SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Friday, November 17, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-23


శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

23


నమస్కారం గురువుగారు, చాలా రోజులుగా మిమ్మల్ని కలవలేకపోయినందుకు క్షమించండి అని గురువుగారికి పాదాభివందనం చేసాడు చంచల్.
గురువుగారుః ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో పనులు చేసుకుంటూ సాధన చేసుకోవాలి. వ్యక్తిగత జీవితాన్ని ధర్మపధంలో ఆచరించడం కూడా సాధనలో భాగమే. నీ సాధన బాగా సాగుతున్నాదని అనుకుంటున్నాను.
చంచల్ః సాధన బాగా సాగుతున్నాది గురువుగారు. ఈ మధ్య నాకు సంఘంలో పెద్దగా మసలాడానికి మనసు రావడంలేదు. రాత్రిపార్టీలు, సినిమాలు మొదలైనవి చాలా టైం వేస్టుగా అనిపిస్తున్నాయి. 
గురువుగారు చిన్నగా నవ్వి బాలాహృదయమంత్రం పనిచేయడం ప్రారంభమైనదన్నమాట అని అన్నరు.
చంచల్ ఏ భావాన్ని ప్రకటించలేదు. తర్వాత గురువుగారు అతనిని అడిగారు…
గురువుగారుః పంచదశీ మంత్రోపాసన ఎలా జరుగుతున్నాది?
చంచల్ః పరవాలేదు గురువుగారు. ఈ విషయమై నాక్కొన్ని సందేహాలున్నాయి.
గురువుగారుః అవేమిటో చెప్పునాయనా. తీర్చడానికి ప్రయత్నిస్తాను.
చంచల్ః పంచదశీ మంత్రానికి సంబంధించి ఎన్ని ఋషి సంప్రదాయాలున్నాయి? వాటి మధ్యగల తేడాలేమిటి?
గురువుగారుః ప్రముఖంగా మూడు ఋషి సంప్రదాయాలను మనం గమనించవచ్చు. అవి, దక్షిణామూర్తి, ఆనందభైరవ మరియు మన్మధ సంప్రదాయాలు. దక్షిణాచారాపరులు దక్షిణామూర్తిని, కౌళాచారులు ఆనందభైరవుని ఋషిగా పరిగణిస్తారు. మన్మధుడు గురువుగాకల సంప్రదాయము గురించి నాకు పెద్దగా తెలియదు. కొన్ని, దక్షిణాచార సంప్రదాయాలలో దక్షిణామూర్తికి బదులుగా ఆనందభైరవుని ఋషిగా పరిగణించడం మనం గమనించవచ్చు.
పైమూడు సంప్రదాయాలేకాక, మరియొక ముఖ్యమైన సంప్రదాయమున్నది. అదే సమయాచారము. ఈ ఆచారమందు ప్రత్యేకంగా ఏ ఋషి ఉండరు. శ్రీవిద్యలో ఈ సంప్రదాయము చాలా ఉన్నతమైనది. అటువంటి స్థితికి చేరుకున్నవారు చాలా ధన్యులు. ఈ సంప్రదాయం గురించి ముందు ముందు నీకు మరింతగా తెలుస్తుంది.
దక్షిణ, కౌళ సంప్రదాయాలలో పూజా విధానం దాదాపుగా ఒకేలా ఉంటుంది. పూజలో ఉపయోగించే వస్తువులు, కొన్నిరకాల పద్ధతులే కొంచెం వ్యత్యాసంగా ఉంటాయి. ఈ రెండు ఆచారాలలోను శ్రీచక్రమునుగాని, సుమేరునుగాని పూజిస్తారు. కౌళాచారంలో ప్రత్యక్షశ్రీచక్రమును పూజచేసే సంప్రదాయం కూడా కలదు. వారిని ఉత్తర కౌళులు అని అంటారు. దక్షిణాచారపరులు వివిధ లోహాలతో చేసిన శ్రీచక్రమును లేదా సుమేరును అర్చిస్తారు.
చంచల్ః ప్రత్యక్షశ్రీచక్రము అంటే ఏమిటి గురువుగారు.
గురువుగారుః అది ఒక రహస్యము అని అదేమిటో అతనికి చిన్నగొంతుతో వివరించారు.
ఆ రహస్యాన్ని వినడంతో చంచల్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. అలాంటి పూజాపద్ధతులు కూడా ఉంటాయని అతడు ఎప్పుడూ ఊహించను కూడా లేదు.
చంచల్ః గురువుగారూ, నిజంగానే అటువంటి జుగుప్సాకరమైన పూజా పద్ధతులు కూడా ఉంటాయా?
గురువుగారుః అలా ఆలోచించడం తప్పు నాయన. అన్ని సంప్రదాయాలని మనం గౌరవించాలి. జుగుప్సాకరమైనదంటూ ఏదీ లేదు. నిజానికి అన్ని సంప్రదాయాలు ఒక్కటే. నీ నిజమైన సాధనా మార్గంలో ఈ విషయాన్ని నువ్వు తప్పక తెలుసుకుంటావు.
చంచల్ః స్త్రీలు నిజంగా అటువంటి పూజలు చేస్తారా? ఇప్పటికీ ఆ సంప్రదాయం ఉందా?
గురువుగారుః ఇప్పటికీ ఈ సంప్రదాయం చాలా ప్రముఖంగా పాటించబడుతోంది. బీహార్, బెంగాల్, కేరళ రాష్ట్రాలలో ఎక్కువగా పాటిస్తున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా అక్కడక్కడ ఈ సంప్రదాయం కనిపిస్తోంది.
చంచల్ః అసలు ఈ విద్య దక్షిణాచారం మరియు కౌళాచారం అని ఎందుకు విభజించబడింది? వీటి మధ్య మూలవ్యత్యాసం ఏమిటి? ఇవేకాక నేను వామాచారం అని కూడా విన్నాను. అదేమిటి?
గురువుగారు అతనికి విశదీకరించసాగారు….

