SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Thursday, January 4, 2018

శ్రీవిద్యా ప్రస్థానం-26

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

26



క గంట తర్వాత ఆకర్ష అనుకుంది “ఏమైంది ఇవాళ ఇతనికి. ఇంతలా రెచ్చిపోయారు. కాని, నాకు చాలా బాగుంది. అంతసేపు ఏదో లోకంలో విహరించాను. ఇంతకు ముందు ఇలాంటి అద్భుతమైన అనుభవం కలుగలేదు.”
ఆమె చంచల్ని ఏమిటి విషయం అని అడుగుదామనుకుంది. అతని వైపు చూస్తే అతను అలసట తీర్చుకుంటూ కనిపించాడు. ఆ సమయంలో ఆమెకి అతను కొంచెం అసాధారణంగా కనిపించాడు. ఆమెకు అతని విశ్రాంతిని భగ్నం కలుగజేయాలని అనిపించలేదు. ఆమె మౌనంగా అక్కడనుండి వెళ్ళిపోయింది.
కొంచెంసేపటి తర్వాత చంచల్ స్నానం చేస్తూ ఇలా ఆలోచించసాగాడు. “ఏమైందివాళ్ళ నాకు? నేనెందుకిలా ప్రవర్తించాను? కౌళ పాఠాలు వినడం వలనా? గురువుగారు నాకు ప్రాథమిక అంశాలు మాత్రమే కదా? ప్రాథమిక అంశాలకే ఈ విధంగా ఉంటే లోతైన వషయం ఇంకెలా ఉంటుందో కదా? అసలు అలాంటి పూజావిధానాలు కూడా ఉంటాయా? చాలా ఆశ్చర్యకరంగా ఉన్నా దీనిని నమ్మక తప్పడంలేదు. ఒకవేళ కౌళమే ఒప్పు అయితే అన్యస్త్రీసంపర్కం తప్పుకాదు కదా? ఏమో నేను ఆ సిద్ధాంతాలను తప్పుగా అర్ధం చేసుకుంటున్నానేమో”.
ఇలా ఆలోచనలతో అతను స్నానం ముగించి, మంత్రజపం ప్రారంభించాడు. ఆశ్చర్యంగా అతడు రోజూకంటే ఆరోజు కొంచెం ఎక్కువ ఏకాగ్రతతో జపం చేయగలిగాడు. జపం అయిన తర్వాత “ఈరోజు జపం చాలా బాగా జరిగింది. ఇవ్వాళ్ళ నాఏకాగ్రత పెద్దగా చెదరలేదు. నేటి అనుభవాల దృష్ట్యా ఈరోజు జపం సరిగ్గా చేయలేనేమోనని అనిపించింది. కాని రోజూ కన్నా బాగా జరిగింది. అంటే ఈ లోకంలో తప్పు, ఒప్పు అన్నది లేదన్న మాట. కనుక నేను జీవితాన్ని మరింతగా ఎందుకు ఆనందంగా అనుభవించకూడదు? ఆ సమయంలో అతని మదిలో ప్రేమ మెదిలింది. ఎంత అందమైనది ఆమె. మా కాలేజ్ రోజులకన్నా ఆమె సొగసు, అందం మరింతగా పెరిగింది. ఆమె మొగుడు భలే అదృష్టవంతుడు. అంత అందమైన భార్యను పొందగలిగాడు. అతడికి మా సంగతి తెలీదు. పాపం అమయక పక్షి. చంచల్కు ఆ సమయంలో తన భార్య ఆకర్ష గుర్తుకు రాలేదు. ఇంతలో అతనికి అతని చరవాణిలో సంక్షిప్త సందేశం వచ్చింది. చూస్తే అది ప్రేమ నుండి “హాయ్” అని....
***

