుదాల్చి శుభాగమపంచకములను ఐదు శాస్త్రాలను ప్రకటించాడు. ఈ శాస్త్రాలందు చెప్పబడిన పూజావిధానాలు కౌళమునకు దూరంగా ఉంటాయి. ఇవి వేదప్రమాణికంగా చెప్పబడ్డాయి. వీటిని ప్రామాణికంగా తీసుకొని సాధనచేసే సాధకులను దక్షిణాచారులని అంటారు. అప్పటినుండి శ్రీవిద్యను కౌళ మరియు దక్షిణ అను రెండు ఆచారములుగా పాటిస్తున్నారు. ఈ రెండు ఆచారముల మధ్య ముఖ్యమైన వ్యత్యాసం సాధకులు ఉపయోగించే పూజావస్తువులు మరియు కొన్ని పద్ధతులలోనే. చాలా మటుకు మంత్రములు ఒక్కటే.

చంచల్ః మరి వామాచారం, సమయాచారం ఏమిటి గురువుగారు?
గురువుగారుః వామాచారం కౌళాచారంలో ఒక భాగం. శ్రీలలితారహస్య నామాలలో కూడా కౌళ, దక్షిణ మరియు సమయములగురించి ప్రస్తావన ఉంది కాని వామం గురించి లేదు. కౌళంలోని కొన్ని పద్ధతులు మరింత తీవ్రంగా ఆచరించడం వలన వామమార్గమని అన్నారు. ఉదాహరణకు శ్మశాన సాధనలు. వామం లేదా కౌళంలో పంచమకారాలను ఉపయోగిస్తారు. మద్య, మత్స్య, మాంస, ముద్ర మరియు మైథున ఈ ఐదింటిని పంచమకారాలని అంటారు. ఈ కారణం వలన కౌళాచారమును వేద బాహ్యమని అంటారు. కౌళాచారం రెండు రకాలు. అవి ఉత్తర కౌళము మరియు పూర్వ కౌళము. ఉత్తరకౌళులు ప్రత్యక్షయోనిని పూజిస్తారు. పూర్వకౌళులు శ్రీచక్రముయొక్క ఛాయా (ప్రతిమ) రూపమును అనగా భూప్రస్తారము, సుమేరు ఇలా ఒక ప్రతిమను తమ ఎదురుగా పెట్టుకొని పూజిస్తారు. నిజానికి ఇలా ప్రతిమను పూజించే ఏ సంప్రదాయులైనా పంచమకారాలను ఉపయోగించినా లేకపోయినా వారు పూర్వ కౌళులుగానే పరిగణించపడతారు. ఈ సత్యాన్ని చాలా మంది సమయ/దక్షిణాపరులని చెప్పుకొనే సాధకులు ఒప్పుకోలేరు. ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏ సంప్రదాయంలో సాధన చేసిన చివరకు సమయానికి చేరుకోవాలి. సమయాచారం అన్ని ఆచారాలకన్న ఉన్నతమైనది. అలా చేరుకోగలిగిన సాధకుని సాధన ఫలించిందని చెప్పవచ్చు.
చంచల్ః అటువంటప్పుడు విగ్రహారాధన వలన ఉపయోగం లేదంటారా?
గురువుగారుః అలా ఎంతమాత్రం కాదు. నిజానికి హిందూధర్మంలో విగ్రహారాధన ఎక్కడుంది? అజ్ఞానులు మాత్రమే విగ్రహారాధన అని అనుకుంటారు. మన దేవాలయాలలో మనం చూసే విగ్రహాలు అసలు విగ్రహాలే కావు. అవి అంతకన్నా ఎక్కువ. అవి ప్రాణం ఉన్నవి. ప్రాణమున్నది ఏదీ జడముకాదు. కొన్ని దేవతావిగ్రహాలు స్వయంభువులయితే కొన్నింటికి సత్సంప్రదాయంగా ప్రాణప్రతిష్ఠ చేసినవి. ప్రాణమున్నవాటిని ఉత్త విగ్రహములని ఎలా అనగలము? మనం ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అనుకూల తరంగాలను మనం గమనించవచ్చు. ఈ తరంగాల వలనే మన మనస్సుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. దివ్యశక్తికి ఇదే తిరుగులేని సాక్ష్యం. దివ్యశక్తికి రూపమంటూ ఏదీ లేదు కనుక మనం మనకు నచ్చిన రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రూపంలో దివ్యశక్తిని ఆహ్వానించి పూజ చేస్తున్నాం. మనం పూజ చేసేది ఆ దివ్యశక్తికి మాత్రమే గాని విగ్రహానికి కాదన్నది ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం. హిందూ మతానికి ఇతర మతాలకి ఇదే వ్యత్యాసం. 
చంచల్ః మీరు చెప్పినది చాలా తార్కికంగా ఉంది గురువుగారు. నేను హిందువునైనందుకు చాలా గర్వపడుతున్నాను.
ఈ మధ్యలో పూర్ణ కలుగజేసుకొని…..
పూర్ణః గురువుగారి మాటలను సూక్ష్మంగా అర్ధంచేసుకుంటే సకలజీవులు ఒక్కటే అన్న విషయం తెలుస్తుంది. బాహ్యదేవత, అంతర్ దేవత ఒక్కటే అన్న సంగతి అవగతమవుతుంది. అహంబ్రహ్మాస్మి అన్న స్థితిని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది.
చంచల్ః కొంచెం అలాగ అనిపిస్తూంది. కాని మరింత లోతుగా అర్ధం చేసుకోవడానికి నాకిప్పుడు అంత జ్ఞానం లేదు. నేను అటువంటి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి తప్పక తీవ్ర సాధన చేస్తాను అని చెప్పి గురువుగారిని ఈ విధంగా అడిగాడు.
గురువుగారు! ఈ ఆచారాల మధ్య ఇంకా ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? సమయాచారమంటే ఏమిటి? ఒక సాధకుడు సమయ స్థితికి ఏవిధంగా చేరగలడు?

 

No comments:

Post a Comment