శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
-
శ్రీభువనానంధనాథులు
3
చాలామంది సాధన అంటే
కొన్నిగంటలు ధ్యానంలో కూర్చోవడం లేదా
ఓ మంత్రాన్ని కొన్ని లక్షలు పఠించడం అని
అనుకుంటారు. అది పొరపాటు. ఇలా చాలా మంది చేస్తుంటారు కూడా. కానీ వారు ఆశించినటువంటి ఏ విధమైన ప్రగతి కనిపించదు. నిజానికి
భగవంతుని చేరడానికి చేసే ప్రయత్నాన్ని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాధన అని అంటారు. ఈ
ప్రయాణాన్నే ఉపాసన అని అంటాం. అంటే భగవంతునికి దగ్గరగా వుండడం అని అర్ధం. ప్రతి
నిముషం ప్రతి క్షణం. ఈ శ్వాశ ఉన్నంతవరకు.
సాధన ఎలా మొదలు పెట్టాలి? సాధన అంటే మంత్రసాధన
లేదా ధ్యానము మాత్రమే కాదు. ఒక నిజమైన సాధన తమ తల్లిదండ్రులను గౌరవమర్యాదలతో ఆదరపూర్వకంగా ఆరాధిండంతో ప్రారంభమౌతుంది.
ఇది సాధనలో ప్రతి ఒక్కరూ అనుసరించ వలసిన ముఖ్యమైన ఘట్టం. ఎందుకంటే మన ఈ స్థూలశరీరానికి కారణం మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అంటే
సృష్టి. సృష్టి బ్రహ్మ తత్త్వం. కాబట్టి తల్లిదండ్రులు
బ్రహ్మ స్వరూపులు. తదుపరి వారు ఎన్నో కష్టనష్టాలనోర్చి మనను పెంచి పెద్దచేస్తారు
అదే స్థితి. స్థితి విష్ణు తత్త్వం. కాబట్టి తల్లిదండ్రులు
విష్ణు స్వరూపులు. తమ పిల్లలకు అన్నివిధాల జీవితానికి
కావలసిన అమరికలు కల్పించి చివరకు లోకాన్ని వీడి వెళ్తారు. అంటే లయమవడం. లయం శివతత్త్వం. తల్లిదండ్రులు శివ
స్వరూపులు. అందుకే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు., పనికిమాలిన దొంగ
స్వాముల వెంట, గురువుల వెంట తిరిగితే వచ్చేదేమిటి? పాపం తప్ప.
ఈ మూడు తత్త్వాలకు సంబంధించిన ముఖ్యమైన మూడు శక్తి
మంత్రాల(బాలా,పంచదశి,షోడశి/మహాషోడశి) లో కూడా
మూడు కూటములుంటాయి. ఒక్కో కూటమి వరుసగా సృష్టి,స్థితి,లయాన్నిసూచిస్తాయి. ఇదే ఈ మంత్రాలలో
ఒకవిధంగా అంతరార్థము, అంటే తల్లిదండ్రులు మంత్రస్వరూపులు. అందుకే తల్లిదండ్రుల
పూజ, ఆరాధన అతిముఖ్యము.
ఇందుకు మనకు పాండురంగని(మహారాష్ట్ర) జీవితం ఒక మంచి ఉదాహరణ.
అతడు తల్లిదండ్రుల సేవతోనే ముక్తిని పొందాడు. కాబట్టి సాధనలో
ముందుగా అనుసరించాల్సిన ప్రథమ అంశం తల్లిదండ్రుల సేవ.
తల్లిదండ్రుల సేవకూడా శక్తి మంత్రోపాసనా ఫలితాన్నిస్తుంది.
ప్రత్యక్ష దైవాలని (తల్లిదండ్రులను) వారి
అవసాన దశలో వృద్ధాశ్రమాలలో వదిలి కపట గురువు ఆశ్రమాలచుట్టూ తిరుగుతూ
సాధన, సాధన అంటే మరి ఫలితమేంటీ?
మాతృదేవోభవః, పితృదేవోభవః, ఆచార్యదేవోభవః అని వేదవాక్యం
తల్లిదండ్రుల తరువాత ఆచార్యుడు శిష్యులు తమ ఆచార్యుల
ద్వారా ఙ్ఞాన భోదన పొందుతారు. ఙ్ఞానంలేని స్థూలశరీరం జడమే. విద్యలేని వాడు వింత పశువు. ఇక్కడ విద్య అనగా బ్రహ్మమునకు
సంబంధించిన విద్య.
ఒక ఉదాహరణ చూద్దాం. ఒకరు
వైద్యుడవడానికి వైద్య విద్యనభ్యసించాలి. వైద్యవిద్యా పరిఙ్ఞానం లేకుండా వైద్యుడవడానికి ఆస్కారంలేదు. అంటే పరా లేదా అపర
ఙ్ఞానంలేకుంటే ఈ స్థూలశరీరం ఒక జడపదార్థమే. అందుకే ఆచార్యుడు ఈ జడత్వాన్ని లేదా
అఙ్ఞానాన్ని తొలగించి యోగ్యతను ప్రసాదిస్తారు. అందుకే తల్లిదండ్రుల తరువాత
ఆచార్యుడు ఆరాధించదగిన వారు. శ్రీవిద్యా సాంప్రదాయంలో అతిముఖ్యమైన పాత్ర గురువుది. అందుకే సాధన
తల్లిదండ్రుల, గురువుల ప్రార్థనతో మొదలవుతుంది.