అదే సమయంలో పూర్ణ గురువుగారిని అడుగుతున్నాడు...
పూర్ణః గురువుగారు, చంచల్ ఇప్పుడిప్పుడే శ్రీవిద్యా సాధన ప్రారంభించాడు. ఈ ప్రారంభదశలోనే కౌళమును పరిచయం చేయడంవలన అతడు ఆ సిద్ధాంతాలను తప్పుగా అర్ధం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది కదా. నా అభిప్రాయం చెప్పినందుకు నన్ను క్షమించండి.
గురువుగారుః సాధారణ సాధకుల విషయంలో నువ్వు చెప్పింది అక్షర సత్యమే పూర్ణ. కానీ, చంచల్ సంగతి వేరు. అతడొక భ్రష్టుపట్టిన సాధకుడు. తన క్రిందటి జన్మలో అతడు శ్రీవిద్యోపాసన చేసాడు. కాని ఉధృతమైన కామ మరియు ఇతర లోభాలవలన అతడు భ్రష్టుపట్టాడు. క్రిందటి జన్మలో అతని ఉపాసన వలన అతడు మళ్ళీ ఈ జన్మలో ఉపాసన ప్రారంభించగలిగాడు. అతడి పూర్వజన్మల కర్మలను అతడు ఎంత త్వరగా క్షయపరచుకుంటే అంత మంచిది. అందుకై మనం అతడికి తోడ్పడాలి. అతని కర్మ క్షయమవనంతవరకు అతడు ఆధ్యాత్మికంగా ఎదగలేడు. అతనికి అసలైన పరీక్షాకాలం ఇప్పుడు మొదలైంది. అతడు ఈ పరీక్షలో విజయుడైతే ఈ జన్మలో అతడు ఆధ్యాత్మికంగా చాలా దూరం ప్రయాణించగలడు. కానీ అతనికి ఆత్మానుభూతి, మోక్షం కలగాలంటే అతను మరియొక జన్మ ఎత్తితీరవలసిందే. ఒకవేళ అతడు ఈ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేకపోతే అతనికి మరో ఏడు జన్మలదాక మోక్షం ఉండదు. నా ఊహ నిజమైతే అతడు ఇప్పటికే అసహజ మరియు అధర్మ శృంగారానికై ఆలోచిస్తూ ఉంటాడు. జీవులకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు నిజమైన శత్రువులు. వీటిబారిన పడకుండా తప్పించుకోవడం చాలా కష్టం. తప్పించుకున్నవారు యోగులవుతారు. లేనివారు భోగులవుతారు. జీవులలో ఈ అరిషడ్వర్గాలు ఒకొక్కరికి ఒకొక్క స్థాయిలో ఉంటాయి. వీటిలో కామం చాలా ప్రమాదకరమైనది. చంచల్ లో ఈ కామశత్రువు మిగతా వాటికన్నా కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది. చూద్దాం... అమ్మ అతని భవిష్యత్తును ఏవిధంగా నిర్ణయించిందో.
పూర్ణః గురువుగారు, మీరు జీవుల పూర్వ జన్మలు, రాబోవు జన్మలు తెలుసుకోగలరు. మరి నేనెందుకు తెలుకోలేకపోతున్నాను?
గురువుగారుః ఒకరి జన్మ రహస్యాలు తెలుసుకోవడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు. ఒకరి జాతకచక్రం ద్వారాగాని లేదా మంత్రసాధన ద్వారాగాని అది తెలుసుకోవచ్చు. మంత్రోపాసన ద్వారా అది తెలుసుకోగలిగితే దానిని సిద్ధి అని అంటారు. ఈ సిద్ధులు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అవరోధాలు. అవి సాధకుడిని మాయలో పడవేస్తాయి. తద్వారా వారు భ్రష్టుపట్టిపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే శ్రీరామకృష్ణులవారు సిద్ధులు అశుద్ధాలని అనేవారు. కనుక నిజమైన సాధకులు సిద్ధులగురించి ప్రాకులాడకూడదు. ఏ సాధకుడికైనా ఈ సిద్ధులు కలిగినా అతడు వాటిని బాహాటంగా తన స్వలాభానికై ప్రదర్శించకూడదు. ఏవో కొన్ని నిజమైన అవసారల కొరకై సంఘప్రయోజనాలకై కొండకొచో అన్న విధంగా వాడుకోవచ్చు. ఈ రోజుల్లో అటువంటి నిస్స్వార్ధసాధకులు చాలా తక్కువగా ఉన్నారు.
అటువంటి నిస్స్వార్ధసాధకులలో మీరూ ఒకరు గురువుగారు అని అతను తన మనసులో అనుకొని...
పూర్ణః గురువుగారు, అటువంటి సిద్ధి ఏసాధకుడికైనా ఏవిధంగా కలుగుతుంది?
 