 


Wednesday, November 8, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-22

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

22



అక్కడ ఆకర్ష, మోహ ప్రశాంతంగా నిద్రపోతూ కనిపించారు. అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. అంతలోనే కొంచెం భయం కూడా వేసింది. ఎవరో కదిలిన మాట వాస్తవం. ఆకర్ష కాదు, మోహ కాదు. మరెవరు అయ్యుంటారు? కొంపదీసి ఏదైనా ఆత్మా లేక దెయ్యమా? ఈ ఆలోచన రాగానే అతని భయం రెట్టింపు అయ్యింది. అతడి జపం ఇంకా పూర్తి అవ్వలేదు. మిగిలిన జపం పూర్తి చేయడానికై అతడు భయపడుతూనే పూజగదికి వెళ్ళాడు. ఈసారి కళ్ళు తెరచే జపం గబగబా పూర్తి చేసి పడక గది వైపు వడివడిగా వెళ్ళిపోయాడు. ఈ సంఘటను ఆకర్షతో చెబుతామనుకొని విరమించుకున్నాడు. గురువుగారిని మళ్ళీ దర్శనం చేసుకుందామని అనుకున్నాడు.

ఆ తర్వాత వచ్చిన సెలవు రోజున గురువుగారిని కలిసి తనకు కలిగిన అనుభవాన్ని వివరించాడు. గురువుగారు అంతా విని అతనికి ఈ విధంగా తెలుపసాగారు….
గురువుగారుః సాధన ప్రారంభదశలో ఇటువంటి అనుభవాలు చాలా సహజం. ఆసమయంలో నువ్వు కళ్ళను తెరువకుండా ఉండాల్సింది. చాలామంది సాధకులు భయంవల్లగాని ఏదో తెలియని ఆత్రుత వలన గాని తమ కళ్ళను తెరిస్తారు. ఆ వచ్చింది ఆత్మో, దెయ్యమో అని ఎందుకనిపించింది? దేవుడని ఎందుకనిపించలేదు? దైవమును గురించి చింత తక్కువ ఉన్నవారికై ఇది ఒక చక్కటి ఉదాహరణ. అందరికీ దేవుడును చూడాలని ఉంటుంది. కాని అతను తన దగ్గరకు వస్తే గుర్తించలేరు. ఒక్కటి గుర్తుపెట్టుకో. యద్భావం తద్భవతి. నువ్వు ఏవిధంగా ఊహిస్తావో ఆ విధంగానే పరమాత్మ దర్శనం కలుగుతుంది.  భావమన్నది సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అందువలనే సంస్కారాలని సంస్కరించుకోవాలి. అది బహిర్యాగంతోనే సాధ్యం అవుతుంది. సరే జరిగిందేదో జరిగిపోయింది. మరిక దాని గురించి చింత వద్దు. నీకు మళ్ళీ అటువంటి అనుభవం కాదు. ఒక్కటి మాత్రం నిజం. నీకు అమ్మవారి ఆశీస్సులైతే ఉన్నాయి.
నీకు పంచదశీ మహా మంత్రమును ఉపదేశించే సమయం వచ్చింది. ఇక్కడ నుండి నీకు శ్రీవిద్య గురించి మరింత అవగాహన కలుగుతుంది. పంచదశి ఉపదేశం తర్వాత నువ్వు శ్రీచక్ర నవారణ పూజా విధానం కూడా నేర్చుకోవాలి. శ్రీచక్రనవావరణ పూజ శ్రీవిద్యకు ఆత్మ వంటిది. శ్రీచక్రమే అమ్మవారి నివాసస్థానం. చరాచర విశ్వ రహస్యాలన్నీ శ్రీచక్రములో నిగూఢమయ్యి ఉన్నాయి. ఇక్కడ నుండి నీ జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ఈరోజుల్లో శ్రీవిద్యను సశాస్త్రీయ పద్దతుల్లో నేర్చుకోవడం చాలా