మరి నిజమైన గురువుని ఏవిధంగా గుర్తించాలి? లౌకికంగా, ఇంజనీరింగ్/ మెడికల్ కోచింగ్ సంబంధించి కోచింగ్
సెంటర్లను గురించి, దానిలో భోదించే అధ్యాపకులగురించి, వారు
గతంలో సాధించిన ఫలితాలను గురించి తెలుసుకుని వెళ్ళడం పరిపాటి. కానీ సాధనా విషయంలో మాత్రం అంతర్జాలంలో వెదికి
వారందించే ప్రకటనల ఆధారంగా డబ్బు చెల్లించి సభ్యత్వం తీసుకుని
వారందించే సి.డిల ద్వారా ఇమెల్స్ ద్వారా మంత్రానుష్టానాన్ని
ప్రారంభిస్తుంటారు. అలా చేస్తూ ఎంతో గొప్ప సాధన చేస్తున్నామని
అనుకుంటుంటారు. ఇంకా దీన్ని గురించి ఇతరులకు
సలహాలిస్తారు వారిని ప్రోత్సహిస్తారు. ఇది చాలా తప్పు మరియు ప్రమాదకరం కూడా. ఇది ఎంతో
విచారకరం.
సాధన ప్రారంభించడానికి మొదట శక్తి , అధ్యాత్మిక శక్తి కావాలి. ఈ శక్తి అన్ని జీవాలలో సమానంగా వుంది. కాక పోతే
దీన్ని గుర్తెరగాలి. మన లాంటి సామన్య
వ్యక్తులు ఈ శక్తిని గుర్తించలేరు. మరి మనందరం శ్రీరమణులంతటి వారము కాదు కదా. కానీ సరియైన దిశలో ప్రయత్నిస్తే వచ్చే జన్మలోనైన వారంతటి వారము కాగలమేమో !
మనలోని ఆ శక్తిని గుర్తించ అసమర్థులము కాబట్టి సరైన గురువుల
మార్గదర్శనం పొందాలి. గురువు దొరకడం సులభం కావచ్చేమో గానీ సరైన గురువు లభించడం
ముఖ్యం. ఎందుకంటే మనం వారిని గర్తించలేము. సరైన గురువంటే ఎవరు? సరైన అంటే సాధన ద్వారా తనను
తాను తెలుసుకున్న వారు. ఎందుకు గుర్తించలేమంటే వారేమి భిన్నంగా, విభన్నమైన వేషధారణలో ఉండరు కాబట్టి. ఆర్భాటాలకు, అట్టహాసాలకు దూరం కాబట్టి. వారి
సామర్థ్యాలను గూర్చి వారెన్నటికీ భయటపెట్టరు కాబట్టి, నేటి కుహానా గురువులకు
భిన్నమైన వారు కాబట్టి. వారెప్పుడూ శిష్య సమూహాన్ని వారి
చూట్టూ తిప్పుకొవాలని కాంక్షించరు, ఢాంబికపు శిష్యులనాదరించరు
కాబట్టి.
వారెప్పుడూ చాలా సాదాసీదాగా వుంటారు. బయట ప్రపంచంపై ఎప్పుడూ ఆసక్తి కలిగుండరు. మన అఙ్ఞానంతో, గర్వంతో వారిని
గుర్తించలేము. కాని, ఎవరైతే వారిని గుర్తిస్తారో అది ఆశ్చర్యకరం. వారు
అదృష్టవంతులు. ఎందుకంటే వారి జీవితం గొప్ప మలుపు తిరుగబోతోందని
దాని అర్ధం.
అసలు నిజమైన శిష్యునికి తనకేం కావాలో తనకే తెలియదు. కానీ మనస్సులో ఎదో
తెలియని అలజడి ఎప్పుడూ చెలరేగుతూ ఉంటుంది. ఏదో తెలియని వెలితి. దేనికోసమో
వెంపర్లాట నిత్యం దోబూచులాడుతుంది. ఈ స్థితి
ఆధ్యాత్మికంగా దారి తెలియని శూన్యత. ఎలా... ఎలా అనే
తపన. ప్రాపంచిక విషయాల నుండి విముక్తి కోసం తపన. దేన్నో శోధించాలనే తపన. ఈ తపనే బ్రహ్మవిద్యను
పొందుటకు మొట్టమొదటి అర్హత. నిజమైన గురువే నిజమైన శిష్యుని ఈ
తపనను గ్రహించగలడు. నిజమైన గురువే ఈ తపనను తపస్సుగా
మార్చుటకు మార్గదర్శనం చేయగలడు. మనను అమ్మ ఒడికి చేర్చుటకు సహాయ పడగలడు. నిజానికి గురువే అమ్మ అమ్మే గురువు. అందుకే నిజమైన
శిష్యుని ఆర్తి తీర్చడాని అమ్మ(గురువు) ఎప్పుడూ సంసిద్ధమై
ఉంటారు. కలత చెందిన ఆ బిడ్డని అక్కున చేర్చుకోవడానికి అమ్మ చేతులు చాచి
పిలుస్తూ ఉంటుంది. అమ్మ వైపు అడుగులు వేయవలసిన బాధ్యత ఆ బిడ్డదే….
అందుకే …..
న గురోరధికం, న గురోరధికం,
న గురోరధికం,న గురోరధికం
శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః శివ శాసనతః
No comments:
Post a Comment