Tuesday, December 19, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-25

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

25



గురువుగారుః ఒక దేవతను ప్రతిమ లేకుండా పూజించడమే సమయము. సూక్ష్మంగా అదే అంతర్యాగం. మన ఎదురుగా ఎవరైనా దేవతయొక్క ప్రతిమను పెట్టుకొని చేసే పూజ బహిర్యాగం. దక్షిణ, కౌళాచారుల పూజ బహిర్యాగం. ఎమైతే నియమాలు బహిర్యాగంలో పాటించవలసి ఉంటుందో ఆ నియమ నిబంధనలు ఏమీ అంతర్యాగంలో వర్తించవు. ఇక్కడ గమనించవలసిన ముఖ్యవిషయం ఏమిటంటే బహిర్యాగంలో బాగా సాధన చేసిన తర్వాత మాత్రమే అంతర్యాగంలో సాధన సుళువవుతుంది. కనుక, అంతర్యాగ స్థితికి చేరుకోవడానికి బహిర్యాగం తప్పనిసరి. ఈ చిన్న విషయాన్ని అర్ధంచేసుకోలేక ఈ రోజుల్లో చాలామంది బహిర్యాగం అసలు అవసరమేలేదని ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటే అదే గొప్ప సాధన అని ప్రచారంచేస్తున్నారు. అది సరియైన దారి కాదు. బహిర్యాగ, అంతర్యాగముల కలయికే సాధన. కొంతమంది అడగవచ్చు శ్రీరమణమహర్షులవారు ఏ బహిర్యాగం చేసారని. ఆయన ఒక సిద్ధ పురుషుడు. ఆయన ఎన్ని జన్మల పుణ్యఫలమోకదా ఈ జన్మలో కేవలం అంతర్యాగ సాధకుడయ్యారు. అసలు విషయాన్ని విస్మరించి ఆయనను ఒక ఉదాహరణగా చూపించుకొని సాధకులు తమకు తామే గోతిలో పడుతున్నారు


కౌళమతంలో సాధకునికి శ్రీమాత స్ఠూలశరీర రూపంలో దర్శనభాగ్యం లభిస్తుంది. ఆమె ఆ సాధకునితో మాట్లాడడం, శాస్త్రసంబంధిత విషయములలో అనుమానాలు తీర్చడం మొదలైన అనుభవాలు కలుగుతుంటాయి. అయితే దక్షిణ లేదా సమయములలో ఈ అవకాశం సాధకునకు ఉండదు. మరటువంటప్పుడు కౌళమే ఉత్తమము కదా అని నీకు అనుమానం రావచ్చు. ఇక్కడే అసలైన కీలక విషయం ఉంది. దక్షిణ/సమయాలలో సాధకుడు సాక్షాత్తు దేవీ రూపుడవుతాడు. సాధకుడే శ్రీమాత అవుతున్నపుడు అతనికి వేరేగా దేవత ఎలా కనిపిస్తుంది? నువ్వు నీ కంటిని నీకళ్ళతో  చూడగలవా? సమయానుభూతి అద్వైతస్థితి కౌళం ద్వైతస్థితి. ఈ రెండింటి మధ్య ఇదీ అసలైన మరియు ముఖ్యమైన వ్యత్యాసము.

గురువుగారి వివరణ విన్న తర్వాత చంచల్కు కొంచెంసేపు మాటరాలేదు. అతనికి ఏమి మాట్లాడాలో కూడా అర్ధం కాలేదు. కొంచెంసేపు తేరుకున్న తర్వాత అతడు గురువుగారితో ఈ విధంగా 

అన్నాడు… 

చంచల్ః మీరు చెప్పింది చాలా ఆశ్చర్యంగా మరియు అద్భుతంగా ఉంది. కానీ, నాకు అర్ధం కాని విషయం ఏమిటంటే చాలా మంది కౌళంనకు ఎందుకు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు?
గురువుగారుః అదే మాయంటే. నేను ఇంతకు ముందే చెప్పినట్టు కౌళం చాలా గొప్ప ఆచారం. ఈ సాధకునికి చాలా గొప్ప నిశ్చలమైన మనస్సు, బుద్ధి కావాలి. ఊగిసలాడే ధోరణి ఉన్నసాధకుడు ఈ ఆచారపూజా పద్ధతులకు ఆకర్షితుడయి భ్రష్టుపట్టిపోవడానికి (ఆధ్యాత్మికంగా, సాంఘికంగా) చాలా అవకాశం ఉంటుంది. కౌళమందున్న నియమ, నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకొని, నేర్చుకొని సాధనచేయాలి

చంచల్ః నేను ఆ పద్ధతులు తెలుసుకోవచ్చునా గురువుగారు.