కష్టం. ఇప్పుడంతా కొత్త శాస్త్రాలు కొత్త పద్దతులు. సనాతన పద్దతులు చాలా మటుకు మరుగున పడిపోయాయి. కానీ మనం ఎంతో అదృష్టవంతులం. ఎందుకంటే మన గురుపరంపర చాలా సనాతనమైనది. మనకు వచ్చిన ఈ సదవకాశాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. ఇప్పటి నుండి నువ్వు సాధనకొరకై మరింత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ఈ విద్య అనంతమైనది. నాకున్న జ్ఞానము ఇసుకరేణువలో వెయ్యోవంతు మాత్రమే. నేను నీకు దారిమాత్రమే చూపుతాను. ఆ దారిలో ప్రయాణించవలసిన బాధ్యత నీదే. ఈ సాధనా క్రమంలో నువ్వు యుద్దం చేయవలసి ఉంటుంది. అదే ఆధ్యాత్మిక యుద్ధం. నిన్ను ప్రలోభపెట్టే వాంఛలు ఒకవైపు ఆధ్యాత్మతరంగాలు ఒకవైపు. అదే ఈ యుద్ధం. ఈ యుద్ధంలో నువ్వు గెలిస్తే ఈ సంఘం నిన్ను ఒక దేవునిలా కొలుస్తుంది. లేకపోతే అదే సంఘం నిన్ను దోషిలా చూస్తుంది. కనుక, ఆధ్యాత్మిక సాధనలో సంఘజీవితానికి కొంచెం దూరంగా ఉండటం మేలు. ఈ యుద్ధంలో ఓడినా నువ్వు నిరాశ చెందనవసరం లేదు. ఎందుకంటే అమ్మ తన అపారమైన ప్రేమను మనమీద ప్రసరింపచేసి మరు జన్మలోనైనా మనకు మరొక్క అవకాశం ఇస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అమ్మ తన పిల్లలను ఎప్పుడూ వదలిపెట్టదు. శక్తి ఉపాసన చాలా అపాయకరమైనదని చాలా మంది అంటుంటారు. ఉపాసన సరిగ్గా చేయకపోతే ఏమైన కీడు జరుగుతుందని…అది జరుగుతుందని…ఇది జరుగుతుందని ఏవేవో లేనిపోని భయాలు ప్రచారం చేస్తుంటారు. ఇవ్వన్ని అవగాహనలేని వారి మాటలు. జగద్గురువులు ఆదిశంకరాచార్యులు వారన్నట్టు ప్రపంచంలో చెడ్డకొడుకు ఉండవచ్చు కాని చెడ్డతల్లి ఉండదు. సాధనచేయనివారికన్న చేసేవారు మిన్న కదా. సాధనలో దొర్లే తప్పులగురించి చింతించకుండా గురువు సలహాలు పాటిస్తూ సాధనను చేయాలి. ఏచిన్న అనుమాన్నైన మనసులో ఉంచుకోకుండా గురువును అడిగి తెలుసుకోవాలి. గురువుచెప్పే మాటల మీద నమ్మకం, శ్రద్ధ ఉంచుకోవాలి. శ్రీవిద్యాసాధనలో ఇది ఎంతో ముఖ్యం. మన అంతిమ లక్ష్యం స్వరూపనిరూపణము. ఈ లక్ష్యసాధనలో ఎటువంటి మాయలకు, విచిత్రాలకు (గాల్లో నుండి నగలు సృష్టించడం మొదలగునవి) స్థానంలేదు. అటువంటి మాయలు విచిత్రాలు అశాశ్వతాలు. పరబ్రహ్మమొక్కటే శాశ్వతమైనది. ఆ పరబ్రహ్మమే సత్యం, జ్ఞానం మరియు అనంతం. ఆ శాశ్వతమైన పరబ్రహ్మపదమును చేరుకోవడానికే మనం సాధనచేయాలి. కనుక ఎటువంటి భయాలు పెట్టుకోకుండా సాధనను కొనసాగించు. నీ బాధ, కోపం, సంతోషం అన్నీ ఆమెకే విడిచిపెట్టు. ఆమె ఎప్పుడూ నిన్ను కనిపెట్టుకునే ఉంటుంది.   
తర్వాత గురువుగారు చంచల్ కు పంచదశీ మహామంత్ర దీక్షాముహూర్తాన్ని నిర్ణయించారు.


