SVP Cover Pages

SVP Cover Pages

శ్రీవిద్యా ప్రకాశిక అమ్మ శ్రీయాగాను క్రమ కర దీపిక

Saturday, May 27, 2017

శ్రీవిద్యా ప్రస్థానం - 6


శ్రీవిద్యా ప్రస్థానం
(సాధనా సిద్ధికి ఓ సామాన్యుడి ఆధ్యాత్మికాప్రయాణం)
- శ్రీభువనానంధనాథులు

6




చంచల్-గురువుగారు నిజంగా, ఈ రెంటికి తేడా నాకు తేడా ఎమిటో తెలియదండి.
నిజాయితీ ఇక్కడ గమనించవలసిన విషయము. చాలామంది గురువు దగ్గర కూడా తమకు అన్నీ తెలుసు అన్నట్టుగా డాంబికాలు ప్రదర్శిస్తారు. అటువంటి వారు ఆధ్యాత్మికముగా ఎదగగలరా?
గురుసిద్ధ – తొందరలో నీకే తెలుస్తుంది. రోజు నీ వేమి చేస్తుంటావు?
చంచల్- నేను మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసాను. సాఫ్ట్ వేర్ఇంజనీర్ గా ఓ మంచి కంపెనీలో పనిచేస్తున్నాను.
అదికాదు నేనడిగేది నీ అపరవిద్య గూర్చి కాదు. నేనడుగుతున్నది పరా విద్యను గూర్చి. అంటే నీ ఆధ్యాత్మిక జీవితంనకు సంబంధించి ఏమి చేస్తావని అని గురువుగారు అడిగారు.
నిజమైన గురువుకు శిష్యులయొక్క ఆదాయ, వ్యయాలగురించి, ఆస్తి పాస్తుల గురించి, సంఘంలో పరపతి గురించి పట్టింపు ఉండదు.
చంచల్- నేను రోజు పోద్దున  పది పదిహేను నిముషాలు పూజగదిలో శ్రీలలితా సహస్రనామాలను చదువుతాను.
అతడి సమాధానంలో తొనికిన గర్వభావాన్ని గురువుగారు గ్రహించారు.
గురువుగారు- పది లేదా పదిహేను నిముషాలు మాత్రమేనా? సరే, ఏం చేద్దాం? సంధ్యావందన అర్హత వుందా?
చంచల్- ఉంది గురువు గారు.
గురువుగారు- మరైతే రోజూ సంధ్యావందనమెందుకు చేయవు?
చంచల్- నాకు  ఎనిమిది సంవత్సరాల క్రితం నా వివాహసమయంలో ఉపనయనమయింది. నాకు ఎవరూ సంధ్యావందనం ఎలా చేయాలో చెప్పలేదు. అందుకే చేయటంలేదు.
గురువుగారు-  శ్రద్ధలేకనా ? ఎవరూ చెప్పలేక చేయడం లేదా?
చంచల్- .............
గురువుగారు- సరే కానీ నీకు శ్రీలలితా సహస్రనామాల గూర్చి ఎలా తెలుసు?
చంచలుడు- గురువుగారు నిజంచెప్పలంటే నాకు తెలియదు. నేను నా చిన్నతనం నుండి చదవడం ప్రారంభించాను. నాకు పదునాలుగేళ్ళ వయసులో మా అమ్మనాన్న వాళ్ళు ప్రతి శుభకార్యాలలో చదివేవారు. అప్పుడు నాకు నచ్చి నేనూ చదవడం ప్రారంభించాను. నాకిప్పుడు నలభైఏళ్ళు. ప్రతి రోజూ చదువుతాను.
ఇది విని గురువుగారు సంతోషించారు
గురువుగారు- నాయన, లోకంలో రెండు విద్యలు. ఒకటి పరావిద్య రెండవది అపరావిద్య. అపరా విద్య జీవించడానికి. ఆధ్యాత్మికతతో దీనికి సంబంధంలేదు. పరావిద్య ఆధ్యాత్మికం. ఇంజనీరింగ్, మెడిసిన్, వేదాధ్యయనం, కావ్యాలు, పురాణాలు మొదలైనవి అపరావిద్య. వీటిలో కొంత పూజాది క్రతువులకు సంబంధించినది కూడా వుంటుంది. ఉదాహరణకు గుడిలో పూజారి. నిజమైన బ్రహ్మఙ్ఞానానికి వీటితో సంబంధంలేదు. చాలా మంది ఈ శాస్త్రాలను, వాటి వ్యాఖ్యలను పట్టుకుని వారికెంతో బ్రహ్మఙ్ఞానం వుందని అనుకుంటారు. వారంతా శాస్త్రాన్ని చదివారంతే. వారు వాటిని గురించి చెప్పి మరికొంత మందిని ఉత్సాహపరచగలరంతే. వారిలో చాలామంది బ్రహ్మఙ్ఞానాన్ని అనుభవించి తెలుసుకున్నవారు కాదు. తేడా ఎమిటంటే... ...