గురువుగారుః తప్పకుండా. మనం దక్షిణాచారాపరులం. కానీ శ్రీవిద్యోపాసకుడుగా నువ్వు మిగతా ఆచారాలని పాటించకపోయినా తప్పక వాటి సిద్ధాంతాలను తెలుసుకోవాలి. ఒకరకంగా అది సాధనకు ఉపయోగపడుతుంది. కనుక నీకు కొన్ని ముఖ్యమైనవి మాత్రం చెబుతాను.

గురువుగారు చంచల్కు కౌళ, వామాచారములకు సంబంధించిన కొన్ని ప్రధానమైన సిద్ధాంతాలను విశదీకరించారు. అవి వింటున్నంత సేపు చంచల్ మెదడు పనిచేయడం మానివేసింది. ఆస్థానే అతనికి ఎన్నడూ లేనంత కామవికారాలు కలుగసాగాయి. ఏదో ప్రయాసతో అతడు గురువుగారు చెప్పినవి వినగలిగాడు. గురువుగారు అంతా చెప్పిన తర్వాత ఇప్పుడు నువ్వు శ్రీచక్రం గురించి, శ్రీచక్ర నవావరణ పూజావిధానము తెలుసుకోవలసిన సమయం వచ్చింది. ఇప్పటి నుండి నువ్వు సాధన కొరకై ఎక్కువ సమయం వెచ్చించవలసి ఉంటుంది. నువ్వు నాతో కూడా ఎక్కువ సమయం గడపవలసి వస్తుంది. అందుకనుగుణంగా నీ రోజువారీ పనులను ఒక ప్రణాళికా ప్రకారం చేయడం అలవాటు చేసుకో అని చంచల్కు చెప్పారు.

చంచల్ అన్యమనస్కుడై ఇంటికి బయలుదేరాడు. గురువుగారు చెప్పిన విషయాలు విన్న తర్వాత అతని శరీరంలో కామప్రకంపనలు బాగా ఎక్కువయ్యాయి. అప్పుడతడు అనుభవిస్తున్న కామవికారం అతనెప్పుడూ కనీసం అతని నవ యవ్వనంలో కూడా అనుభవించి ఉండడు. ఆ సమయంలో ఏ స్త్రీతోనైనా అతను కలవడానికి చాలా తొందరగా ఉన్నాడు. అది తప్పని తెలిసినా అతని మనసు అతనిని నిలబడనీయటం లేదు. ఆ సమయంలో అతని ఆలోచనలు ఈ విధంగా సాగాయిఇంటికి చేరుకోవడానికి ఇంకా గంట సమయమైనా పడుతుంది. అప్పటివరకు నా కోరికను అదుపుచేసుకోగలనా? లేనేమో అనిపిస్తోంది. అయినా నాకు ఎందుకు ఇంత కోరిక వస్తోంది. అందునా గురువుగారి పాఠాలు విన్నతర్వాత ఇలా రావడం అసమంజసం కదా. ఇది ఎంతో తప్పుకూడా. నేనేమైనా తప్పు చేస్తున్నానా. కానీ నేనిప్పుడు అశక్తుడై ఉన్నాను. ఎంత ప్రయత్నించినా నా ఈ కోరిక ఆగడంలేదే. ఇప్పుడేమి చెయ్యాలి? దారిలో కనబడుతున్న ప్రతి స్త్రీ చాలా అందంగా కనిపిస్తోంది. నేను వారిని అలా చూడ్డం తప్పు. నేను మనస్సును నియంత్రించాలి. నాగురించి నా అందమైన భార్య ఇంట్లో వేచి చూస్తూ ఉంటుంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి చేరుకోవాలి. లేదంటే చెడిపోయేలా ఉన్నాను”. 