 

Monday, October 30, 2017

శ్రీవిద్యా ప్రస్థానం-21

శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

21



మర్నాడు చంచల్ కొత్త ఉత్సాహంతో, కొత్త చైతన్యంతో తన సాధనను ప్రారంభించాడు. గురువుగారు వివరించిన ధ్యానశ్లోకముల అర్ధాలను భావించుకుంటూ ఆయా దేవతల రూపాన్ని తన మనస్సులో రూపొందించుకోసాగాడు. గురువుగారు బోధించిన సరియైన మంత్ర సాధనను అమలుపరచుకుంటూ మంత్ర జపం చేయసాగాడు. ఇంతకు ముందుతో పోల్చితే అతని ఆలోచనలు పూర్తిగా కాకపోయినా కొంచెం తగ్గాయి. ఆలోచనలను పూర్తిగా ఎలా అరికట్టాలో అతనికి అంతుచిక్కడంలేదు. ఈ విధంగా రెండు మాసాలు గడిచాయి. ఒక బహుళ చతుర్దశి రోజున అతడు చాలా శ్రద్ధగా బాలాత్రిపురసుందరి మంత్రజపం చేస్తున్నాడు. ఆరోజు అతని మనస్సు ఒకింత నిశ్చలంగా ఉంది. కొంచెంసేపటి తర్వాత అతనికి సన్నగా గాజులశబ్దం, కాళ్ళపట్టీల శబ్దం వినిపించాయి. ఆకర్ష గాని, మోహ గాని ఆ వైపుగా వచ్చి ఉంటారని అతడనుకున్నాడు. వాళ్ళెందుకు ఇటుపక్క రావాలి? నేను జపం చేసుకుంటున్నానని తెలుసు కదా!. అనవసరంగా నా ధ్యానాన్ని భంగపరచడం కాకపోతే. నా జపం ఎంత చక్కగా సాగుతోంది. నాలో ఏదో కొత్త శక్తి పుట్టుతున్నట్టుగా ఉంటోంది. ఇలాంటి అనవసరమైన ఆటంకాలు లేకపోతే నాకు మంత్రసిద్ధి త్వరగా కలుగుతుంది కదా. దేవతా దర్శనం కూడా తప్పక కలుగుతుంది. గురువుగారు నాకు ఈ జపరహస్యాలు ముందుగానే చెప్పవలసింది. నాకెందుకు ముందుగా చెప్పలేదు. గురువులు తన శిష్యులను ఈ విధంగా ఎందుకు పరీక్షిస్తారు? అసలు ఇలాంటి పరీక్షలు అవసరమా? పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. గురువుగారు నన్ను ఇప్పటికైనా కరుణించారు. ఇటువంటి మరిన్ని రహస్యాలను గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. అసలు ఇంకా ఏమైనా రహస్యాలు ఉంటాయా? ఒక దేవతా ఉపాసనకు ధ్యానశ్లోకము, మంత్రములేకదా ముఖ్యం. ఇంతకన్నా ఇంకే రహస్యాలుంటాయి? ఏమో…ఇంకా ఏమైనా ఉంటే అవి గురువుగారి దగ్గర నేర్చుకోవాలి. మంత్రోపాసనలో దిగ్గజడుని కావాలి. అలా కావాలంటే నేను గురువుగారిని ప్రసన్నం చేసుకోవాలి పూర్ణలాగ. గురువుగారికి పూర్ణంటే చాలా ఇష్టంలాగ ఉంది. పూర్ణ గొప్పతనం ఏమిటి? అతడు ఎప్పుడూ గురువుగారి వెంటే ఉంటాడు. గురువుగారు అతనికి కూడా ఈ సాధనా రహస్యాలు చెప్పి ఉంటారా? చెప్పేఉంటారు ఎందుకంటే అతడు గురువుగారిని ఎప్పుడూ వదలడు కదా. సరె, అతని సంగతి నాకెందుకు? నేను గురువుగారి ప్రియశిష్యుని కావాలి. పూర్ణని మించి గొప్ప సాధకుని కావాలి. అప్పుడు అందరూ నాదగ్గరకు కూడా వారి సమస్యలను తీర్చుకోవడానికై వస్తారు. నేను కూడా ఒక గురువుని అవుతాను.