ఆచరణ. మనం ఢిల్లీ వెళ్ళాలంటే, ప్రయాణం ప్రారంభించనంత వరకు ఢిల్లీ చేరలేము. చాలా మంది విషయంలో దీనిని గూర్చిన స్ఫురణ ఉండదు. నిజానికి స్ఫురణే బ్రహ్మము. దీనిని తెలుసుకోలేరు. కారణం మాయ. ఇది బ్రహ్మఙ్ఞానాన్ని కప్పిఉంచుతుంది. తత్త్వాన్ని గురించి మాట్లడితే ఎవ్వరూ పెద్దగా శ్రద్ధ చూపించరు. అదే లౌకిక విషయాలైన సినిమాలను గురించి, ఇతరుల గురించి, శృంగారం గురించి చర్చిస్తే ఎంతో శ్రద్ధ కనబరుస్తారు. ఎవరికీ అలౌకిక ఙ్ఞానం అవసరంలేదు. అందరూ లౌకికవిషయాసక్తినే కనబరుస్తారు. కానీ అపరవిద్య బ్రతకడానికే కావాలికానీ సుఖాలకొరకు కాదు. సుఖాలపై ఆసక్తితో భౌతికప్రపంచ అనురక్తులై, ఆ విషయాల్లోనే మునిగితేలుతూ అధర్మమార్గాన్ని తొక్కడానికి కూడా వెనుకాడరు. దీనికి తమను తాము వారెంత కష్టపెట్టుకంటున్నారో తెలియదు. ఇది చాలా విచారకరం. ఈ విధమైన తమ జీవితంగూర్చి వారు చాలా గొప్పని అనుకుంటారు. 99.99 శాతం  మంది లోకంలో ఇలాంటి వారే ఉంటారు. ఇది అసలైన విద్య కాదు ఇది తప్పక అవిద్యే.
పరావిద్య మాత్రమే అసలైన విద్య. ఇదే బ్రహ్మఙ్ఞానాన్ని భోదించే అసలైన విద్య. బ్రహ్మఙ్ఞానం పొందడం అంత తేలికకాదు. దీన్ని పొందడానికి కఠోరసాధన చేయాలి. అందుకు ఒక మార్గం శ్రీవిద్యోపాసన.
శ్రీవిద్య అంటే బ్రహ్మవిద్య. శక్తి ఆరాధన చేయడం. ఈ ఉపాసకులను శాక్తేయులు అంటారు. శక్తి ఉపాసన(ఆరాధన) బ్రహ్మవిద్యకు సంబంధించిన ఙ్ఞానం ప్రసాదిస్తుంది. ఎందుకంటే శక్తి – శివఙ్ఞానప్రదాయిని. అయితే ఙ్ఞానం పొందడానికి అపరవిద్యతో కూడిన పూజాదిక్రతువులు నిర్వహించాల్సి ఉంటుంది. శక్తి ఆరాధనకు సంబంధించిన ఈ పూజాక్రతువులు ఆధ్యాత్మిక సాధనలో మన మార్గాన్ని సుగమంచేస్తాయి. అది ఎమిటంటే చిత్తశుద్ధి. ఈ పూజాక్రతువులు చిత్తశుద్ధిని ప్రసాదిస్తాయి. అందుకే శ్రీవిద్యోపాసనలో ఈ పూజాక్రతువులు చెప్పడం జరిగింది. ఇవి బ్రహ్మఙ్ఞానాన్ని పొందడానికి అవసరమైనవి. అయితే ఈ పూజాక్రతువులలోని అంతరార్థాన్ని సాధకుడు తెలుసుకుని, తన అంతరపప్రంచానికి అన్వయించుకుని చేయాలి. అదే బాహ్యత్వం నుండి అంతర్ముఖం కావడం. అప్పుడే అసలైన సత్యం బోధపడుతుంది. ఇదే సాధన. అలాంటి పూజా కార్యక్రమమే శ్రీచక్రపూజ. అయితే ఇలాంటి బ్రహ్మఙ్ఞానానికి సంబంధించిన పూజ ఈ రోజుల్లో భౌతికవిషయవాసనకు వినియోగించడం చాలా బాధాకరమైన విషయం. నిష్కామ శక్తి ఉపాసనతో సాధకుడు తప్పక బ్రహ్మఙ్ఞానాన్ని పొందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దీన్ని అందరూ చేయలేరు. ఎవరికైతే అమ్మవారి అపార కరుణ వుంటుందో వారు మాత్రమే ఈ ప్రయాణం సాగించగలరు. శ్రీవిద్యనే చంద్రకళావిద్య అని కూడా అంటారు.