అతనికి పుండు మీద కారం చల్లినట్టుగా ఆ దారిలో ఏక్సిడెంట్ వల్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. అది ఇప్పుడప్పుడే క్లియర్ అయ్యేటట్టుగా అతనికి అనిపించలేదు. ఏక్సిడెంట్ చేసిన వాళ్ళని మనసులో తిట్టుకొని అతడు వేరే దారిలో తన బండిని తిప్పాడు. ఈ కొత్త దారిలో ఇంటికి చేరుకోవడానికి ఇంకొక అరగంట ఎక్కువ పడుతుంది. అటువైపుగా వెల్తుంటే అక్కడ ఒక మధ్యవయస్కురాలు బస్ స్టాప్ లో నిలబడి అతడికి కనిపించింది. ఆమెను తన కారులోకి లిప్ట్ ఇస్తానని పిలుద్దామనుకొని భయపడి ఆ ఆలోచనని విరమించుకున్నాడు. అతను మళ్ళీ ఇలా ఆలోచించసాగాడు

నాకు సెక్స్ అంటే ఇంత బలహీనత ఉందా? పరస్త్రీలమీద ఇంత వ్యామోహం ఉందా? ఈ విధంగా నేను ఆలోచించడం ఎంతవరకు సరియైనది? ఇందువలన నాకు శిక్ష తప్పదేమో? పరస్త్రీ గమనం తప్పుకదా. అది నాకు తెలిసినా ఈ క్షణంలో నన్ను నేను నియంత్రించుకోలేకపోతున్నానే. నాకెందుకిలా జరుగుతోంది. ఇది నాకు పరీక్షా? లేక నా చంచల స్వభావమా? ఇంతకు మునుపు నాకెప్పుడూ ఇటువంటి స్థితి అనుభవమవ్వలేదు. ఇప్పుడేం చెయ్యాలి? సాధ్యమైనంత త్వరగా ఇంటికి చేరుకోవడం ఉత్తమం”.  ఇలాంటి ఆలోచనల్లో అతడు ఎలాగైతేనేం ఇంటికి చేరుకున్నాడు.
అతడు ఇంట్లోకి వెళ్ళేసరికి వారి పడకగదిలో మోహ ఆడుకుంటూ ఆకర్ష ఇల్లు తుడుస్తూ కనిపించారు. అతడు తన లాప్ టాప్ ను తెరచి మోహకిచ్చి ఆడుకోమన్నాడు

మోహః నాన్న, నువ్వు ఎప్పుడూ నాకు లాప్ టాప్ ఇవ్వవు కదా. ఇవ్వాళ ఎందుకిచ్చావ్?

చంచల్ః నువ్వు నన్ను చాలా సార్లు అడిగావు కాని నేనివ్వలేదు. కాని, నువ్విప్పుడు బాగా చదువుకుంటున్నావు కదా. అందుకే ఈ ఒక్కసారి నీకు ఇద్దామనుకున్నాను. ఇది తీసుకొని మన హాల్లో ఆడుకో. నేనివ్వమన్నప్పుడు నాకు తిరిగి ఇచ్చేయాలి. సరేనా

మోహాః హాల్లోనే ఎందుకు? ఇక్కడెందుకు ఆడుకోకూడదు?

చంచల్ః ఎందుకంటే లాప్ టాప్ లో వీడియోగేమ్ హాల్లో అయితే చాలా బాగా వస్తుంది అందుకని.

మోహః ఓఅలాగ. చాలా థేంక్స్ నాన్న. నేనిప్పుడే వెళ్ళి ఆడుకుంటాను.

ఆమెది కంప్యూటర్నుఅర్ఢం చేసుకొనే వయసు కాదు. ఎప్పటినుండో తను కోరుకొంటున్న లాప్ టాప్ తన చేతికి వచ్చింది. దానితో తను ఆడుకోవాలి. అదే తనకి తెలిసింది. ఆమె ఎంతో ఆనందంతో దానిని తీసుకొని హాల్లోకి పరిగెట్టింది

చంచల్ ఆకర్షను గట్టిగా పిలిచాడు. కొంచెంసేపటికి ఆమె తన వంటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అతని దగ్గరకు వచ్చింది. ఆమె రావడమే ఆలస్యం అతను ఆమెను బలంగా తనవైపుకు లాక్కొని మంచంమీద పడ్డాడు.

అప్పుడు సాయంత్రం ఆరుగంటలు కావస్తోంది. ఆసమయం శృంగారానికి నిషిద్ధం.