ఈవిధంగా అతని ఆలోచనలు ఒకపక్క, మంత్రజపం ఒకపక్క పరిగెట్టసాగాయి. కాని, హఠాత్తుగా అతని బుద్ధి ఒక్కసారిగా పనిచేసింది. “అరే…నేనేమి చేస్తున్నాను? ఎందుకిలా ఆలోచిస్తున్నాను? నేనీ విధంగా ఆలోచించడం సరియైనదేనా? పూర్ణ మీద నేనెందుకు అసూయ చెందాలి? అతడు ఎంతో గొప్ప ఉపాసకుడు. గురువుగారితో అతడు ఎన్నో గొప్ప విషయాలు చర్చిస్తూ ఉంటాడు. నాకా విషయాలు అసలు అర్ధమేకావు. అలాంటి నేను వారి గురించి ఈ విధంగా ఆలోచించడం ఎంత తప్పు అని తనకు తాను అనుకున్నాడు.
ఇలాంటి పిచ్చి ఆలోచనలను కట్టిపడేయాలి అని చాలా గట్టిగా నిర్ణయించుకొని తిరిగి మంత్రజపం మీద ఏకాగ్రత పెట్టడానికి ప్రయత్నించసాగాడు. ఆ ప్రయత్నంలో అతడు అమ్మవారిని ఈ విధంగా ప్రార్ధించసాగాడు “అమ్మా! నన్ను దయతో రక్షించి, నడిపించు. నా ఈ ఆధ్యాత్మిక ప్రస్థానంలో నన్ను ఉత్తీర్ణుడిని చెయ్యి. నాకు నువ్వు తప్ప మరెవరు ఉన్నారు? నాకు నీ పాదాలే శరణ్యం. నీ సాయుజ్యం తప్ప మరేమీ అక్కర్లేదు. భార్య, పిల్లలు, బంధువులు అనే లౌకిక పరమైన బంధాలనుండి నన్ను విముక్తిడిని చేసి శాస్వతమైన బ్రహ్మపదమునకు నన్ను చేర్చు”.
ఆసమయంలో అతడికి దగ్గరగా ఎవరో కదులుతున్నట్టుగా మళ్ళీ అనిపించింది. అతడికి కొంచెం కోపం వచ్చి వెంటనే కళ్ళు తెరచి ఆ శబ్దం వచ్చిన దిశగా చూసాడు. ఆశ్చర్యంగా అక్కడ అతడికి ఎవరూ కనిపించలేదు. కొన్ని క్షణాలపాటు అతడు నిర్ఘాంతపోయాడు. ఆకర్షను, మోహను గట్టిగా పిలిచాడు. వారినుండి ఎటువంటి సమాధానమూ రాలేదు. ఏంటి ఎవ్వరూ పలకరు అని తనలోనే కొంచెం చికాకు పడ్డాడు. కానీ అంతలోనే అతనికి గుర్తుకొచ్చింది వారిద్దరూ నిద్రపోతున్నారని. తన అనుమానాన్ని తీర్చుకోవడానికై అతడు వారి పడకగది వైపు గబగబా వెళ్ళాడు.


ఇంకావుంది.......