చంచల్- గురువుగారు, ఒకరికి ఈ విధమైన అనుగ్రహముందని ఎలా తెలుసుకునేది?
గురువుగారు -  తమలో కలిగే విచారభావంతోనే తెలుసుకోగలము. గుర్తుందా! నన్ను మొదట చూచినపుడు నీలో ఎటువంటి భావాలు కలిగాయో? అదే విచారభావం. తత్త్వానికి సంబంధించిన విచారభావమే ఆత్మానుభూతికి మొదటి మెట్టు. ఈ విచారభావం లేని నాడు ఎన్ని పూజలు చేసినా, పురాణాలు వల్లించినా శుద్ధదండగే. అందుకే శ్రద్ధలేని పూజలు, గొంతమ్మ కోరికలతో కూడిన పూజలు ఎప్పటికీ మంచివి కావు. అమ్మదయే కావలిసినవన్ని ప్రసాదిస్తుంది. అందుకేఅమ్మదయవుంటే అన్ని వున్నట్టే’ అని అంటారు.
చంచల్- గురువుగారు, నేనింతవరకు మీరు చెప్పినవిషయాలెక్కడా వినలేదు. కానీ మీరన్నారే నాకు విచారోదయం కలిగిందని, అదెలా సాధ్యం ?
చిరునవ్వు నవ్వి ఇలాచెప్పారు.
గురువుగారు- నీవెలా చెప్పగలవు ఈ భౌతికశరీరంతో ఈ విషయాలెప్పుడూ వినలేదు, సాధన చేయలేదని? నీ వయసు 40సంవత్సరాలని చెప్పావు. కానీ నీ దేహానికి మాత్రమే 40 సంవత్సరాలు. నీ ఆత్మకు వయస్సు అంతకంటే ఎక్కువే! లేకపోతే నీకు నీ చిన్నతనంనుండే శ్రీలలితాసహస్రనామాలు చదువాలని అనిపించేదికాదు. చదువడం ప్రారంభించేవాడివి కాదు. ఎవరైతే శ్రీలలితాసహస్రనామాలను అత్యంత భక్తి భావంతో చదువుతారో వారిలో తప్పక ఈ విచారభావం ఉదయిస్తుంది. దానికి నీవే మంచి ఉదాహరణ.
చంచల్- అబ్బ! అర్థంచేసుకోవడం చాలా కష్టం గురువుగారు.
గురువుగారు – అదే మాయ. ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు. సాధన ప్రారంభించి ముందుకు సాగుతుంటే ఒక్కోక్కటి గా తెలుస్తుంది.
చంచల్- గురువుగారు దయతో నాకు మార్గం చూపి నన్నాశీర్వదించండి.
గురువుగారు – తప్పకుండా, నీవందుకు అర్హుడివి. మొదట నీవు సంధ్యావందనం నేర్చుకోవాలి. రేపటినుండే నీ ఆధ్యాత్మిక యాత్ర ప్రారంభం.
అంతలో మళ్ళీ ఒక శిష్యుడు వచ్చి గురువు గారు హోమానికి అంతా సిద్ధమైంది అని అన్నాడు.
చంచలుడు వంగి గురువుగారి రెండు పాదాలను తాకాడు. గురువుగారు అతని ఆశీర్వదించి యఙ్ఞశాలవైపుకు వెళ్ళారు.
చంచలుడి మనస్సంతా ఇంతవరకూ అనుభవించని దో తెలియని ఆనందంతో నిండిపోయింది. తన గురువుగారి వైపు మరోసారి చూసి, పైకిచూసేసరికి ఆకాశంలో శుక్లపక్ష చంద్రుడు దర్శనమిచ్చాడు. ఇదే అమ్మవారు అనుగ్రహిస్తున్న చంద్రవిద్యకు సంకేతమేమో అనుకున్నాడు. తెల్లవారితే కార్తీక పౌర్ణిమ.

No comments:

Post a Comment