 

Wednesday, November 22, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-24

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

24



గురువుగారుః శ్రీవిద్యలో మొట్టమొదట ఉన్నది కౌళమే. ఈ ఆచారానికి చతుషష్టి తంత్రగ్రంధాలు ఆధారం. వీటిలో కొన్ని తంత్రాలు శివుడు పార్వతికి చెప్పగా, కొన్ని పార్వతి శివునికి చెప్పినట్టుగా తెలుస్తున్నాది. ఈ ఆచార సాధనాపరులను లింగ భేదమును బట్టి భైరవి, భైరవునిగా చెప్పబడుతారు. అయితే కొందరు సాధకులు ఈ ఆచారాన్ని సరిగ్గా అర్ధంచేసుకోలేక ఆ పూజా పద్ధతులకు ఆకర్షితులై భ్రష్టుపట్టిపోయారు. తల్లిదండ్రుల ప్రేమ అపారం కనుక పరమశివుడు తన బిడ్డలను కరుణించదలచి దక్షిణారూపమునుదాల్చి శుభాగమపంచకములను ఐదు శాస్త్రాలను ప్రకటించాడు. ఈ శాస్త్రాలందు చెప్పబడిన పూజావిధానాలు కౌళమునకు దూరంగా ఉంటాయి. ఇవి వేదప్రమాణికంగా చెప్పబడ్డాయి. వీటిని ప్రామాణికంగా తీసుకొని సాధనచేసే సాధకులను దక్షిణాచారులని అంటారు. అప్పటినుండి శ్రీవిద్యను కౌళ మరియు దక్షిణ అను రెండు ఆచారములుగా పాటిస్తున్నారు. ఈ రెండు ఆచారముల మధ్య ముఖ్యమైన వ్యత్యాసం సాధకులు ఉపయోగించే పూజావస్తువులు మరియు కొన్ని పద్ధతులలోనే. చాలా మటుకు మంత్రములు ఒక్కటే.

చంచల్ః మరి వామాచారం, సమయాచారం ఏమిటి గురువుగారు?
గురువుగారుః వామాచారం కౌళాచారంలో ఒక భాగం. శ్రీలలితారహస్య నామాలలో కూడా కౌళ, దక్షిణ మరియు సమయములగురించి ప్రస్తావన ఉంది కాని వామం గురించి లేదు. కౌళంలోని కొన్ని పద్ధతులు మరింత తీవ్రంగా ఆచరించడం వలన వామమార్గమని అన్నారు. ఉదాహరణకు శ్మశాన సాధనలు. వామం లేదా కౌళంలో పంచమకారాలను ఉపయోగిస్తారు. మద్య, మత్స్య, మాంస, ముద్ర మరియు మైథున ఈ ఐదింటిని పంచమకారాలని అంటారు. ఈ కారణం వలన కౌళాచారమును వేద బాహ్యమని అంటారు. కౌళాచారం రెండు రకాలు. అవి ఉత్తర కౌళము మరియు పూర్వ కౌళము. ఉత్తరకౌళులు ప్రత్యక్షయోనిని పూజిస్తారు. పూర్వకౌళులు శ్రీచక్రముయొక్క ఛాయా (ప్రతిమ) రూపమును అనగా భూప్రస్తారము, సుమేరు ఇలా ఒక ప్రతిమను తమ ఎదురుగా పెట్టుకొని పూజిస్తారు. నిజానికి ఇలా ప్రతిమను పూజించే ఏ సంప్రదాయులైనా పంచమకారాలను ఉపయోగించినా లేకపోయినా వారు పూర్వ కౌళులుగానే పరిగణించపడతారు. ఈ సత్యాన్ని చాలా మంది సమయ/దక్షిణాపరులని చెప్పుకొనే సాధకులు ఒప్పుకోలేరు. ఒక్కటి గుర్తుపెట్టుకో. ఏ సంప్రదాయంలో సాధన చేసిన చివరకు సమయానికి చేరుకోవాలి. సమయాచారం అన్ని ఆచారాలకన్న ఉన్నతమైనది. అలా చేరుకోగలిగిన సాధకుని సాధన ఫలించిందని చెప్పవచ్చు.
చంచల్ః అటువంటప్పుడు విగ్రహారాధన వలన ఉపయోగం లేదంటారా?
గురువుగారుః అలా ఎంతమాత్రం కాదు. నిజానికి హిందూధర్మంలో విగ్రహారాధన ఎక్కడుంది? అజ్ఞానులు మాత్రమే విగ్రహారాధన అని అనుకుంటారు. మన దేవాలయాలలో మనం చూసే విగ్రహాలు అసలు విగ్రహాలే కావు. అవి అంతకన్నా ఎక్కువ. అవి ప్రాణం ఉన్నవి. ప్రాణమున్నది ఏదీ జడముకాదు. కొన్ని దేవతావిగ్రహాలు స్వయంభువులయితే కొన్నింటికి సత్సంప్రదాయంగా ప్రాణప్రతిష్ఠ చేసినవి. ప్రాణమున్నవాటిని ఉత్త విగ్రహములని ఎలా అనగలము? మనం ఏమైనా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ కొన్ని అనుకూల తరంగాలను మనం గమనించవచ్చు. ఈ తరంగాల వలనే మన మనస్సుకు ఏదో తెలియని ప్రశాంతత కలుగుతుంది. దివ్యశక్తికి ఇదే తిరుగులేని సాక్ష్యం. దివ్యశక్తికి రూపమంటూ ఏదీ లేదు కనుక మనం మనకు నచ్చిన రూపాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రూపంలో దివ్యశక్తిని ఆహ్వానించి పూజ చేస్తున్నాం. మనం పూజ చేసేది ఆ దివ్యశక్తికి మాత్రమే గాని విగ్రహానికి కాదన్నది ఇక్కడ గమనించవలసిన ముఖ్య విషయం. హిందూ మతానికి ఇతర మతాలకి ఇదే వ్యత్యాసం. 
చంచల్ః మీరు చెప్పినది చాలా తార్కికంగా ఉంది గురువుగారు. నేను హిందువునైనందుకు చాలా గర్వపడుతున్నాను.
ఈ మధ్యలో పూర్ణ కలుగజేసుకొని…..
పూర్ణః గురువుగారి మాటలను సూక్ష్మంగా అర్ధంచేసుకుంటే సకలజీవులు ఒక్కటే అన్న విషయం తెలుస్తుంది. బాహ్యదేవత, అంతర్ దేవత ఒక్కటే అన్న సంగతి అవగతమవుతుంది. అహంబ్రహ్మాస్మి అన్న స్థితిని అర్ధం చేసుకోవడానికి సహాయపడుతుంది.
చంచల్ః కొంచెం అలాగ అనిపిస్తూంది. కాని మరింత లోతుగా అర్ధం చేసుకోవడానికి నాకిప్పుడు అంత జ్ఞానం లేదు. నేను అటువంటి ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి తప్పక తీవ్ర సాధన చేస్తాను అని చెప్పి గురువుగారిని ఈ విధంగా అడిగాడు.
గురువుగారు! ఈ ఆచారాల మధ్య ఇంకా ఉన్న వ్యత్యాసాలు ఏమిటి? సమయాచారమంటే ఏమిటి? ఒక సాధకుడు సమయ స్థితికి ఏవిధంగా చేరగలడు?

 

Friday, November 17, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-23


శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

23


మస్కారం గురువుగారు, చాలా రోజులుగా మిమ్మల్ని కలవలేకపోయినందుకు క్షమించండి అని గురువుగారికి పాదాభివందనం చేసాడు చంచల్.
గురువుగారుః ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటూ సాధన చేసుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని ధర్మపధంలో ఆచరించడం కూడా సాధనలో భాగమే. నీ సాధన బాగా సాగుతున్నాదని అనుకుంటున్నాను.
చంచల్ః సాధన బాగా సాగుతున్నాది గురువుగారు. ఈ మధ్య నాకు సంఘంలో పెద్దగా మసలాడానికి మనసు రావడంలేదు. రాత్రిపార్టీలు, సినిమాలు మొదలైనవి చాలా టైం వేస్టుగా అనిపిస్తున్నాయి. 
గురువుగారు చిన్నగా నవ్వి బాలాహృదయమంత్రం పనిచేయడం ప్రారంభమైనదన్నమాట అని అన్నరు.
చంచల్ ఏ భావాన్ని ప్రకటించలేదు. తర్వాత గురువుగారు అతనిని అడిగారు…
గురువుగారుః పంచదశీ మంత్రోపాసన ఎలా జరుగుతున్నాది?
చంచల్ః పరవాలేదు గురువుగారు. ఈ విషయమై నాక్కొన్ని సందేహాలున్నాయి.
గురువుగారుః అవేమిటో చెప్పునాయనా. తీర్చడానికి ప్రయత్నిస్తాను.
చంచల్ః పంచదశీ మంత్రానికి సంబంధించి ఎన్ని ఋషి సంప్రదాయాలున్నాయి? వాటి మధ్యగల తేడాలేమిటి?
గురువుగారుః ప్రముఖంగా మూడు ఋషి సంప్రదాయాలను మనం గమనించవచ్చు. అవి, దక్షిణామూర్తి, ఆనందభైరవ మరియు మన్మధ సంప్రదాయాలు. దక్షిణాచారాపరులు దక్షిణామూర్తిని, కౌళాచారులు ఆనందభైరవుని ఋషిగా పరిగణిస్తారు. మన్మధుడు గురువుగాకల సంప్రదాయము గురించి నాకు పెద్దగా తెలియదు. కొన్ని, దక్షిణాచార సంప్రదాయాలలో దక్షిణామూర్తికి బదులుగా ఆనందభైరవుని ఋషిగా పరిగణించడం మనం గమనించవచ్చు.
పైమూడు సంప్రదాయాలేకాక, మరియొక ముఖ్యమైన సంప్రదాయమున్నది. అదే సమయాచారము. ఈ ఆచారమందు ప్రత్యేకంగా ఏ ఋషి ఉండరు. శ్రీవిద్యలో ఈ సంప్రదాయము చాలా ఉన్నతమైనది. అటువంటి స్థితికి చేరుకున్నవారు చాలా ధన్యులు. ఈ సంప్రదాయం గురించి ముందు ముందు నీకు మరింతగా తెలుస్తుంది.
దక్షిణ, కౌళ సంప్రదాయాలలో పూజా విధానం దాదాపుగా ఒకేలా ఉంటుంది. పూజలో ఉపయోగించే వస్తువులు, కొన్నిరకాల పద్ధతులే కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. ఈ రెండు ఆచారాలలోను శ్రీచక్రమునుగాని, సుమేరునుగాని పూజిస్తారు. కౌళాచారంలో ప్రత్యక్షశ్రీచక్రమును పూజచేసే సంప్రదాయం కూడా కలదు. వారిని ఉత్తర కౌళులు అని అంటారు. దక్షిణాచారపరులు వివిధ లోహాలతో చేసిన శ్రీచక్రమును లేదా సుమేరును అర్చిస్తారు.
చంచల్ః ప్రత్యక్షశ్రీచక్రము అంటే ఏమిటి గురువుగారు.
గురువుగారుః అది ఒక రహస్యము అని అదేమిటో అతనికి చిన్నగొంతుతో వివరించారు.
ఆ రహస్యాన్ని వినడంతో చంచల్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. అలాంటి పూజాపద్ధతులు కూడా ఉంటాయని అతడు ఎప్పుడూ ఊహించను కూడా లేదు.
చంచల్ః గురువుగారూ, నిజంగానే అటువంటి జుగుప్సాకరమైన పూజా పద్ధతులు కూడా ఉంటాయా?
గురువుగారుః అలా ఆలోచించడం తప్పు నాయన. అన్ని సంప్రదాయాలని మనం గౌరవించాలి. జుగుప్సాకరమైనదంటూ ఏదీ లేదు. నిజానికి అన్ని సంప్రదాయాలు ఒక్కటే. నీ నిజమైన సాధనా మార్గంలో ఈ విషయాన్ని నువ్వు తప్పక తెలుసుకుంటావు.
చంచల్ః స్త్రీలు నిజంగా అటువంటి పూజలు చేస్తారా? ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉందా?
గురువుగారుః ఇప్పటికీ ఈ సంప్రదాయం చాలా ప్రముఖంగా పాటించబడుతోంది. బీహార్, బెంగాల్, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా పాటిస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ఈ సంప్రదాయం కనిపిస్తోంది.
చంచల్ః అసలు ఈ విద్య దక్షిణాచారం మరియు కౌళాచారం అని ఎందుకు విభజించబడింది? వీటి మధ్య మూలవ్యత్యాసం ఏమిటి? ఇవేకాక నేను వామాచారం అని కూడా విన్నాను. అదేమిటి?
గురువుగారు అతనికి విశదీకరించసాగారు….